CM Revanth Reddy: మహిళలకు రైస్ మిల్లులు
ABN , Publish Date - Mar 09 , 2025 | 02:52 AM
రాబోయే రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు ఏర్పాటు చేసే బాధ్యతను తాను తీసుకుంటానని సీఎం రేవంత్ చెప్పారు.

వడ్ల నిల్వకు గోదాములు కూడా
మహిళా స్వయం సహాయక సంఘాల
ఆధ్వర్యంలో మండలానికి ఒకటి చొప్పున నిర్మాణం
మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకిచ్చే బాధ్యత సంఘాలకే
ధాన్యం బొక్కుతున్న పందికొక్కులకు జవాబిదే..
వెయ్యి ఆర్టీసీ బస్సులకు మహిళలే యజమానులు
వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తీ వారికే
చంద్ర గ్రహణం తొలగి ఆడబిడ్డలకు స్వేచ్ఛ.. వెలుగు
టన్నెల్ కూలినా.. పంట ఎండినా బీఆర్‌ఎస్ నేతల
పైశాచిక ఆనందం.. దానితో ఎవరూ బాగుపడలే
పరేడ్‌గ్రౌండ్‌లో భారీగా నిర్వహించిన
మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్
ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీ ఆవిష్కరణ
మహిళా సంఘాలకు రూ.22,794 కోట్ల చెక్కు
హైదరాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): రాబోయే రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు ఏర్పాటు చేసే బాధ్యతను తాను తీసుకుంటానని సీఎం రేవంత్ చెప్పారు. ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్న వడ్లను రాబోయే రోజుల్లో వారే నిల్వ చేసుకునేలా స్థలాలు ఇచ్చి, గోదాములు కట్టిస్తామని తెలిపారు. అలాగే, ఆ వడ్లను మిల్లింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి సరఫరా చేసే బాధ్యతను మహిళా సంఘాలకే అప్పగిస్తామని వెల్లడించారు. ఇందుకు మండలానికో రైస్ మిల్లును నిర్మించి మహిళా సంఘాలకు ఇస్తామని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క అధ్యక్షతన సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో లక్షమంది మహిళలతో శనివారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సమావేశంలో ఆయన ‘ఇందిరా మహిళా శక్తి మిషన్-2025’ పాలసీని ఆవిష్కరించారు. 2,82,552 మహిళా సంఘాలకు రూ.22,794 కోట్ల చెక్కును అందజేశారు. మహిళలకు 31 పెట్రోల్ బంకులు, 128 సోలార్ ప్లాంట్స్ అందించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా పథకాల కింద రూ.44.80 కోట్ల చెక్కును అందజేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో టీజీఎ్‌సఆర్టీసీలో నడిపే 20 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘కోటి మందిని కోటీశ్వరులను చేద్దామా!?’ అంటూ మహిళలతో నినాదాలు చేయించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘ఐకేపీ కేంద్రాల నుంచి వడ్లు తీసుకుంటున్న కొందరు మిల్లర్లు పంది కొక్కుల్లా వాటిని కాజేస్తున్నారు. వాటిని తిరిగి ఇవ్వడం లేదు. లెక్కలూ చెప్పడం లేదు. ఆ దొంగలను వదలం. వారికి బుద్ధి చెబుతాం. అదే సమయంలో, రైస్ మిల్లులు, గోదాములు నిర్మించేలా మహిళా సంఘాలను ప్రోత్సహిస్తాం. ప్రభుత్వమే స్థలం ఇవ్వడంతోపాటు వాటి నిర్మాణాలకు అవసరమైన రుణాలూ ఇప్పిస్తుంది. తద్వారా దొంగలకు గుణపాఠం చెప్పినట్లు అవుతుంది. ఒక అన్నగా ఇది నా బాధ్యత’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు పౌష్టికాహారం మహిళా సంఘాల నుంచి సరఫరా చేయాలని నిర్ణయించామని చెబుతూ.. అందుకు ఓ విధానాన్ని రూపొందించే బాధ్యతను సీఎ్‌సకు, సెర్ప్ సీఈవోకు అప్పగించారు.
