Nampally Court: లగచర్ల రైతులకు ఊరట
ABN , Publish Date - Jul 30 , 2025 | 04:19 AM
లగచర్ల ఘటనలో వికారాబాద్ జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో పాటు మరో 70 మందికి కోర్టులో ఊరట లభించింది.

కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు
కొడంగల్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): లగచర్ల ఘటనలో వికారాబాద్ జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో పాటు మరో 70 మందికి కోర్టులో ఊరట లభించింది. వారు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరుకాకుండా ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణ సమయంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఇతర అధికారులపై దాడి జరిగిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డితో పాటు మరో 70 మంది రైతులపై కేసులు నమోదయ్యాయి. వారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించగా అప్పట్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరయింది.
మంగళవారం నాంపల్లిలోని ప్రజా ఆస్తుల విధ్వంస నిరోధక చట్ట ప్రత్యేక న్యాయస్థానం (పీడీపీపీ స్పెషల్ కోర్టు)లో జరిగిన విచారణకు మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డితో పాటు మిగతా వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డితో పాటు మిగతా నిందితులు హాజరయ్యారు. వారి తరపున న్యాయవాది జక్కుల లక్ష్మణ్ వాదిస్తూ పొలాలకు వెళ్లాల్సిన రైతులు కోర్టుకు వస్తున్నారని తెలిపారు. రోజువారీ పనులు చేసుకునేందుకు వీలుగా వారికి కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీంతో ఏకీభవించిన న్యాయస్థానం అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది.