Share News

Recruitment Delay: వైద్య ప్రొఫెసర్ల నియామకానికి బ్రేక్‌

ABN , Publish Date - Apr 20 , 2025 | 04:12 AM

తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 612 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకానికి బ్రేక్ పడింది.అడిషనల్‌ డీఎంఈల పదోన్నతులపై ఫైల్ మూడు నెలలుగా జీఏడీ వద్ద పెండింగ్‌లో ఉంది

Recruitment Delay: వైద్య ప్రొఫెసర్ల నియామకానికి బ్రేక్‌

ఆగిన 612 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీ.. తేలని అడిషనల్‌ డీఎంఈల పదోన్నతి.. జీఏడీ వద్ద 3 నెలలుగా ఫైల్‌ పెండింగ్‌

  • 8 మెడికల్‌ కాలేజీల్లో 50% పైగా ఫ్యాకల్టీ ఖాళీలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి బ్రేక్‌ పడింది. అదనపు వైద్య విద్య సంచాలకుల (అడిషనల్‌ డీఎంఈ)పదోన్నతులు చేపట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అడిషనల్‌ డీఎంఈ పదోన్నతుల ఫైల్‌ 3 నెలలుగా సాధారణ పరిపాలన శాఖ వద్ద ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సర్కారీ మెడికల్‌ కాలేజీల్లో 612 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకానికి ఆర్థిక శాఖ ఇప్పటికే అనుమతినిచ్చింది. వాటిని మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా చేపట్టాలని ఆదేశించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. ఈ నెల చివరి నాటికి అది ముగుస్తుంది. అనంతరం మే మొదటి వారంలో ఆ 612 పోస్టుల భర్తీకి మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంది. సచివాలయ ఉన్నతాధికారులు, వైద్య విద్య సంచాలకుల కార్యాలయ వర్గాలు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.


పదోన్నతులకు, నియామకాలకు లింకు..

ప్రభుత్వ వైద్య కళాశాలలకు ప్రిన్సిపాల్స్‌, వాటి అనుబంధ ఆస్పత్రులకు సూపరింటెండెంట్స్‌గా అడిషనల్‌ డీఎంఈ హోదా ఉన్న వారినే నియమించాలన్న నిబంధన ఉంది. ప్రొఫెసర్‌గా ఐదేళ్లపాటు పనిచేసిన వారికి ఏడీఎంఈ పదోన్నతులకు అర్హత వస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో 17 మందే అడిషనల్‌ డీఎంఈలు ఉన్నారు. వారంతా ఆయా కాలేజీలు, బోధనాస్పత్రులకు ప్రిన్సిపాల్స్‌, సూపరింటెండెంట్స్‌గా వ్యవహరిస్తున్నారు. 64 పోస్టులకు గాను 17 మందే ఉండటంతో మిగిలిన 47 అడిషనల్‌ డీఎంఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో మెజారిటీ మెడికల్‌ కాలేజీలు, బోధనాస్పత్రుల్లో ప్రిన్సిపాల్స్‌, సూపరింటెండెంట్స్‌గా ఇన్‌చార్జ్‌లనే నియమించారు. ప్రస్తుతం అడిషనల్‌ డీఎంఈ పదోన్నతుల ఫైల్‌ జీఏడీ వద్ద ఉంది. జీఏడీ డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ(డీపీసీ)పెట్టి పదోన్నతులు కల్పించాలి. కానీ 3 నెలలుగా జీఏడీ వద్ద పదోన్నతుల ఫైల్‌ పెండింగ్‌లో ఉంది. అది క్లియర్‌ అయితేనే ప్రొఫెసర్‌ వెకెన్సీలు ఏర్పడతాయి. ఆ ఖాళీలను సీనియర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్లతో భర్తీ చేస్తారు. అసోసియేట్‌ ప్రొఫెసర్లు.. ప్రొఫెసర్‌గా పదోన్నతులపై వెళితే.. ఖాళీ అయిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను సీనియర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో భర్తీ చేస్తారు. అప్పుడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల ఖాళీలు వెల్లడవుతాయని, వాటి భర్తీకి మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ ఇస్తుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.


పదోన్నతులను వెంటనే చేపట్టాలి

వైద్య విద్య సంచాలకుల పరిధిలోని అడిషనల్‌ డీఎంఈ పదోన్నతులను వెంటనే చేపట్టాలి. ఇప్పటికే పలుమార్లు మా సంఘం తరఫున వైద్య మంత్రి దామోదర రాజనర్సింహ, ఆరోగ్య శాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేశాం. అవి చేపడితేనే కింది స్థాయిలో ఖాళీలు తేలతాయి. అప్పుడే రిక్రూట్‌మెంట్‌కు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మెజారిటీ కాలేజీలు, బోధనాస్పత్రుల్లో రెగ్యులర్‌ ఏడీఎంఈలు లేక ఇన్‌చార్జ్‌లతో నెట్టుకొస్తున్నారు. అలాగే ప్రజారోగ్య సంచాలకుల పరిఽధిలో రెగ్యులర్‌ డీహెచ్‌, సివిల్‌ సర్జన్స్‌, తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ పరిధిలో ప్రొగ్రామ్‌ ఆఫీసర్స్‌, డీసీహెచ్‌ఎ్‌స పోస్టుల పద్నోతులనూ వెంటనే చేపట్టాలి. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా టీవీవీపీలో ఒక్క ప్రమోషన్‌ చేపట్టకపోవడం అన్యాయం.

- డాక్టర్‌. బి.నరహరి, అధ్యక్షుడు,

తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం


ఇవి కూడా చదవండి..

Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..

కేసీఆర్‌ క్యాంపు కార్యాలయానికి టులెట్‌ బోర్డు..


Read Latest
Telangana News And Telugu News

Updated Date - Apr 20 , 2025 | 05:53 AM