పైశాచిక బీఆర్‌ఎస్ నేతలు
‘‘ఎస్‌ఎల్‌బీసీలో టన్నెల్ కూలి మనుషులు చనిపోతే బీఆర్‌ఎస్ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా చనిపోయినా.. కాలేజీ కూలినా.. పంట ఎండినా.. రేవంత్‌ను తిట్టవచ్చంటూ నన్ను తిట్టడంలో పైశాచిక ఆనందం పొందుతున్నారు. వాళ్లు ఎందుకంత పైశాచిక ఆనందం పొందుతున్నారు. పైశాచిక ఆనందంతో ఎవరూ బాగుపడిన దాఖలాల్లేవు. అది రాష్ట్రానికి మంచిది కాదు’’ అంటూ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిందని, పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు ఏడుపులు మాని.. రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రానికి పదేళ్లు చంద్ర గ్రహణం పట్టింది. మహిళా శక్తి ముందు చంద్ర గ్రహణం అంతరించిపోయింది. ఇవాళ రాష్ట్రంలో ఆడబిడ్డలు స్వేచ్ఛను, సమానత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని చూస్తున్నారు. చంద్ర గ్రహణం తొలగి.. ఇవాళ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు వెలుగులు చూస్తున్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన చూశారు. అప్పట్లో మహిళల పట్ల పాలకులు వివక్ష చూపారు. ఆనాడు సీఎంగా ఉన్న చంద్రశేఖర్ రావు తన మొదటి ఐదేళ్లలో ఆడబిడ్డను మంత్రివర్గంలోకి కూడా తీసుకోలేదు. కమీషన్లకు కక్కుర్తి పడి విద్యార్థులకు యూనిఫాంలు కుట్టించే పనిని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించారు. ఇప్పుడు మా 15 నెలల పాలన చూస్తున్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చాక మహిళా సంఘాలను ఏకీకృతం చేస్తున్నాం. ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాం. అందులో భాగంగానే ఆడబిడ్డలకు పాఠశాలల నిర్వహణ బాధ్యతలను అప్పగించాం. 1.30 కోట్ల జతల విద్యార్థుల యూనిఫాంలను కూడా మహిళా సంఘాల ద్వారానే కుట్టిస్తున్నాం. గతంలో రూ.25గా ఉన్న కుట్టుకూలిని రూ.75కు పెంచాం’’ అని వివరించారు. ఇందిరమ్మ పాలనలో కొండా సురేఖ, సీతక్క మంత్రులుగా పని చేస్తున్నారని, మరెంతో మందికి సముచిత స్థానం కల్పించామని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ శక్తి.. ఎన్టీఆర్ యుక్తి స్ఫూర్తిగా తీసుకుని ఆడబిడ్డల అభివృద్ధికి పని చేస్తానని సంకల్పం చెప్పుకొన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేస్తేనే రాష్ట్రం ఆర్థికంగా పురోగమిస్తుందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసినప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని స్పష్టం చేశారు.
ఆర్టీసీ బస్సులకు మహిళలే యజమానులు
కేసీఆర్ బంధువులు, పెట్టుబడిదారులకే పరిమితమైన ఆర్టీసీ బస్సుల లీజులను మహిళలకు అప్పగించామని, రవాణా శాఖ ద్వారా 1000 విద్యుత్తు బస్సులను మహిళలు తిప్పేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తొలి విడతలో 150 బస్సులను ఆడబిడ్డలకు అప్పగిస్తున్నామని, ఆర్టీసీ బస్సులకు మహిళలనే యజమానులను చేస్తున్నామని వివరించారు. ‘‘అదానీ, అంబానీలు మాత్రమే నిర్వహించే సోలార్ విద్యుత్తు ప్లాంట్లను మహిళా సంఘాల చెంతకు చేర్చాం. ఆయా సంఘాలు వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లను నిర్వహించడమే కాకుండా అవి ఉత్పత్తి చేసే విద్యుత్తును విద్యుత్తు శాఖకు అమ్మేలా చేశాం. సోలార్ విద్యుత్తు ఒప్పందాలు చేసుకున్నామంటే ఆడబిడ్డలపై మాకు ఉన్న నమ్మకమే కారణం’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల్లో 65 లక్షల మంది సభ్యులు ఉన్నారని, కోటి మందిని కోటీశ్వరులను చేయాలంటే సంఘాల్లోని సభ్యుల సంఖ్యను పెంచాలని సూచించానని రేవంత్ చెప్పారు. అందుకు నిబంధనలు అడ్డు వస్తుంటే.. వాటిని కూడా సవరించామని, 15 నుంచి 65 ఏళ్ల వరకు ఉన్న వారిని సభ్యులుగా చేర్పించాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కార్పొరేట్ కార్యాలయాల తరహాలో ప్రతి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి భవనాలు ఉండాలని 25 కోట్ల చొప్పున జిల్లాలకు నిధులు ఇచ్చామన్నారు.
