Share News

Chilukuru Balaji Temple: రంగరాజన్‌కు సీఎం ఫోన్‌..

ABN , Publish Date - Feb 11 , 2025 | 05:32 AM

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఉన్నతాధికారులను ఆదేశించారు.

Chilukuru Balaji Temple: రంగరాజన్‌కు సీఎం ఫోన్‌..

  • అండగా ఉంటామని భరోసా

  • చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు

  • అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశం సనాతన ధర్మంపై దాడి: కిషన్‌రెడ్డి

  • రంగరాజన్‌ను పరామర్శించిన సురేఖ

  • దాడులను సహించం: శ్రీధర్‌బాబు

  • శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు: కేటీఆర్‌

  • దాడికి కారణాలను పోలీసులు నిగ్గుతేల్చాలి: పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని స్పష్టం చేశారు. రంగరాజన్‌కు ఫోన్‌ చేసి పరామర్శించి, ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, అండగా ఉంటామని రంగరాజన్‌కు భరోసా ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా తన దృష్టికి తేవాలని సూచించారు. త్వరలోనే చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శిస్తానని చెప్పారు. సోమవారం సాయంత్రం చిలుకూరు ఆలయానికి వచ్చిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య రంగరాజన్‌ను పరామర్శించారు. ఆయన సీఎంకు ఫోన్‌ చేసి రంగరాజన్‌తో మాట్లాడించారు. సనాతన ధర్మ పరిరక్షణకు అంకిత భావంతో సేవలందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తున్న రంగరాజన్‌పై దాడి అమానుషమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలని పేర్కొన్నారు.


కేంద్ర మంత్రి బండి సంజయ్‌.. రంగరాజన్‌కు ఫోన్‌ చేసి పరామర్శించారు. హిందూ సంఘాల పేరుతో దాడులు చేయడం హేయమని పేర్కొన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా రంగరాజన్‌ను పరామర్శించారు. రంగరాజన్‌పై దాడిని ఆర్‌ఎ్‌సఎస్‌ ఖండించింది. రంగరాజన్‌ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. రామరాజ్యం సంస్థ పేరుతో రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తూ రావణరాజ్యం చేయాలనుకుంటే సహించేది లేదన్నారు. ‘రామరాజ్యం’ పేరుతో అరాచకాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. రంగరాజన్‌పై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. రంగరాజన్‌ను కేటీఆర్‌ పరామర్శించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్‌, సౌందరరాజన్‌ కుటుంబ పరిస్థితి ఇలా ఉందంటే.. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. రామరాజ్యం సంస్థ సభ్యులమంటూ వెళ్లిన ఒక మూక రంగరాజన్‌పై దాడి చేయడం వెనుక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కోరారు. తెలంగాణ శ్రీవైష్ణవ సేవా సంఘం, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ బ్రాహ్మిణ్‌ అసోసియేషన్‌, భాగ్యనగర అర్చక పరిషత్‌ ప్రతినిధులు, బాసర సరస్వతి ఆలయ అర్చక వైదిక బృందం, అర్చక, ఉద్యోగ జేఏసీ, అర్చక, ఉద్యోగుల సంఘం ప్రతినిధులు రంగరాజన్‌పై దాడిని ఖండించారు.


  • 23 మంది నిందితులను గుర్తించాం

  • 11 మంది తెలంగాణ, 12 మంది ఏపీకి చెందిన వారు.. ఆరుగుర్ని అరెస్టు చేశాం

  • ప్రధాన నిందితుడిది అనపర్తి: పోలీసులు

రాజేంద్రనగర్‌/అనపర్తి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): రంగరాజన్‌పై దాడిలో మొత్తం 25మంది పాల్గొనగా 23 మందిని గుర్తించామని రాజేంద్రనగర్‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ తెలిపారు. ఇందులో 12 మంది ఏపీ వారు కాగా, తెలంగాణ వాళ్లు 11 మంది ఉన్నారన్నారు. ప్రధాన నిందితుడు కొవ్వూరి వీరరాఘవరెడ్డిని ఇప్పటికే అరెస్టు చేయగా, సోమవారం మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. రామరాజ్యం పేరుతో ఆర్మీ ఏర్పాటు చేసుకున్న వీరరాఘవరెడ్డి ఈ నెల 6న చిలుకూరు ఆలయానికి వెళ్లి డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడని తెలిపారు. రంగరాజన్‌ ఒప్పుకోకపోవడంతో దాడి చేశాడన్నారు. వీర రాఘవరెడ్డిపై 2015లో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైందన్నారు. అరెస్టైన నిందితుల్లో నిజామాబాద్‌కు చెందిన సాయన్న, ఖమ్మంకు చెందిన గోపాల్‌, శ్రీను, శిరీష, బేబిరాణి ఉన్నట్లు మొయినాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ పవన్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. వీరరాఘవరెడ్డి.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన వాడు.

Updated Date - Feb 11 , 2025 | 05:32 AM