Hyderabad: మెట్రో ఫేజ్-2 అనుమతులు ఇప్పించండి
ABN , Publish Date - Jun 20 , 2025 | 03:49 AM
హైదరాబాద్ మెట్రో ఫేజ్ - 2కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

కేంద్రంతో కలిసి ఉమ్మడిగా చేపట్టేందుకు సిద్ధం
కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి
హైదరాబాద్ మెట్రో ఫేజ్ - 2కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో గురువారం కేంద్ర మంత్రి ఖట్టర్‌తో ఆయన సమావేశమయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్ 2 అవసరం ఎంతో ఉందని, రూ.24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడిగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
మెట్రో ఫేజ్ 2 సాకారమైతే నగరంలో రాకపోకల వేగం పెరగడంతోపాటు రహదారులపై రద్దీ తగ్గుతుందని చెప్పారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుందన్నారు. పట్టణ వ్యవహారాల శాఖ సూచన మేరకు అవసరమైన సవరణలు చేసి డీపీఆర్ సమర్పించామని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో మెట్రో ఫేజ్ 2 ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.