Hyderabad: రెండేళ్ల తర్వాత.. నగరానికి దక్కిన మంత్రి పదవి
ABN , Publish Date - Nov 01 , 2025 | 08:29 AM
హైదరాబాద్ మహా నగరానికి ఎట్టకేలకు మంత్రి పదవి దక్కింది. సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో ఇప్పటివరకు చోటు లేదు. రిటైర్డ్ క్రికెటర్, సీనియర్ కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌ను ఇప్పుడు మంత్రి పదవి వరించింది.
- అజారుద్దీన్‌కు క్యాబినెట్‌లో చోటు
- కాంగ్రెస్ హయాంలో ఇప్పటికి ప్రత్యేక గుర్తింపు
- జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పైచేయి సాధించే ప్రక్రియలో స్థానం!
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ మహా నగరానికి ఎట్టకేలకు మంత్రి పదవి దక్కింది. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) మంత్రివర్గంలో ఇప్పటివరకు చోటు లేదు. రిటైర్డ్ క్రికెటర్, సీనియర్ కాంగ్రెస్ నేత అజారుద్దీన్(Azharuddin)ను ఇప్పుడు మంత్రి పదవి వరించింది. మంత్రివర్గంలో మైనార్టీలకు స్థానం లేదని విపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు కాంగ్రెస్ చెక్ పెట్టింది. రెండు నెలల క్రితమే గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ఖరారు చేసిన కాంగ్రెస్, తాజాగా అమాత్య పదవి కట్టబెట్టింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ఇది ఆసక్తికరంగా మారింది.
రెండేళ్ల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్‌లో ఒక్క స్థానం కూడా దక్కలేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాలు ఉండగా ఒక్క స్థానం కూడా గెలవలేదు. దీంతో రాష్ట్ర క్యాబినెట్‌లో హైదరాబాద్ నుంచి ఎవరికీ స్థానం దక్కలేదు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరణంతో ఏడాది క్రితం వచ్చిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ గెలుపొందారు. గవర్నర్ కోటలో ఏడాది క్రితం అమీర్ అలీఖాన్‌ను హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ ప్రతిపాదించగా హైకోర్టు నామినేషన్‌ను రద్దు చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అనూహ్యంగా అమిర్‌అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరు తెరపైకి వచ్చింది. దాంతో పాటు క్యాబినెట్‌లో చోటును సైతం కల్పించింది. ఆరు నెలల్లో శాసనసభలో కానీ, మండలిలో కానీ సభ్యుడు కావాల్సి ఉండగా.. గవర్నర్ కోటలో అజారుద్దీన్ ఎంపికకానున్నారు.

మైనార్టీ వర్గానికి..
ఉమ్మడి రాష్ట్రంలోనూ, స్వరాష్ట్రంలోనూ హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలో స్థానం ఉంటుంది. కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం మైనార్టీ నేత మహముద్ అలీకి, ఉద్యమకారుడిగా నాయిని నర్సింహారెడ్డికి చోటు కల్పించారు. అయితే, 2014లో బీఆర్‌ఎ్‌స(టీఆర్‌ఎస్) గ్రేటర్ హైదరాబాద్‌లో సికింద్రాబాద్ మినహా ఎక్కడా గెలుపొందలేదు. ఆ తర్వాత సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌కు మంత్రి పదవి దక్కింది. అప్పట్లో టీడీపీ నుంచి బీఆర్‌ఎస్ లో చేరగానే సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివా్‌సయాదవ్‌కు కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆ తర్వాత మరోసారి మహముద్ అలీకి, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌లకు చోటుదక్కింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నగరం నుంచి కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేకపోవడంతో రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లో చోటు దక్కలేదు. రెండేళ్ల తర్వాత మైనార్టీ వర్గానికి అవకాశం వచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Read Latest Telangana News and National News