రేవంతన్నగా బాధ్యత తీసుకుంటున్నా..
‘‘మొదటి తరంలో ఇందిరా గాంధీని ‘అమ్మా’ అని పిలుచుకున్నారు. రెండో తరంలో ఎన్టీఆర్‌ను ‘అన్నా’ అని అన్నారు. ఇవాళ నన్ను ‘రేవంతన్న’ అని మీరంతా పిలుస్తున్నారు. నన్ను కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారు. అన్న అంటే ఆ కుటుంబాల బాధ్యత తీసుకోవడమే. ఇది పేగు బంధానికి అతీతమైనది. అందుకే, కుటుంబ సభ్యుడిగా ఆడబిడ్డలకు అండగా ఉంటాను. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నానంటే అది ఆడబిడ్డల ఆశీర్వాదమే’’ అని రేవంత్ అన్నారు. శిల్పారామం వద్ద కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా 150 దుకాణాలను మహిళలకు అందించామని, మహిళా సంఘాలు వారి ఉత్పత్తులను అంతర్జాతీయంగా పోటీ పడి విక్రయించాలని కోరారు. భవిష్యత్తులో సంఘాల నుంచి చేతి వృత్తుల ద్వారా వచ్చే ఉత్పత్తులకు పన్ను మినహాయింపు కూడా ఇస్తామన్నారు.
మహిళల ప్రగతి కోసం రేవంత్ సర్కారు కృషి: సీతక్క
అభద్రతాభావం నుంచి ఆత్మవిశ్వాసం వరకు, ఆర్థిక కష్టాల నుంచి సంపద సృష్టించే స్థాయికి, వివక్షత నుంచి వికాసం దిశగా... మహిళల ఆర్థిక, సామాజిక ప్రగతికి రేవంత్‌రెడ్డి సర్కారు కృషి చేస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఎస్‌హెచ్‌జీ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు 20కిపైగా వ్యాపారాలను ముందుకు తెచ్చామన్నారు. మహిళలు లక్షాధికారుల నుంచి కోటీశ్వరులుగా ఎదగాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. పథకాలను ప్రతి మహిళా సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడమేకాకుండా ఆర్టీసీ అద్దె బస్సులకు ఆడబిడ్డలు యజమానులయ్యారని తెలిపారు. 600 బస్సులకు యజమానులను చేసేందుకు వచ్చిన ఆర్టీసీ శాఖకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్‌ఎస్ పాలకులు పందికొక్కుల్లా తిన్నారు
ఏ రోజూ ఆడబిడ్డలను పట్టించుకోలేదు
పరేడ్ గ్రౌండ్ మహిళా శక్తి సభలో భట్టి
హైదరాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల పాలనలో రాష్ట్ర ఆదాయం, చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పుల సొమ్మును బీఆర్‌ఎస్ పాలకులు పందికొక్కుల్లా తిన్నారు తప్ప.. ఏ రోజూ మహిళా అభ్యున్నతి, డ్వాక్రా సంఘాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఇందిరా మహిళా శక్తి సభలో ఆయన మాట్లాడారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. వడ్డీ లేని రుణాలు ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుకున్నామని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ఇందిరా క్రాంతి పథకాన్ని(ఐకేపీ) గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. స్వయం సహాయక సంఘాల గురించి మాట్లాడటానికి అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ నాయకులకు సమయం ఇవ్వకుండా నియంతృత్వంగా వ్యవహరించారని మండిపడ్డారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఈ ఏడాది రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని తాము నిర్ణయిస్తే.. ఇది సాధ్యమేనా..? అంటూ హేళన చేశారని అన్నారు. పదేళ్లలో రాష్ట్ర ఆదాయం, అప్పుల సొమ్మును పందికొక్కుల్లా తిన్నారు తప్ప.. మహిళా సంఘాలకు కనీసం రూ.10 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదన్నారు. తాము రూ.20 వేల కోట్ల రుణాలిస్తామని చెప్పి.. రూ.21 వేల కోట్లు ఇచ్చి చూపించామని తెలిపారు. ఈ రుణాలను వ్యాపారంలో పెట్టడానికి మార్గం చూపామని చెప్పారు. మహిళా స్వయం సహాయక సంఘాలను సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతో 1,000 మెగావాట్లకు ఎంవోయూలు చేయించామని భట్టి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో..
Car Accident: అంతా చూస్తుండగానే అదుపుతప్పిన కారు.. క్షణాల్లోనే..