Hyderabad: తుమ్మల X ధర్మపురి
ABN , Publish Date - Jan 16 , 2025 | 03:06 AM
జాతీయ పసుపు బోర్డు ప్రారంభం నేపథ్యంలో కాంగ్రె్‌స-బీజేపీల మధ్య క్రెడిట్ వార్ మొదలైంది.. తమ ప్రభుత్వం లేఖ రాయడం వల్లే పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యమైందని

రాష్ట్ర మంత్రి, బీజేపీ ఎంపీ మధ్య పసుపు బోర్డు క్రెడిట్ వార్
రాష్ట్రం లేఖల వల్లే బోర్డు వచ్చిందన్న తుమ్మలపై అర్వింద్ ఫైర్
వయసు మీదపడ్డా ఆయనకు చిలిపి చేష్టలు పోలేదంటూ వ్యాఖ్య
బండి చక్రంపై వాలిన ఈగ ఆ చక్రాన్ని తిప్పినట్టా అని ఎద్దేవా
ఇంత దిగజారుడు భాషనా? సభ్యత కాదని తుమ్మల సీరియస్
హైదరాబాద్/న్యూఢిల్లీ/ఖమ్మం, జనవరి 15, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జాతీయ పసుపు బోర్డు ప్రారంభం నేపథ్యంలో కాంగ్రె్‌స-బీజేపీల మధ్య క్రెడిట్ వార్ మొదలైంది.. తమ ప్రభుత్వం లేఖ రాయడం వల్లే పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యమైందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తుమ్మలకు వయసు మీద పడ్డా చిలిపి చేష్టలు పోలేదన్నారు. ఆయన్ను బండి చక్రంపై వాలిన ఈగతో పోల్చారు. దీనిపై తుమ్మల తీవ్రంగా స్పందించారు. అర్వింద్ వ్యాఖ్యలు అభ్యంతరకరం, ఆక్షేపణీయమని బుధవారం ఓ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఇంత దిగజారుడు భాషనా..? ఇది సభ్యత కాదంటూ ఫైర్ అయ్యారు. తన రాజకీయ జీవితం, వ్యక్తిత్వం గూర్చి బీజేపీ సీనియర్లను అడిగి తెలుసుకోవాలన్నారు. పరిపక్వత లేని మాటలు మాట్లాడకుండా కాస్త సహనంతో రాజకీయ పరిజ్ఞానంతో మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.
నా జీవితం తెరిచిన పుస్తకం: తుమ్మల
‘1983 నుంచి ఇప్పటివరకు నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. పదవుల కోసం, పార్టీ టికెట్ల కోసం ఏనాడు కూడా ఏ నాయకుడి వద్దకెళ్లి నేను మోకరిల్లింది లేదు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రతిక్షణం ప్రజాహితం కోసమే పనిచేశాను. ఎన్టీఆర్ నుంచి రేవంత్‌రెడ్డి వరకు... ఏ సీఎం క్యాబినెట్‌లో పనిచేసినా.. రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, పేదల కోసం పనిచేయటమే తప్ప మరో ఎజెండాతో పనిచేయలేదు. నేను ఏ పార్టీ గుమ్మం ముందు, ఏ నాయకుడి వద్ద సాగిలపడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అయినా, తెలంగాణలో అయినా ఏ మూలకు వెళ్లినా అక్కడి అభివృద్ధి ఆనవాళ్లలో నా గుర్తులు కనిపిస్తాయి. మీరు (అర్వింద్) పుట్టి పెరిగిన నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు కౌలా్‌సనాలా నుంచి గుత్ప లిఫ్ట్ ఎత్తిపోతల వరకు.. ఉమ్మడి రాష్ట్రంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగినవే. ఆ సమయంలో మీ నాన్న డీఎస్ ఉన్నారు.. మీరు ఎక్కడ, ఏ పార్టీలో ఉన్నారో కూడా నాకు తెలియదు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణమైన, నిర్మాణంలో ఉన్న ఏ జాతీయ రహదారిని తీసుకున్నా వాటి మంజూరులో, నిర్మాణంలో నా ప్రయత్నం, ప్రమేయముంది. బీజేపీ పార్టీ నుంచి కేంద్రమంత్రులుగా పనిచేస్తున్న నితిన్ గడ్కరీ, కిషన్‌రెడ్డిలను అడిగితే వారే చెబుతారు. నా రాజకీయ జీవితం, వ్యక్తిత్వం గూర్చి మీ పార్టీ సీనియర్లు సీహెచ్ విద్యాసాగర్‌రావు, బండారు దత్తాత్రేయ, కె.లక్ష్మణ్‌లను అడిగి తెలుసుకోండి. మీరు మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినపుడు ప్రజలకు రాసిచ్చిన బాండ్ పేపరు గూర్చి నేనెక్కడా ప్రస్తావించలేదు. జాతీయ పసుపు బోర్డు సాధనకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా నేను కేంద్రంపై ఒత్తిడి తెస్తూ వచ్చాను. పసుపు బోర్డు ప్రకటించిన తర్వాత ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపాను. దీంట్లో మీకున్న అభ్యంతరమేంటి? బోర్డు ప్రకటన, ఏర్పాటులో మీరు సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించలేదు. అయినా రైతుల ప్రయోజనాల దృష్ట్యా సంయమనం పాటించాం. అర్వింద్ తన స్థాయిని దిగజార్చుకొని మాట్లాడుతున్నారు.. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా..’ అని తుమ్మల పేర్కొన్నారు.
తుమ్మల వయసుకు తగ్గట్లు ప్రవర్తించాలి: అర్వింద్
తుమ్మలకు వయసు మీద పడిన చిలిపి చేష్టలు పోలేదని అంతకుముందు ఎంపీ అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పసుపు బోర్డును కేంద్ర మంత్రి ప్రారంభించిన అనంతరం ఎంపీ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం ప్రభుత్వం లేఖలు రాయటం వల్లే పసుపు బోర్డు వచ్చిందని తుమ్మల ప్రకటన చేయటాన్ని విలేకరులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అర్వింద్ బదులిస్తూ.. ఎడ్లబండి వెళ్తున్నప్పుడు తుమ్మల అనే ఈగ వాలి తానే చక్రాలను తిప్పుతున్నట్లు భావిస్తుందని ఎద్దేవా చేశారు. వయసు మీదపడ్డ తుమ్మల పార్టీలు మారుతూనే ఉన్నారని.. ఆయన వయసుకు తగ్గట్లు ప్రవర్తించాలన్నారు. ‘తుమ్మల కంటే ముందు మహబూబ్‌నగర్‌కు చెందిన నిరంజన్‌రెడ్డి వ్యవసాయ మంత్రిగా ఉండేటోడు. వీళ్లకు సొంత భూములున్నాయి. వీళ్లు మినీ కేసీఆర్‌లు.. సిల్లీ కామెంట్స్.. సిల్లీ ఫెలోస్..’ అని మండిపడ్డారు.