Indian Army Drone Supplier: హాస్టల్ గదిలో మొదలైన స్టార్టప్..
ABN , Publish Date - Jul 23 , 2025 | 03:40 AM
ఇద్దరు విద్యార్థులు స్థాపించిన రక్షణ-సాంకేతిక స్టార్టప్.. అతి కొద్దిరోజుల్లోనే భారత సైన్యానికి యుద్ధంలో వాడే డ్రోన్లు..

హైదరాబాద్ బిట్స్ పిలానీ విద్యార్థుల ఘనత
స్టార్టప్ రూపొందించిన 2 నెలలకే సైన్యానికి యూఏవీల సరఫరా
ఆర్మీకి డ్రోన్లు సరఫరా చేసేస్తోంది!
హైదరాబాద్, జూలై 22: ఇద్దరు విద్యార్థులు స్థాపించిన రక్షణ-సాంకేతిక స్టార్టప్.. అతి కొద్దిరోజుల్లోనే భారత సైన్యానికి యుద్ధంలో వాడే డ్రోన్లు, కామికేజ్‌లు సరఫరా చేస్తోంది. హాస్టల్ గదిలో చిన్నపాటి అసెంబ్లింగ్ యూనిట్‌తో వారు మొదలుపెట్టిన స్టార్టప్.. కేవలం రెండు నెలలకే మన సైనిక దళాలకు స్వదేశీ డ్రోన్లను అందజేసే స్థాయికి ఎదిగింది. అదే అపోలియన్ డైనమిక్స్! హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీకి చెందిన జయంత్ ఖత్రి, సౌర్య చౌధరి కలిసి ఈ స్టార్ట్‌పను ప్రారంభించారు. రాజస్థాన్‌కు చెందిన జయంత్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి కాగా.. పశ్చిమబెంగాల్‌కు చెందిన సౌర్య ఎలకా్ట్రనిక్స్ ఇంజనీరింగ్ విద్యార్థి. అపోలియన్ డైనమిక్స్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లోనే స్థాపించినట్లు జయంత్ మంగళవారం పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సహా అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఆధునిక యుద్ధతంత్రంలో డ్రోన్లదే కీలక పాత్ర అని భావించామని.. ఆ దిశగా ఆలోచించి, డ్రోన్ల తయారీపై దృష్టి పెట్టామని తెలిపారు. రోబోటిక్స్, మానవ రహిత వైమానిక వాహనాల (యూఏవీ)పై ఉన్న ఆసక్తితోనే ఈ స్టార్ట్‌పను ప్రారంభించినట్లు వెల్లడించారు. తమ స్టార్ట్‌పకు బిట్స్ పిలానీ అండగా నిలిచిందని.. కేంద్రం నుంచి రూ.8 లక్షలు అందేలా చూసిందని చెప్పారు. మే నెలాఖరులో చండీగఢ్‌లో జరిగిన కార్యక్రమంలో భారత ఆర్మీకి తమ డ్రోన్ల గురించి ప్రత్యక్షంగా ప్రదర్శన ఇచ్చామన్నారు. తాము రూపొందించిన డ్రోన్ల వేగం, విన్యాస సామర్థ్యం, మన్నిక, పనితీరు ఆర్మీ ఉన్నతాధికారులకు బాగా నచ్చడంతో పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వచ్చాయని తెలిపారు. అపోలియన్ డైనమిక్స్ కార్యకలాపాలు ప్రారంభించిన రెండు నెలల్లోనే సైన్యానికి చెందిన కీలక కేంద్రాలకు యూఏవీలను సరఫరా చేస్తున్నట్లు వివరించారు. జమ్మూ, చండీమందిర్, పనాగఢ్, అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఆర్మీ కేంద్రాలకు స్వదేశీ డ్రోన్లను అందించినట్లు చెప్పారు. ఆర్మీ నుంచి వచ్చిన ఆర్డర్లన్నింటినీ డెలివరీ చేయడానికి కనీసం రెండు నెలల పాటు రేయింబవళ్లు కష్టపడి పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆర్మీ చేపట్టే మిషన్లకు అవసరమైనట్లుగా, వారికి కావాల్సిన రీతిలో డ్రోన్లను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.
విదేశీ యూఏవీ సాంకేతికతపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలన్న వ్యూహాత్మక లక్ష్యంలో భాగంగా.. అపోలియన్ డైనమిక్స్ నుంచి దీర్ఘ-శ్రేణి నిఘా, వ్యూహాత్మక పేలోడ్ డెలివరీ, అత్యంత కచ్చితమైన కామికేజ్ కార్యకలాపాల కోసం బహుళార్థ యూఏవీల కోసం ఆర్మీ ఆర్డర్లు ఇస్తున్నట్లు తెలిపారు. కామికేజ్ రకం గంటకు 300 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించడంతో పాటు అత్యంత కచ్చితత్వంతో ఒక కేజీ వరకు పేలోడ్‌ను తీసుకెళ్తుందని వివరించారు. ఈ డ్రోన్లు అత్యధిక సామర్త్యం కలిగి ఉంటాయని.. రాత్రి వేళల్లో నిఘా కోసం, వ్యూహాత్మక ఆపరేషన్లలోనూ వీటిని వినియోగిస్తారని జయంత్, సౌర్య చెప్పారు. బిట్స్ పిలానీలోని రిసెర్చ్, ఇన్నోవేషన్ విభాగం డీన్ సంకేత్ గోయెల్ తమకు అండగా నిలిచారన్నారు. తాము అందించే ప్రముఖ ఉత్పత్తుల్లో శిక్షణ యూఏవీ ఒకటని చెప్పారు. దృఢమైన డిజైన్, వాడుకలో సౌలభ్యం కారణంగా సైనిక కేంద్రాలు ఎక్కువగా ఈ డ్రోన్లను తీసుకుంటాయని తెలిపారు. తమ స్టార్టప్ డ్రోన్ల వాడకంపై సైనికులకు సమగ్ర శిక్షణను కూడా అందిస్తోందని, విమానయాన అనుభవం లేని వారు కూడా తక్కువ వ్యవధిలోనే నిపుణులైన డ్రోన్ ఆపరేటర్లుగా మారేలా శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
ప్రముఖ తయారీదారులుగా మారడమే లక్ష్యం..
ప్రస్తుతం తమ బృందంలో 10 మంది వరకు సభ్యులు ఉన్నట్లు జయంత్, సౌర్య తెలిపారు. ప్రస్తుతం తాము భవిష్యత్ తరానికి చెందిన వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (వీటీవోఎల్) ప్లాట్‌ఫాం, ఫిక్స్‌డ్-వింగ్ వ్యవస్థలపై పనిచేస్తున్నట్లు చెప్పారు. రాబోయే ఐదేళ్లలో దేశంలోనే ప్రముఖ అధునాతన రక్షణ వ్యవస్థల తయారీదారుల్లో ఒకరిగా నిలవాలన్న స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి