CBN Birthday: తెలుగుజాతి అభ్యున్నతికి పునరంకితమవుతా
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:10 AM
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం.. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పునరంకితమవుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన ‘ఎక్స్’లో ధన్యవాదాలు తెలియజేశారు.

2047 నాటికి ప్రపంచంలోనే శక్తిమంతంగా ఉండాలి
నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు : చంద్రబాబు
అమరావతి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం.. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పునరంకితమవుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన ‘ఎక్స్’లో ధన్యవాదాలు తెలియజేశారు. ‘75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో, 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నాకు ఎప్పుడూ తోడునీడగా ఉండి, ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజాసేవ చేసేందుకు నాలుగోసారి సీఎంగా అవకాశం కల్పించిన తెలుగు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలుగు సమాజం పురోగతి కోసం అలుపు లేకుండా పనిచేసేలా మీరంతా నాలో ఉత్సాహం నింపారు. మీ భవిష్యత్ కలలు, ఆకాంక్షలను సాకారం చేయడానికి నిరంతరం కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నాను’ అని ప్రజలకు హామీ ఇచ్చారు. స్వర్ణాంధ్ర- 2047 విజన్ అందరి ఆకాంక్షల సమాహారమన్నారు. అందరి సహకారంతో ఆ కలను నిజం చేస్తానని తెలిపారు. ‘2047నాటికి ప్రపంచంలోనే శక్తిమంతమైన జాతిగా తెలుగుజాతిని నిలపాలన్నది నా అభిలాష. ఏపీని ప్రపంచ ఆవిష్కరణలకు, అవకాశాలకు కేంద్రం గా తీర్చిదిద్దాలన్నదే నా తపన, ‘థింక్ గ్లోబల్లీ- యాక్ట్ గ్లోబల్లీ’ విధానంతో రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీ కేంద్రం గా తీర్చిదిద్దుకుందాం. పేదరికం లేని సమాజమే నా సంకల్పం. అందుకే పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మూడు దశాబ్దాల నాడు నేను ప్రవేశపెట్టిన జన్మభూమి సమాజంలో ఎంతో మార్పు తెచ్చింది. ఈసారి తీసుకొచ్చిన పీ4 రాష్ట్రంలోని పేద కుటుంబాలను స్వర్ణ కుటుంబాలుగా చేయాలన్నది నా ప్రయ త్నం. దేశభక్తి చాటేలా వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు చేయిచేయి కలుపుదాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
చంద్రబాబుకు శుభాకాంక్షల వెల్లువ
హైదరాబాద్/బంజారాహిల్స్/నార్సింగి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబుకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు దేవుడు చంద్రబాబుకు మరింత శక్తినివ్వాలని కోరుతున్నానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమై పనిచేసే చంద్రబాబు ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. చంద్రబాబుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీబర్త్‌డే చంద్రబాబు నాయుడు (సీబీఎన్)అంటూ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు ప్రకటించారు. చంద్రబాబుకు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ల వయస్సులో కూడా యువలోకం ఊహించే నవలోకం సృష్టించే సత్తా చంద్రబాబులో ఉందని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డు సభ్యుడు నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నాయకులు 75 కిలోల కేక్ కట్‌చేశారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అరవింద్ కుమార్‌గౌడ్, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నాయకులు చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యుల పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు బంటు వేంకటేశ్వర్లు, నందమూరి సుహాసిని, కాట్రగడ్డ ప్రసూన, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో కె. రాజేంద్రకుమార్, సీఓఓ గోపి తదితరులు పాల్గొన్నారు.
బసవతారకం ఆస్పత్రిలో..
వయస్సుతో నిమిత్తం లేకుండా ఏపీ రాజధాని అమరావతిని హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని ఎన్టీఆర్ మనవళ్లు నందమూరి చైతన్యకృష్ణ, గారపాటి శ్రీనివాస్ అన్నారు. సీబీఎన్ ఫోరం, బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సంయుక్తాధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండోఅమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఆవరణలో చంద్రబాబు జన్మదిన వేడుకల్లో వారు పాల్గొని మాట్లాడారు. మణికొండ పంచవటి కాలనీలో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్. నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
తిరుమలలో ‘భాష్యం’ ఒకరోజు అన్నదానం
చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం తిరుమలలో ఒకరోజు అన్నదానం చేశారు. భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ఇందుకోసం రూ. 44 లక్షలు విరాళంగా అందజేశారు.
హ్యాపీ బర్త్‌డే టూ యూ..
సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం చంద్రబాబునాయుడి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు.. భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తినివ్వాలని కోరుకుంటున్నానంటూ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఫొటోను కూడా రేవంత్ ట్యాగ్ చేశారు.
Also Read:
క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి
థాకరే, రాజ్ మధ్య సయోధ్యపై బీజేపీ ఆసక్తికర వ్యాఖ్యలు
గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి
For More Telangana News and Telugu News..