Share News

Congress: ఓబీసీ ఓటు బ్యాంకుపై ఏఐసీసీ కన్ను

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:05 AM

దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తోడు.. ఓబీసీ ఓటుబ్యాంకుపైనా కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి పెట్టిందా? ఈ విషయంలో తెలంగాణకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రెండు బీసీ రిజర్వేషన్‌ బిల్లులనే అస్త్రాలుగా వాడేందుకు సిద్ధమైందా..

Congress: ఓబీసీ ఓటు బ్యాంకుపై ఏఐసీసీ కన్ను

తెలంగాణ బీసీ రిజర్వేషన్‌ బిల్లులే అస్త్రాలుగా కేంద్రంపై ఒత్తిడి!.. పాలుపంచుకోనున్న రాహుల్‌, ఖర్గే

  • రేపు వాయిదా తీర్మానాలిచ్చేందుకు సిద్ధం

  • 6న ధర్నాలోనూ పాల్గొనేందుకు రెడీ

  • తాము వచ్చాక రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తేస్తామని ప్రకటన?

  • రేపు ఢిల్లీకి రేవంత్‌.. 3రోజులపాటు మకాం!

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తోడు.. ఓబీసీ ఓటుబ్యాంకుపైనా కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి పెట్టిందా? ఈ విషయంలో తెలంగాణకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రెండు బీసీ రిజర్వేషన్‌ బిల్లులనే అస్త్రాలుగా వాడేందుకు సిద్ధమైందా? అంటే.. ఈ ప్రశ్నలన్నింటికీ కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లపై మంగళ, బుధ, గురువారాల్లో (5, 6, 7 తేదీల్లో) ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, బీసీ ప్రజాప్రతినిధులు చేపట్టిన ఒత్తిడి కార్యాచరణలో ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్‌గాంధీ, మల్లికార్జునఖర్గే కూడా పాలుపంచుకోనుండడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నాయి. వాస్తవానికి ఓబీసీలను ఆకట్టుకునేందుకు దేశ వ్యాప్తంగా కులగణన, ‘ఎవరు ఎంతో... వారికి అంత వాటా’ అనే నినాదాలను గత ఎన్నికల ముందే కాంగ్రెస్‌ పార్టీ తెరపైకి తీసువచ్చింది. అయితే ఆ నినాదాన్ని ఆయా వర్గాలకు అర్థమయ్యే రీతిలో తీసుకెళ్లలేక పోయింది. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు.. తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే, ఆ సర్వే ఆధారంగా బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లుల ఆమోదం అంశాలను ముందుపెట్టి దేశవ్యాప్త ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. ఇటీవల ఏఐసీసీ కార్యాలయం ఇందిరాభవన్‌లో పార్టీ ఎంపీలకు ఈ బిల్లులపై సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. బీసీ బిల్లుల ఆమోదానికి సంబందిఇంచి.. కేంద్రం పై ఒత్తిడి తెచ్చే కార్యాచరణలో సహకరించాల్సిందిగా పార్టీ ఎంపీలను ఆ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. 5,6,7 తేదీల్లో నిర్వహించే ఈ ఒత్తిడి కార్యాచరణలో పార్టీ ఎంపీలతో పాటు రాహుల్‌, ఖర్గే కూడా పాలు పంచుకుంటున్నారు. ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌ను కల్పించకుండా కేంద్రంలోని బీజేపీ అడ్డుకుంటోందన్న సంకేతాన్ని ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా పంపనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి.. రిజర్వేషన్లపై ఉన్న 50శాతం పరిమితిని ఎత్తివేస్తామన్న హమీని ఓబీసీలకు రాహుల్‌ ఇవ్వనున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి.


ఉభయసభల్లో..

బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులనూ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ.. మంగళవారంనాడు పార్లమెంటు ఉభయ సభల్లోనూ కాంగ్రెస్‌ వాయిదా తీర్మానాలు ఇవ్వనుంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌, రాజ్యసభలో ఖర్గే వీటిని ఇవ్వనున్నారు. పార్టీ ఎంపీలతో కలిసి.. ఆ వాయిదా తీర్మానాలపై చర్చ కోసం పట్టుపట్టనున్నారు. చర్చకు అనుమతిస్తే.. బీసీ బిల్లులతో పాటు కులగణన, రిజర్వేషన్ల అమలుపై ఉన్న 50 శాతం పరిమితి ఎత్తివేత తదితర అంశాలపై పార్టీ విధానాన్ని రాహుల్‌, ఖర్గే స్పష్టం చేయనున్నట్లు చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహిస్తున్న ధర్నాలోనూ వారిద్దరూ పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఈ అంశంపై ఈ నెల 7న రాష్ట్రపతిని కలవనున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, బీసీ ప్రతినిధుల బృందానికీ రాహుల్‌ నేతృత్వం వహించనున్నట్లు చెబుతున్నారు. ఒత్తిడి కార్యాచరణలో భాగంగా.. సీఎం రేవంత్‌ రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులతో మూడు రోజులూ అక్కడే మకాం వేసి ఒత్తిడి కార్యాచరణను అమలు చేయనున్నారు. 7న రాష్ట్రపతిని కలిసిన తర్వాత.. ఆయన తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.


ప్రత్యేక రైల్లో 1200 మంది..

జిల్లాకు పాతిక మంది చొప్పున కాంగ్రెస్‌ పార్టీ బీసీ నాయకులు, పార్టీ రాష్ట్ర నేతలు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు.. అంతా కలిపి 1200 మంది దాకా ప్రతినిధులు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రత్యేక రైల్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరనున్న ఈ రైలు మంగళవారంసాయంత్రం ఢిల్లీకి చేరుకోనుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ ఇదే రైల్లో నాగపూర్‌ వరకు ప్రయాణించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్..

కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..

ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 04 , 2025 | 04:05 AM