Share News

మున్సిపాలిటీ ఎన్నికలకు కట్టుబడి ఉన్నాం

ABN , Publish Date - Jan 19 , 2025 | 10:25 PM

మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలకు కట్టుబడి ఉన్నానని, పాలకవర్గం లేకపోవడంతో ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తున్నానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

మున్సిపాలిటీ ఎన్నికలకు కట్టుబడి ఉన్నాం

మందమర్రిటౌన్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలకు కట్టుబడి ఉన్నానని, పాలకవర్గం లేకపోవడంతో ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తున్నానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతున్నానని తెలిపారు. తాను గెలిచిన సంవత్సర కాలంలో రూ.7 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు. తాగునీటి కోసం పైపులైన్‌ పనులు నడుస్తున్నాయన్నారు. మందమర్రిలో ఇటీవల నిర్మించిన 520 గృహాల్లో పారదర్శకంగా 243 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేశామన్నారు. దీనిపై అనుమానాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

మరో వైపు ఇందిరమ్మ ఇండ్ల సర్వే కూడా జరుగుతుందన్నారు. రేషన్‌ కార్డులకు సంబంధించి ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయని, అర్హులైన వారందరికి రేషన్‌ కార్డులు వస్తాయన్నారు. పది సంవత్సరాల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2025 | 10:25 PM