Share News

RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం ట్రాఫిక్‌పై మళ్లీ సర్వే!

ABN , Publish Date - Mar 03 , 2025 | 04:22 AM

రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తరభాగం నిర్మాణానికి కేంద్రం ఆమోదం విషయంలో మరోసారి బ్రేక్‌ పడింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత దానిపై ఎన్ని వాహనాలు తిరుగుతాయి?

RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం ట్రాఫిక్‌పై మళ్లీ సర్వే!

  • డీపీఆర్‌లో సమగ్ర వివరాలు లేవన్న కేంద్రం

  • రీ సర్వేకు నిర్ణయం.. ఆ తరువాతే ఆమోదం!

  • కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రీ సర్వే

  • ఆ మార్గంలో ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయ్‌?

  • ప్రయాణించే వారి అభిప్రాయాలు ఏమిటి?

  • తదితర సమగ్ర వివరాల సేకరణ

  • త్వరితగతిన ముగించాలని సర్కారు నిర్ణయం

హైదరాబాద్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తరభాగం నిర్మాణానికి కేంద్రం ఆమోదం విషయంలో మరోసారి బ్రేక్‌ పడింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత దానిపై ఎన్ని వాహనాలు తిరుగుతాయి? ఏడాదికి ఎన్ని వాహనాలు పెరుగుతాయి? వాటి వల్ల వచ్చే ఆదాయం ఎంత? అన్నది తేలిన తర్వాతే ఆమోదం తెలపాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం ఈ రోడ్డుపై తిరిగే వాహనాలు, ట్రాఫిక్‌ రద్దీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రీసర్వే చేపట్టనున్నాయి. వాస్తవానికి ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం నిర్మాణం సహా డిజైన్‌, ఇతర అంశాలకు సంబంధించి ఓ సంస్థ డీపీఆర్‌ సిద్ధం చేసి కేంద్రానికి అందజేసింది. అయితే ఈ డీపీఆర్‌లో ట్రాఫిక్‌కు సంబంధించి పొందుపరిచిన వివరాలు సరిగా లేవని, మళ్లీ రీ సర్వే చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల ఢిల్లీలో జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ అధికారులతో వార్షిక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగంపై చర్చించిన అధికారులు.. రోడ్డు నిర్మాణానికి టెండర్లు జారీ చేసిన విషయంపైనా చర్చించారు. ఆ క్రమంలోనే రహదారిపై ట్రాఫిక్‌కు సంబంధించి కూడా మాట్లాడారు. ఆ సందర్భంగా రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత దానిపై తిరిగే వాహనాల సంఖ్య, ఏడాదికి ఎన్ని వాహనాలు పెరుగుతాయి, వాటి వల్ల వచ్చే ఆదాయం సహా పలు అంశాలపై డీపీఆర్‌లో పేర్కొన్న వివరాలు సమగ్రంగా లేవని కేంద్ర అధికారులు అన్నట్టు తెలిసింది. దీనిపై డీపీఆర్‌ అందించిన సంస్థ ప్రతినిధులతోనూ మాట్లాడినట్లు సమాచారం. ఏ విధానంలో వాహనాలను లెక్కగట్టారు, ప్రస్తుతం ఉత్తరభాగం మార్గంలో ఉన్న రోడ్డుపై రోజుకు ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయి, రింగురోడ్డు నిర్మాణం జరిగాక ఏడాదికి వాహనాల వృద్ధిశాతం ఎంత ఉంటుందనే అంశాలపై ఆరా తీశారు. అయితే దీనిపై ఆ సంస్థ ఇచ్చిన సమాధానంతో కేంద్ర అధికారులు సంతృప్తి చెందలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఉత్తరభాగం రోడ్డుకు సంబంధించి తాము రీసర్వే చేయిస్తామని రాష్ట్ర, ఎన్‌హెచ్‌ఏఐ అఽధికారులకు ఆ సంస్థ చెప్పినట్లు సమాచారం.


రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనూ రీ సర్వే..

