Share News

Revanth Reddy Petition: నాపై బీజేపీ పెట్టిన కేసు కొట్టేయండి

ABN , Publish Date - Apr 24 , 2025 | 04:59 AM

సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ పెట్టిన వ్యక్తిగత కేసును కొట్టేయాలని హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దిగువ కోర్టులో విచారణను నిలిపివేస్తూ, తుది తీర్పు వరకు హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు

Revanth Reddy Petition: నాపై బీజేపీ పెట్టిన కేసు కొట్టేయండి

  • హైకోర్టులో సీఎం రేవంత్‌రెడ్డి క్వాష్‌ పిటిషన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రతిష్ఠలకు భంగం కలిగేలా తాను వ్యాఖ్యలు చేసినట్లు నాంపల్లి కోర్టులో నమోదై విచారణలో ఉన్న ప్రైవేట్‌ కేసును కొట్టేయాలని పేర్కొంటూ సీఎం రేవంత్‌రెడ్డి హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 2024 మే 5న కొత్తగూడెంలో నిర్వహించిన జన జాతర సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తొలగిస్తుందని తప్పుడు ఆరోపణలు చేశారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదు చేశారు. రేవంత్‌రెడ్డి బీజేపీ నేత అమిత్‌ షా మార్ఫింగ్‌ వీడియోను ప్రచారం చేశారని.. రిజర్వేషన్లు తొలగిస్తామని స్వయంగా అమిత్‌ షా చెప్పినట్లు తప్పుడు ఆరోపణలు చేశారని.. తద్వారా బీజేపీ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించడంతోపాటు ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ప్రైవేటు ఫిర్యాదును విచారణకు స్వీకరించిన దిగువ కోర్టు.. వాంగ్మూలాలను నమోదు చేస్తోంది. కాగా, ఈ కేసును కొట్టేయాలని.. హైకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌లో తుది తీర్పు వెలువడే వరకు దిగువ కోర్టు ఎదుట హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం సహా అన్ని ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు.

Updated Date - Apr 24 , 2025 | 04:59 AM