Share News

BC Reservations: రిజర్వేషన్లు పాత పద్ధతిలోనే!

ABN , Publish Date - Feb 11 , 2025 | 05:04 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఈసారి కూడా పాత విధానంలోనే రిజర్వేషన్లు అమలు కానున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తం 50 శాతం మించరాదంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మేరకు ఇవి అమలు కానున్నట్లు భావిస్తున్నారు.

BC Reservations: రిజర్వేషన్లు పాత పద్ధతిలోనే!

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే విధానం

  • 50 శాతానికి మించకుండా ఉండేందుకే..

  • ఆరు కేటగిరీల్లో బీసీల రిజర్వేషన్ల అమలు

  • పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీల వారీగా

  • ప్రభుత్వానికి ప్రత్యేక కమిషన్‌ నివేదిక

  • త్వరలో క్యాబినెట్‌ భేటీ.. ఆపై రిజర్వేషన్ల ఖరారు

  • 20 రోజుల్లో మునిసిపాలిటీ, కార్పొరేషన్ల నివేదిక

  • తొలుత సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణ

  • త్వరలో సీఎంకు వివరాలివ్వనున్న అధికారులు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఈసారి కూడా పాత విధానంలోనే రిజర్వేషన్లు అమలు కానున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తం 50 శాతం మించరాదంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మేరకు ఇవి అమలు కానున్నట్లు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిషన్‌.. ఈ అంశంపై లోతైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. రాష్ట్రంలోని 12,848 గ్రామపంచాయతీలు, 570 మండలాలు, 570 జడ్పీటీసీలు, 5,817 ఎంపీటీసీ స్థానాల వారీగా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రత్యేక కమిషన్‌ పలు సిఫారసులు చేసింది. ఈ మేరకు కమిషన్‌ చైర్మన్‌ బూసాని వెంకటేశ్వరరావు సోమవారం సాయంత్రం బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఇ.శ్రీధర్‌, పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్‌తో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి నివేదికను అందజేశారు. మొత్తం ఆరు కేటగిరీల్లో రిపోర్టును ప్రత్యేక కమిషన్‌ తయారు చేసింది. అయితే బీసీలకు ఎంతమేర రిజర్వేషన్లను కేటాయించాలన్నది కమిషన్‌ సూచించినప్పటికీ.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పును మాత్రం అమలు చేయాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుతం స్థానిక సంస్థలకు సంబంధించిన నివేదికను అందించిన కమిషన్‌.. మరో 20 రోజుల్లో పట్టణ ప్రాంతాలకు సంబంధించి మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో అమలు చేయాల్సిన రిజర్వేషన్ల నివేదికను సమర్పించనుంది. ప్రస్తుతం కమిషన్‌ అందజేసిన స్థానిక సంస్థల రిజర్వే షన్ల నివేదికపై ప్రభుత్వం అధ్యయనం చేయనుంది. ఇదే అంశంపై త్వరలో మంత్రివర్గం సమావేశం కానుంది. కమిషన్‌ నివేదిక, అమలు చేయాల్సిన రిజర్వేషన్ల అంశం సహా పలు విషయాలపై క్యాబినెట్‌లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు.


నెలరోజుల్లోనే అధ్యయనం..

బీసీల రిజర్వేషన్ల ఖరారు కోసం సుప్రీంకోర్టు తీర్పులోని సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం 2023 నవంబరు 4న రిటైర్డ్‌ ఐఏఎస్‌ బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్‌ జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించింది. మేధావులు, ప్రజాసంఘాలు, కుల సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించింది. దాదాపు నెల రోజుల్లోనే వివిధ వర్గాలతో సమావేశమై.. ఆ వివరాల ఆధారంగా అధ్యయనం చేసింది. మరోవైపు 2011 జనాభా లెక్కలు, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వేలో వచ్చిన వివరాల ఆధారంగా కమిషన్‌ తన నివేదికను రూపొందించింది. ఇందులో స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించాల్సిన రిజర్వేషన్ల సిఫారసులను 6 కేటగిరీలుగా విభజించింది. దీని ప్రకారం.. గ్రామాల్లోని వార్డు సభ్యులు, సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్‌పర్సన్‌.. ఇలా 6రకాల రిపోర్టును తయారు చేసింది. ఆయా పదవుల్లో బీసీలకు కేటాయించాల్సిన రిజర్వేషన్ల వివరాలను పేర్కొంది. రాష్ట్రంలోని గ్రామాల్లో ఉన్న ఎస్సీ లు, గిరిజన గ్రామ పంచాయతీలను పరిగణనలోకి తీసుకుని.. రాజ్యాంగం ప్రకారం వారి కోటా రిజర్వేషన్లు వారికి పోను బీసీలకు ఎంత కేటాయించాలనే దానిపై కసరత్తు చేసింది. గ్రామాల్లో వార్డు సభ్యులు, సర్పంచ్‌లకు ఎంత మేర రిజర్వేషన్‌ కేటాయించాలి, సంబంధిత వార్డులో ఎంత మంది బీసీలు ఉన్నారు, ఒకవేళ బీసీలకు సర్పంచ్‌ పదవి కేటాయించాలంటే గ్రామం మొత్తంలో ఎంత మంది బీసీలు ఉన్నారనే అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఇదేవిధంగా మండల స్థాయి పోస్టులైన ఎంపీటీసీ, ఎంపీపీలకు వర్తింపజేసింది. ఇక జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ చైర్మన్‌ల అంశంలోనూ మండల, జిల్లాల పరిధిలో ఉన్న ఇతర కులాలను పరిగణనలోకి తీసుకుంది. దీంతోపాటు బీసీలకు గతంలో అమలైన రిజర్వేషన్‌, ఇప్పటికే ఏ విధమైన పదవులు పొందారనే అంశాలనూ కమిషన్‌ పరిశీలించింది. ఈ అంశాలన్నింటిని క్రోడీకరించిన తరువాత బీసీల వాటా ప్రకారం వారికి ఆయా పదవుల్లో పోటీ చే సేందుకు అవకాశం కల్పించేలా రిపోర్టును సిద్ధం చేసింది.


