Hospital: బ్లడ్ బ్యాంకుల్లో దొంగలు!
ABN , Publish Date - Feb 22 , 2025 | 03:38 AM
ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రక్త నిధి కేంద్రాలపై పర్యవేక్షణ కరువైంది. కొందరు సిబ్బంది.. యఽథేచ్ఛగా రక్తాన్ని అమ్మేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంకులో అర్ధరాత్రి వేళ అక్కడ పనిచేసే ఓ ఉద్యోగే బ్లడ్ బ్యాగులను దోపిడీ చేశారు.

నీలోఫర్‌లో రక్తం బ్యాగుల చోరీ.. సిబ్బందే సూత్రధారులు
సీసీ కెమెరాల్లో రికార్డు.. వెనకేసుకొస్తున్న ఉన్నతాధికారులు
రాష్ట్రంలో ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులపై పర్యవేక్షణ కరవు
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రక్త నిధి కేంద్రాలపై పర్యవేక్షణ కరువైంది. కొందరు సిబ్బంది.. యఽథేచ్ఛగా రక్తాన్ని అమ్మేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంకులో అర్ధరాత్రి వేళ అక్కడ పనిచేసే ఓ ఉద్యోగే బ్లడ్ బ్యాగులను దోపిడీ చేశారు. బాలింతలు, చిన్నారులకు అత్యవసర సమయంలో వినియోగించాల్సిన రక్తాన్ని ఇలా బయటకు పంపి.. సొమ్ము చేసుకుంటున్నారు. ఆ విషయం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆ ఫుటేజీ తాజాగా ‘ఆంరఽధజ్యోతి’ చేతికి చిక్కింది. అయితే, రక్తం ప్యాకెట్ల దొంగతనం ఇదే మొదటిసారి కాదని, బ్లడ్ బ్యాంకులో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని అక్కడి సిబ్బందే చెబుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది నుంచి పైస్థాయి వరకు ఎవరికి అందాల్సిన వాటాలు వారికి చేరుతుండడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. నీలోఫర్ బ్లడ్ బ్యాంక్‌లో బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్(బీబీఎంవో), నర్సింగ్ ఆఫీసర్, ఒక కౌన్సిలర్, ఆరుగురు ల్యాబ్ టెక్నీషియన్స్(ఎల్టీలు) పని చేస్తున్నారు. వీరితో పాటు ల్యాబ్ అసిస్టెంట్, ఒక వార్డు బాయ్, ఇంటర్నీ, ఎల్టీలపై పర్యవేక్షణకు ఒక టెక్నికల్ సూపర్ వైజర్ కూడా ఉన్నారు. బ్లడ్ బ్యాంకుపై నర్సింగ్ ఆఫీసర్ పర్యవేక్షణ చేయాలి. బీబీఎంవో ఎప్పటికప్పుడు ఆడిట్ చేయాలి. కానీ అక్కడ ఇటువంటిదేమీ జరగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్లడ్ బ్యాగ్‌లపై ఉండే ఆస్పత్రి స్టిక్కర్లను తొలగించి, బయటకు తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రధానంగా ట్రాన్స్‌పరెంట్ బ్యాగ్‌ల విషయంలో లెక్కాపత్రం ఉండటం లేదని చెబుతున్నారు. సాధారణంగా బ్లడ్ బ్యాగుల్లో లీకేజీలు, డ్యామేజీలు ఉంటాయి. దీన్నే అక్రమార్కులు ఆయుధంగా వాడుకుని.. రక్తం బ్యాగులను అమ్మేసుకుంటున్నారు. సింగిల్ బ్లడ్ డోనర్ బ్యాగ్ అయితే ప్రైవేటులో రూ. 13-15 వేల దాకా ఉంటుంది. ఇక, అరుదైన బ్లడ్ గ్రూపు రక్తానికి బయట చాలా డిమాండ్ ఉంది. కొన్ని సందర్భాల్లో వాటిని కూడా బయటకు తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నీలోఫర్ బ్లడ్ బ్యాంకులో జరుగుతున్న అక్రమాలపై తక్షణమే పూర్థిస్థాయిలో విచారణ జరిపి, బాఽధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో అక్కడి ఉన్నతాధికారుల పాత్రపైనా ఆరా తీయాలని వైద్య సిబ్బంది కోరుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని బ్లడ్ బ్యాంకులపై పర్యవేక్షణ కొరవడుతోంది. బ్లడ్ బ్యాంకుల్లోకి ఎంత రక్తం వస్తుంది? ఎంత బయటకు వెళ్తుంది? అనే అంశాలను పరిశీలించే వారే లేరు. ఇదే అదునుగా కొన్ని చోట్ల రక్తం బ్యాగులను గుట్టుగా అమ్మేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. గత ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకు ఒక సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్ (ఎస్డీపీ) యంత్రాలను కొనుగోలు చేసి పంపారు. మార్కెట్‌లో ఆ మిషన్ ధర రూ.18-20 లక్షల దాకా ఉంటే.. ఏకంగా రూ.40లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఆయా యంత్రాలను సరఫరా చేసే కంపెనీలే ఎస్డీపీ కిట్స్‌ను అందిస్తామని అగ్రిమెంట్ చేసుకున్నాయి. కానీ, ఏడాది పాటు ఎస్డీపీ కిట్లను అందించిన సంస్థలు.. ఆ తర్వాత వాటి సరఫరాను నిలిపివేశాయి. దీంతో ఎస్డీపీ యంత్రాలున్నప్పటికీ... ఉపయోగం లేకుండా పోయింది. ఇక, బ్లడ్ బ్యాంకుల్లో పని చేసే సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలూ ఇవ్వడం లేదు. మొత్తంగా బ్లడ్ బ్యాంకులపై పర్యవేక్షణ కొరవడి, నిర్వీర్యమవుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.