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగంలో 161కిమీల మేర నిర్మించే రోడ్డును ఐదు ప్యాకేజీలుగా విభజించి రూ.7,104 కోట్లతో గతేడాది డిసెంబరు 27న ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు మొదట ఈ ఏడాది ఫిబ్రవరి 14 వరకు అవకాశం ఇవ్వగా, తాజాగా దానిని మార్చి12 వరకు పెంచారు. ఈ క్రమంలోనే టెండర్లను త్వరితగతిన ఖరారు చేయాలని, ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులు కేంద్రానికి సూచించారు. ఆ సందర్భంగానే డీపీఆర్‌లో ట్రాఫిక్‌కు సంబంధించిన వివరాలు సరిగా లేవనే అంశం తెరపైకి వచ్చింది. ట్రాఫిక్‌ రద్దీ, టోల్‌ వసూలు ఆశాజనకంగా లేకపోతే రోడ్డు నిర్మాణం భారమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకోసమే ఉత్తరభాగం రోడ్డు మార్గంలో ప్రస్తుతం తిరిగే వాహనాలు, నిర్మాణం తరువాత ఏటా ఎంతమేర వాహనాల వృద్ధి శాతం పెరిగే అవకాశాలున్నాయనే పూర్తి వివరాల కోసం రీ సర్వే చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఇదే మార్గంలో ట్రాఫిక్‌పై సర్వే చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ రీసర్వే చేపట్టనుంది. ఇందుకోసం రాష్ట్ర పరిశ్రమల శాఖ, హెచ్‌ఎండీఏ పరిధిలో ఇప్పటికే ఉన్న ప్రాథమిక నివేదికను ఆర్‌అండ్‌బీ తెప్పించుకుంది. దానిని పరిశీలించిన తరువాత రీ సర్వే ఎలా నిర్వహించాలి, ఏదైనా సంస్థకు ఈ బాధ్యత అప్పగించాలా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. రీ సర్వేను త్వరగా పూర్తిచేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.


ప్రయాణికుల వాహనాలపైనా సర్వే..

ఆర్‌అండ్‌బీ రీ సర్వేలో వచ్చిన వివరాలు, మరోవైపు కేంద్రం చేపట్టే రీ సర్వేలో వచ్చే వివరాలతో.. ఇప్పటికే ఉన్న డీపీఆర్‌లోని వివరాలను పోల్చి చూడనున్నారు. ఆ తరువాత దీనిపై ఓ నిర్ణయం తీసుకుని, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టేబోయే రీ సర్వేలో రవాణా సరఫరా చేసే వాహనాలతోపాటు ప్రయాణికుల వాహనాలు ఎన్ని తిరుగుతున్నాయి, ఏ ప్రాంతాల నుంచి ఎటువైపునకు ప్రయాణం ఎక్కువగా జరుగుతోందనే వివరాలనూ సేకరించనున్నారు. ‘ఆరిజన్‌-డెస్టినేషన్‌’ విధానంలో ఈ సర్వే చేస్తారు. ఈ విధానంలో ప్రస్తుతం ఉన్న రోడ్లపై ప్రయాణిస్తున్న వారితో మాట్లాడతారు. కొత్తగా నిర్మించే రోడ్డు అందుబాటులోకి వచ్చిన తరువాత కొత్త రోడ్డుపై వెళ్తారా, లేక పాత రోడ్డునే వినియోగిస్తారా అనే దానితోపాటు మరికొన్ని విషయాలను అడిగి తెలుసుకుని ట్రాఫిక్‌ను అంచనా వేస్తారు.


డీపీఆర్‌లో ఏం చెప్పారంటే..

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగానికి సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐకి ఇచ్చిన డీపీఆర్‌ ప్రకారం రోడ్డు నిర్మాణాన్ని ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) విధానంలో నిర్మిస్తేనే లాభదాయకమని తెలిపింది. ప్రాజెక్టు కోసం చేసే ఖర్చు, నికర మార్కెట్‌ విలువలు, రహదారి నిర్మాణం తరువాత వసూలు చేసే టోల్‌ చార్జీల ద్వారా వచ్చే ఆదాయాన్ని గణించిన తరువాతే ఈపీసీ పద్ధతిలో నిర్మిస్తే లాభదాయకమని వివరించింది. కాగా రోడ్డు నిర్మాణం తరువాత 2027 (అప్పటికి రహదారి అందుబాటులోకి వస్తే) నుంచి 2046 వరకు టోల్‌ వసూళ్ల ద్వారా దాదాపు రూ.15,768కోట్ల రాబడి ఉంటుందని పేర్కొంది. అయితే ఇది ఏటా 5శాతం చొప్పున వాహనాల పెరుగుదల ఉంటేనే అని నివేదికలో స్పష్టం చేసింది. వాహనాల పెరుగుదల అంశాలపై స్పష్టత లేకే రీ సర్వేకు వెళ్తున్నట్టు అధికార వర్గాలు అంటున్నాయి.


