Land Disputes: సీపీఐ నేత దారుణ హత్య
ABN , Publish Date - Jul 16 , 2025 | 04:33 AM
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చందు నాయక్ 50 దారుణహత్యకు గురయ్యారు.

సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చందు నాయక్‌పై కాల్పులు
హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఘటన
కారులో వచ్చి ఐదురౌండ్ల కాల్పులు జరిపిన నలుగురు దుండగులు
అక్కడికక్కడే చందునాయక్ మృతి
ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే హత్య?
చాదర్‌ఘాట్, జూలై 15(ఆంధ్రజ్యోతి): సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చందు నాయక్ (50) దారుణహత్యకు గురయ్యారు. స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం మలక్‌పేట పరిధిలోని శాలివాహన నగర్ పార్కు వద్ద చందు నాయక్ వాకింగ్ చేస్తుండగా కారులో నలుగురు దుండగులు అక్కడికొచ్చారు. చందు నాయక్‌ను వెంబడించి ఆయన కళ్లలో కారంకొట్టి.. తుపాకీతో ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. మూడు బుల్లెట్లు ఆయన శరీరంలోకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. వచ్చిన కారులోనే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. మలక్‌పేట సీఐ నరేశ్ తన సిబ్బందితో ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. ఘటనా స్థలంలో రెండు బులెట్లను పోలీసులు గుర్తించారు. సీసీ పుటేజీ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. సౌత్‌ఈస్టు జోన్ డీసీపీ చైతన్య కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చందు నాయక్ స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం నర్సాయిపల్లి గ్రామం. ఆయన సీపీఎంఎల్ పార్టీలో క్రీయాశీలకంగా ఉండేవారు. కొన్నాళ్ల తర్వాత సీపీఐలో చేరారు. అప్పట్లో ఇదే పార్టీకి చెందిన మాజీ నక్సలైట్ రాజేశ్‌తో చందునాయక్ సన్నిహితంగా ఉంటూ నాగోల్‌లోని సాయిననగర్‌లో గల ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేయించారు. అగ్నిప్రమాదంలో గుడిసెలు దగ్ధం కావడంతో.. భాను అనే వ్యక్తి గుడిసె కూడా కాలిపోయింది. అప్పట్లో చందు నాయక్, రాజేశ్ కలిసి భానుకు గుడిసె వేయించి అండగా నిలిచారు. కాగా భాను.. గుడిసెవాసులతో ప్రత్యేకంగా గ్రూప్ ఏర్పాటు చేసుకొని నాయకుడిగా చలామణి అయ్యాడు. ఈ క్రమంలో చందు నాయక్-భాను మధ్య వివాదం తెలెత్తింది. చందునాయక్.. భానుకు వ్యతిరేకంగా ఉన్న కొందరిని కూడగొట్టుకొని 2022 ఏప్రిల్‌లో అతడిని హత్య చేయించినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
భాను మృతదేహాన్ని కారులో తరలించి ఖమ్మం జిల్లా పాలేరు సమీపంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువలో పడేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. భాను హత్యకు పథకం వేయడం, నిందితుల బెయిల్, కోర్టు ఖర్చులన్నీ చందునాయక్ చూసుకున్నట్లు పోలీసులు తేల్చారు. భాను హత్యకేసులో చందునాయక్‌ను ఏ-2గా చేర్చారు. ఇక హయత్‌నగర్ కుంట్లూరులో రావి నారాయణరెడ్డి నగర్‌లోని ఖాళీ స్థలంలో మరోమారు సీపీఐ ఆధ్వర్యంలో నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారు. ఇందులో కూడా చందు నాయక్ జోక్యం చేసుకొని తన అనుయాయులకు గుడిసెలు వేయించేందుకు ప్రయత్నించగా రాజేశ్ అడ్డుపడ్డట్లు సమాచారం. గుడిసెలు వేయించినందుకుగాను ఒక్కొక్కరి నుంచి రూ.40 వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేశారని.. ఆ సొమ్ము పంపకాల్లో విభేదాలు తల్తెడంతో చందునాయక్, రాజేశ్ మధ్య వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ ల్యాండ్ సెటిల్‌మెంట్ల విషయంలోనూ వీరి మద్య వివాదాలు తలెత్తడంతో ప్రత్యర్థులుగా మారిపోయినట్లు తెలుస్తోంది.
ముందురోజు రాత్రి రెక్కీ
ఇద్దరి మధ్య తలెత్తిన వివాదాల నేపధ్యంలో చందు నాయక్ హత్యకు రాజేశ్ పథకం వేసినట్లు తెలిసింది. సోమవారం రాత్రి చందు నాయక్ ఇంటి సమీపంలో రెక్కి నిర్వహించినట్లు సమాచారం. ఇంటి బయట కొందరు తచ్చాడుతున్నట్లు కనిపించడాన్ని గుర్తించిన చందు నాయక్ భార్య నారిబాయి.. భర్తను అప్రమత్తం చేసింది. దీంతో చందు నాయక్ రాత్రి ఇంటి నుంచి బయటికి రాలేదు. మంగళవారం ఉదయం ఇంటి పరిసరాల్లో ఎవరూ కనిపించకపోవడంతో భార్య, కూతురు సింధూతో కలిసి ఆయన వాకింగ్ కోసం బైక్‌పై శాలివాహన పార్క్‌కు బయల్దేరారు. ఉదయం 6:10కు బూడిద రంగు కారు, లోపల రాజేశ్, మరికొందరిని నారిబాయి గుర్తించి భర్తను అప్రమత్తం చేసింది. జనం తచ్చాడుతుండటంతో తనకేమీ కాదంటూ ఆమెకు చెప్పి.. తన స్నేహితులైన డాక్టర్ నాగరాజు, అంజయ్యతో కలిసి ఆయన వాకింగ్ చేశారు. కొద్దిసేపటికి.. స్నేహితులతో కలిసి జ్యూస్ తాగేందుకు పార్క్ వెస్ట్ గేట్ నుంచి బయటకొచ్చారు. చందు నాయక్ తన బైక్ వైపు వెళుతుండగా కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు చందు నాయక్ కళ్లలో కారం చల్లారు. వెంటనే ఆయన బిగ్గరగా కేకలు వేస్తూ.. పార్కువైపు పరుగెడుతుండగా ముగ్గురు వ్యక్తులు వెంబడించి కాల్పులు జరిపారు. తూటాలు తగలడంతో చందునాయక్ అక్కడికక్కడే కుప్పకూలారు. భార్య నారిబాయి, కూతురు సింధూ మృతదేహం వద్ద భోరున విలపించారు. తన భర్తను చంపిన వారిని, వారు ఉపయోగించిన కారును గుర్తు పడతాననని నారిబాయి పోలీసుల ఎదుట చెప్పింది. మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. చందునాయక్ కుమారుడు సిద్దు లండన్‌లో ఉన్నతచదువులు చదువుతుండగా.. కూతురు సింధు గ్రూప్స్‌కు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. కాగా ఈ హత్య ఘటనకు సంబంధించి రాజేశ్, ఇతర నిందితులు పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది.