Amit Shah: నేడు రాష్ట్రానికి అమిత్ షా రాక
ABN , Publish Date - Jun 29 , 2025 | 04:33 AM
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదివారం నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. అమిత్ షా గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.

నిజామాబాద్‌లో పసుపుబోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం
అనంతరం బహిరంగ సభ బోర్డుతో నెరవేరిన రైతుల కల
నిజామాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదివారం నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. అమిత్ షా గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 1.45 గంటలకు నిజామాబాద్ కలెక్టరేట్‌కు వస్తారు. ఆ తర్వాత నగరంలోని ఆర్యనగర్‌లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వినాయక్‌నగర్‌లో కొద్ది సేపు పార్టీ నేతలతో మాట్లాడతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.05 గంటలకు బయలుదేరి కంఠేశ్వర్ బైపా్‌సకు చేరుకొని డీఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత నగరంలోని పాలీటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి సాయంత్రం 4.50 గంటలకు బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకుంటారు. హెలికాప్టర్ ద్వారా 5 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేటకు బయలుదేరి వెళతారు. అమిత్‌షా జిల్లాకు వస్తుండటంతో అధికారులు, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సభకు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల, రఘునందన్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
దశాబ్దాల కల నెరవేరుతున్న వేళ..
పసుపు బోర్డు కోసం మూడు దశాబ్దాలుగా జిల్లా రైతులు పోరాటాలు చేశారు. హైదరాబాద్, ఢిల్లీలోనూ ఆందోళనలు నిర్వహించారు. ఎన్నికల్లో సైతం పోటీకి దిగారు. 2019 ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానన్న హామీతో ఎంపీ అర్వింద్ పోటీ చేశారు. ఎన్నికల్లో గెలవగానే పసుపు బోర్డు కోసం ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో గత పార్లమెంటు ఎన్నికలకు ముందే ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేశారు. పసుపు బోర్డు కోసం మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ.. ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని నిజామాబాద్‌లో ఏర్పాటు చేశారు. పసుపు బోర్డు వల్ల పంటకు ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందుతుంది. పసుపు ఎగుమతి చేయడంతో పాటు పసుపు పరిశ్రమలు కూడా జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. నిర్మల్, నిజామాబాద్, వరంగల్ జిల్లా రైతులకు కూడా దీని వల్ల ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది.
ఇవి కూడా చదవండి
పాత బాకీ అడిగితే ఇలా కొడతారా..
మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, లోకేష్