సుప్రీం తీర్పునకు లోబడే..

సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 50 శాతం రిజర్వేషన్‌ మించరాదనే నిబంధనను అనుసరించే నివేదిక ఇవ్వాల్సిందిగా కమిషన్‌ను ఏర్పాటు చేసినప్పుడే ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. దీని ప్రకారం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ జనాభాను 2011 లెక్కల ప్రకారమే పరిగణనలోకి తీసుకున్నారు. బీసీ జనాభా విషయంలో 2011 లెక్కలతోపాటు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన కులగణనలోని బీసీల లెక్కలనూ పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను కమిషన్‌ ఖరారు చేసింది. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీల జనాభా మేరకు వారికి రిజర్వేషన్లు పోగా.. మిగిలిన దానిలో బీసీలకు కేటాయించాల్సి ఉంది. అంటే దీని ప్రకారం 2019 నాటి రిజర్వేషన్‌లే ఇప్పుడు కూడా అమలు కానున్నట్టు స్పష్టమవుతోంది. అయితే గిరిజన గ్రామ పంచాయతీల్లో వందశాతం వారికే రిజర్వేషన్లు అమలు కానుండగా.. సాధారణ గ్రామపంచాయతీల్లోనూ గిరిజనులు, ఎస్సీలు ఉంటే వారి జనాభా ప్రకారం వారికి సీట్లను కేటాయించాల్సి ఉంటుంది. తాజాగా ప్రభుత్వం వెల్లడించిన కులగణన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం ఉన్నారు. జనాభా వారీగా వారికి రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఇక రాష్ట్రంలో బీసీల జనాభా 56.33 శాతం (బీసీ హిందువులు, బీసీ ముస్లింలు కలిపి) ఉన్నారు. దీని ప్రకారం చూస్తే.. ఎస్సీ, ఎస్టీలకు పోగా బీసీలకు 23 శాతం మేరకే రిజర్వేషన్లు అమలు కానున్నట్టు స్పష్టమవుతోంది.


తొలుత సర్పంచ్‌ ఎన్నికలే..

స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాల్సిన రిజర్వేషన్లను ప్రత్యేక కమిషన్‌ సూచించిన నేపథ్యంలో ప్రభుత్వం మొదటగా సర్పంచ్‌ ఎన్నికలను నిర్వహించాలనే భావనలో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీకాలం పూర్తయి ఏడాది దాటింది. పైగా సర్పంచ్‌లు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన వివిధ గ్రాంట్లు, నిధులు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మొదటగా సర్పంచ్‌ ఎన్నికలపైనే ప్రభుత్వం కూడా దృష్టి సారించిందని తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఎన్ని దశల్లో నిర్వహించాలి, గతంలో ఎన్ని దశల్లో నిర్వహించారనే వివరాలను సంబంధిత అధికారులకు సీఎంకు నివేదించనున్నట్టు సమాచారం. త్వరలో క్యాబినెట్‌ భేటీలోనూ ఈ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో బీసీ రిజర్వేషన్లు చేసేందుకుగాను.. పట్టణ ప్రాంతాలకు సంబంధించిన కులసర్వే వివరాలు ఇంకా ప్రత్యేక కమిషన్‌కు అందాల్సి ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొత్త కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు ఏర్పాటయ్యాయి. గతంలో ఆ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, బీసీలు ఎంతమంది ఉన్నారు, కొత్తగా ఏర్పడటం వల్ల వాటి పరిధిలోకి వచ్చిన జనాభా, అందులో బీసీలు ఎంతమంది ఉన్నారనే అన్ని విషయాలను కమిషన్‌ తీసుకోనుంది. ఈ అంశాలకు సంబంధించిన పూర్తిస్థాయి జాబితాలు అందిన తరువాత పట్టణ ప్రాంతాల్లోని బీసీలకు కేటాయించాల్సిన రిజర్వేషన్లను ఖరారు చేయనుంది.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు

Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి

For Telangana News And Telugu News

Updated Date - Feb 11 , 2025 | 05:04 AM