ట్రాఫిక్‌ సర్వే చేశారిలా..

రహదారి నిర్మాణానికి సంబంఽధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసిన సంస్థ ట్రాఫిక్‌ రద్దీపై ఔటర్‌ రింగు రోడ్డుతోపాటు పలు జాతీయ రహదారులపై సర్వే చేపట్టింది. ఆ వివరాలను డీపీఆర్‌లో పొందుపరిచింది. దీని ప్రకారం.. కారు/జీపు/వ్యాను, మినీ బస్‌, ప్రభుత్వ బస్సు, ప్రైవేటు బస్సు, లైట్‌ మోటర్‌ వెహికల్‌ గూడ్స్‌, లైట్‌ కమర్షియల్‌ వెహికల్స్‌ (4/6 చక్రాల బండ్లు), టూ యాక్సిల్‌ ట్రక్స్‌, త్రీ యాక్సిల్‌ ట్రక్స్‌, మల్టీ యాక్సిల్‌ వెహికల్స్‌ కలిపి ఇలా 9 రకాలుగా వాహనాలను విభజించి ‘ఆరిజన్‌-డెస్టినేషన్‌’ విధానంలో వాహనాల సర్వే చేపట్టారు. అత్యవసర సమయం (పీక్‌ అవర్‌) కింద సాయంత్రం 6-7 గంటల సమయంలోనూ సర్వే చేశారు. కాగా, ఎన్‌హెచ్‌-65 గిర్మాపూర్‌ వద్ద చేపట్టిన సర్వేలో సుమారు 15,178 పాసింజర్‌ కార్‌ యూనిట్‌ (పీసీయూ)లు, ఎన్‌హెచ్‌-161 సంగారెడ్డి-నాందేడ్‌ వద్ద 9,172, ఎన్‌హెచ్‌-765డి రోడ్డుపై నర్సాపూర్‌-మెదక్‌ వద్ద 13,834 చొప్పున వాహనాలు తిరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ (ఎన్‌హెచ్‌-44) రోడ్డుపై ఉన్న ఒక టోల్‌ప్లాజా వద్ద నిర్వహించిన సర్వేలో 26,161 పీసీయూలు, హైదరాబాద్‌-వరంగల్‌ (ఎన్‌హెచ్‌-163) హైవేపై టోల్‌ప్లాజా వద్ద 31,491, హైదరాబాద్‌-విజయవాడ (ఎన్‌హెచ్‌-65)పై టోల్‌ప్లాజా వద్ద 50,826 చొప్పున వాహనాలు తిరుగుతున్నట్టు డీపీఆర్‌లో పేర్కొన్నారు. వీటితోపాటు మరికొన్ని చోట్ల కూడా సర్వే నిర్వహించారు. కాగా, రోజువారీ సగటు ట్రాఫిక్‌, వార్షిక సగటు రోజువారీ ట్రాఫిక్‌ కింద పటాన్‌చెరు, దుండిగల్‌, మేడ్చల్‌, షామీర్‌పేట, ఘట్కేసర్‌ ప్రాంతాల్లో కూడా ఆయా వాహనాల విభాగాల వారీగా ట్రాఫిక్‌ సర్వే చేసి, ఆయా వాహనాల సంఖ్యను కూడా పొందుపరిచారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: SLBC Incident: ఎస్ఎల్‌బీసీ ప్రమాదాన్ని రాజకీయం చేయడం తగదు

Also Read: సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు టైం దొరికింది

Also Read: ఏపీలో కన్‌స్ట్రక్షన్ ఎక్స్ పో.. ఎక్కడంటే..

Also Read: కుమార్తె కోసం పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కిన కేంద్ర మంత్రి

Also Read : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి చురకలు

Also Read: మహాకుంభమేళ ప్రాంతం ప్రస్తుతం ఎలా ఉందంటే..

Updated Date - Mar 03 , 2025 | 04:22 AM