Share News

నిజాలు తెలుసుకుని మాట్లాడాలి

ABN , Publish Date - Jan 23 , 2025 | 04:53 AM

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అనుచరులతో కలిసి తమ భూమిలోకి వచ్చి అక్కడున్న వారిపై దాడి చేయడం సరికాదని భూమి యజమానులు, శ్రీహర్ష కన్‌స్ట్రక్షన్స్‌ భాగస్వాములు ఆలూరి వెంకటేష్‌, ఆలూరి విజయభాస్కర్‌ అన్నారు.

నిజాలు తెలుసుకుని మాట్లాడాలి

  • ఈటల సమయమిస్తే వివరాలు చెప్తాం

  • కొర్రెములలోని 47.25 ఎకరాల భూమి మాదే

  • ‘శ్రీహర్ష’ భాగస్వాములు వెంకటేష్‌, భాస్కర్‌

పంజాగుట్ట, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అనుచరులతో కలిసి తమ భూమిలోకి వచ్చి అక్కడున్న వారిపై దాడి చేయడం సరికాదని భూమి యజమానులు, శ్రీహర్ష కన్‌స్ట్రక్షన్స్‌ భాగస్వాములు ఆలూరి వెంకటేష్‌, ఆలూరి విజయభాస్కర్‌ అన్నారు. ఈ విషయంలో ఈటలను కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు తప్పుదోవ పట్టించారని, ఆయన వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కోరారు. ఈటల సమయమిస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని, కోర్టు తీర్పులను కూడా ఆయన పరిశీలించాలన్నారు. వారు బుధవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పోచారం మునిసిపాలిటీ పరిధి కొర్రెముల గ్రామంలోని సర్వే నంబర్లు 739, 740, 741, 742లో తమకు 47.25 ఎకరాల భూమి ఉందని చెప్పారు.


పక్క సర్వే నంబర్లు 743, 744, 745, 747కు చెందిన వారిలో కొంతమంది తమ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. 2005లో తాము ఈ 47.25 ఎకరాల భూమి కొన్నామని, దీనిపై కొంతమంది కోర్టులకు వెళ్లినా ఏళ్ల తరబడి పోరాటం తర్వాత తమకు అనుకూలంగా తీర్పులు వచ్చాయని తెలిపారు. ఇప్పటివరకు ఆ భూమిని ప్లాట్లుగా చేయలేదని, ఇక్కడ రెండు వేల ప్లాట్లు ఉన్నాయని జరుగుతున్న ప్రచారం అవాస్తమని చెప్పారు. సర్వే నంబర్లు 743, 744, 745, 747లో వేసిన అక్రమ లే అవుట్‌లను హైకోర్టు ఆదేశాలతో అధికారులు రద్దు చేశారని తెలిపారు. తమను రౌడీలు, గుండాలుగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని భూమికి రక్షణ కల్పించడంతో పాటు తమపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.


ఇవి కూడా చదవండి..

BRS.. దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కేటీఆర్

Hyderabad: గ్రేటర్‌లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’

Updated Date - Jan 23 , 2025 | 04:53 AM