Shamshabad Airport: ఎయిర్‌పోర్టుకు పక్షి పోటు!
ABN , Publish Date - Jul 18 , 2025 | 05:54 AM
మేటి విమానాశ్రయాల్లో ఒకటిగా పేరొందిన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పక్షు ల బెడద పట్టి పీడిస్తోంది! ఈ ఏడాది జనవరి నుంచి మే నెలాఖరు వరకూ..

శంషాబాద్ విమానాశ్రయ పరిధిలో 5 నెలల వ్యవధిలో.. పక్షులు ‘ఢీ’కొన్న ఘటనలు 49
సాంకేతిక సమస్యలతో 5 సార్లు ‘మే’డే
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): మేటి విమానాశ్రయాల్లో ఒకటిగా పేరొందిన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పక్షు ల బెడద పట్టి పీడిస్తోంది! ఈ ఏడాది జనవరి నుంచి మే నెలాఖరు వరకూ.. అంటే 5 నెలల వ్యవధిలో టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో విమానాలను పక్షులు ఢీ కొన్న ఘటనలు ఈ విమానాశ్రయంలో 49 జరిగినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. అం తేకాదు.. ఈ ఏడాది జనవరి నుంచి మే చివరిదాకా దేశంలో 11మేడే కాల్స్‌ను (ఆకాశంలో విమా నం ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు గ్రౌండ్‌కు ఇచ్చే సంకేతం. ఇటీవల అహ్మదాబాద్‌లో విమా నం కూలిపోయే ముందు కూడా పైలట్లు ఇలా మేడే కాల్ ఇచ్చారు) డీజీసీఏ నిర్ధారించగా.. వాటి లో ఐదు మన హైదరాబాద్ గగనతలంలో ఉన్న విమానాల నుంచి వచ్చినవి కావడం గమనార్హం. విమానాశ్రయాల్లో ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో పక్షులు/జంతువులు ఢీకొన్న సంఘటనలు ఏటా దేశవ్యాప్తంగా 2వేలదాకా నమోదవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గణాంకాల ప్రకారం.. ఢిల్లీ, అహ్మదాబాద్ విమానాశ్రయాల్లో పక్షుల బెడద ఎక్కువగా ఉంది. విమానాలను పక్షులు ఢీకొన్న ఘటనలు.. ఢిల్లీలో ఏటా సగటున 400 దాకా నమోదవుతున్నాయి. అక్కడ ఈ ఏడాది జనవరి 1 నుంచి మే నెలాఖరు వరకూ 95 ఘటనలు అలాంటివి నమోదయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయ పరిధిలో జనవరినుంచి మే వరకు 49 పక్షులు ఢీకొన్న ఘటనలు జరిగాయి. 2022లో ఇలాంటి ఘటనలు 92 జరగ్గా.. ఆ తరువాత 2023లో 136, 2024లో 143 నమోదయ్యాయి. ఇవి విమానయాన భద్రతపైఆందోళన కలిగిస్తున్నాయి.
ఎన్ని చర్యలు తీసుకున్నా..
పక్షుల బెడద తగ్గించేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థ జీఎంఆర్ పలు చర్యలు తీసుకుంటోంది. రన్‌వే సమీపంలో పక్షులను నియంత్రించేందుకు అధిక తరంగదైర్ఘ్యంతో శబ్దాలు చేసే స్పీకర్లను ఏర్పాటు చేశారు. పక్షుల కోసమే తయారు చేసిన ఈ పరికరాలు నిరంతరం పనిచేస్తుంటాయి. అలాగే.. పక్షులను భయపెట్టేందుకు రన్‌వేలకు రెండు వైపులా ప్రతి 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో టపాసులు కాలుస్తున్నారు. ఇందుకోసం నిరంతరం కొందరు పనిచేస్తుంటారు. దీంతో పాటు చుట్టు పక్కల పక్షులు చేరకుండా ఎప్పటికప్పుడు గడ్డి తొలగిస్తుంటారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో సాధ్యమైనంత వరకు చెత్త, కుళ్లిన ఆహార పదార్ధాలు ఓపెన్ నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎయిర్ పోర్టు పరిసరాల్లో ముఖ్యంగా కాటేదాన్, జల్‌పల్లి ప్రాంతాల్లో కొన్ని నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పరిశ్రమల వల్ల పక్షుల బెడద పెరుగుతున్నట్లు తెలిసింది. ఈ ప్రాంతాల్లో కొందరు.. నిబంధనలకు విరుద్ధంగా జంతు కళేబరాలు, ఇతర వ్యర్థ పదార్థాల నుంచి నూనె తీసే పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. వీటి వల్ల పక్షుల బెడద పెరుగుతోంది. అయినా వాటిని మూసివేయించాలని ఫిర్యాదులు అందుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.