Share News

BJP: బీజేపీని బద్నాం చేయడానికి కుట్ర

ABN , Publish Date - Aug 03 , 2025 | 04:45 AM

బీజేపీని బద్నాం చేయడానికే సీఎం రేవంత్‌ ఢిల్లీ వెళుతున్నారని, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు విమర్శించారు.

BJP: బీజేపీని బద్నాం చేయడానికి కుట్ర

బీసీ రిజర్వేషన్లపైనా రేవంత్‌రెడ్డి రాజకీయం.. అమలు చేయడం చేతగాక కేంద్రంపై నిందలు

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వ్యాఖ్యలు

  • రాహుల్‌ మెప్పు కోసమే స్థాయికి మించి మాటలు

  • సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

  • బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ మహాధర్నా

కవాడిగూడ/హైదరాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): బీజేపీని బద్నాం చేయడానికే సీఎం రేవంత్‌ ఢిల్లీ వెళుతున్నారని, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు విమర్శించారు. బీసీలకు మాత్రమే 42శాతం రిజర్వేషన్‌ను వర్తింపజేయాలని, అందులో ముస్లింలకు ప్రతిపాదించిన 10శాతాన్ని తొలగించాలని డిమాండ్‌ చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ అమలు చేయడం చేతగాని రేవంత్‌.. కేంద్రంపై నిందలు మోపుతున్నారని దుయ్యబట్టారు. రేవంత్‌కు ఢిల్లీ వెళ్లడం అలవాటేనని, కానీ.. ఆయనకు రాహుల్‌ అపాయింట్‌మెంట్‌ మాత్రం దక్కడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో శనివారం ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలోనూ బీసీలను మోసం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీసీల హక్కులను మజ్లిస్‌ హరిస్తుంటే, కాంగ్రెస్‌ కాలరాస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ నుంచి బీసీలను దూరం చేసేందుకే కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ‘‘బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ బిల్లు తెచ్చింది మీరు.. అమలు చేయాల్సిన బాధ్యత కూడా మీదే.. మాపై రాళ్లేయడం ఏంటి? కేంద్రంలో 27 మంది ఓబీసీలు మంత్రులుగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఐదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు.. మీ హయాంలో ఒక్క బీసీనైనా సీఎంను చేశారా?’’ అని కాంగ్రె్‌సను నిలదీశారు. రాహుల్‌ మెప్పు కోసమే సీఎం రేవంత్‌రెడ్డి స్థాయికి మించి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. మోదీ కన్వర్టడ్‌ బీసీ అంటూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... విశ్వబ్రాహ్మణులు కన్వర్టెడ్‌ బీసీలా? లంబాడాలు కన్వర్టెడ్‌ ఎస్టీలా?.... సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు.


దశాబ్దాల తరబడి అధికారంలో ఉండి.. బీసీ గణన చేయనందుకు పార్లమెంట్‌ ఎదుట రాహుల్‌గాంధీ ముక్కు నేలకు రాయాలని డిమాండ్‌ చేశారు. రాహుల్‌, కేసీఆర్‌ ఎప్పుడూ పరస్పరం విమర్శలు చేసుకోరని, బీఆర్‌ఎస్‌ వాళ్లు ఎప్పుడైనా తమ వద్దకే వస్తారన్నది రాహుల్‌ నమ్మకమని తెలిపారు. ‘‘రాష్ట్రంలో ఏం మార్పు వచ్చింది? అవినీతిలోనా? మోసం చేయడంలోనా?... తెలంగాణ ఎందులో ఆదర్శం? మతపరమైన రిజర్వేషన్ల అమలులోనా? బీసీల గొంతుకోయడంలోనా?.. ఈ ప్రశ్నలకు రాహల్‌, రేవంతే సమాధానం చెప్పాలి. బీసీలకు వ్యతిరేకంగా రాహుల్‌, రేవంత్‌ కుట్ర పన్నుతున్నారు’’ అని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ హయాంలో సాగిన దందాలు.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే ముస్లింలకు ప్రతిపాదించిన 10శాతం తొలగించి బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తామని ప్రకటించారు. రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి బీసీలను నిలువునా మోసం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. 20నెలలు దాటిపోయినా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీసీల కళ్లల్లో మట్టికొట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీకి లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని మోదీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. బీజేపీ శాసనసభపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రె్‌సకు చిత్తశుద్ధి ఉంటే ముస్లింలకు పదిశాతం రిజర్వేషన్లు ఎత్తివేసి, బీసీలకు మాత్రమే 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే పాయల శంకర్‌ మాట్లాడుతూ పదేళ్ల పాటు బీఆర్‌ఎస్‌ బీసీలను మోసం చేసిందని, ఇప్పుడు అదే దారిలో కాంగ్రెస్‌ నడుస్తుందన్నారు. ధర్నాలో ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, మాజీ ఎంపీలు బూరనర్సయ్యగౌడ్‌, బీబీ పాటిల్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మినారాయణ, ఎన్‌వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 03 , 2025 | 04:45 AM