పత్తి కొనుగోలుకు పడిగాపులు
ABN , Publish Date - Jan 09 , 2025 | 11:21 PM
సీసీఐ అధికారులు, జిన్నింగు మిల్లు యజ మానులు దళారులకు కొమ్ము కాస్తున్నారని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రేపల్లెవాడలోని జిన్నింగు మిల్లు యజమానులతో వాగ్వాదానికి దిగా రు. రైతులు మాట్లాడుతూ పత్తి మిల్లు వద్ద రైతుల కంటే వ్యాపారులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాండూర్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): సీసీఐ అధికారులు, జిన్నింగు మిల్లు యజ మానులు దళారులకు కొమ్ము కాస్తున్నారని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రేపల్లెవాడలోని జిన్నింగు మిల్లు యజమానులతో వాగ్వాదానికి దిగా రు. రైతులు మాట్లాడుతూ పత్తి మిల్లు వద్ద రైతుల కంటే వ్యాపారులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఐ ద్వారా మద్దతు ధర వస్తుందని వెళితే దళారులతో కుమ్మక్కై తమ వాహనాలను మూడు రోజులు పక్కన పెట్టి దళారుల వాహనాలను ముందుకు పంపి రోజుకు ట్రిప్పుల అవకాశం ఇస్తున్నారని తెలిపారు. రెండో శనివారం, ఆదివారం పండగ ఇలా నాలుగు రోజులు సెలవు వస్తున్నాయని, దీంతో ఏం చేయాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు అందుబాటులో లేరని, ఫోన్‌లు లేపడం లేదని పేర్కొన్నారు. జిన్నింగు మిల్లు యజమానిని నిలదీస్తే మా ఇష్టమని, తమకు సంబంధించిన వాహనాలను ముందు పంపుతామని నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారని పేర్కొన్నారు.
- రెండు రోజుల నుంచి ఇక్కడే ఉన్నా - రాజు, కొత్తపల్లి
రెండు రోజులుగా పత్తి మిల్లు దగ్గరే ఉన్నా. మా కన్నా వెనక ఉన్న దళారుల వాహనాలను ముందు పంపుతున్నారు. చలి, ఆకలితో పాటు సరైన తిండి లేక మిల్లు వద్దనే పడిగాపులు కాస్తున్నాం. అధికారులు తమకు న్యాయం చేయాలి.
నానా కష్టాలు పడుతున్నాం - పోచన్న, భీమిని
కష్టపడి పంట పండించుకుని పత్తికి మద్దతు ధర లభిస్తుందని మిల్లుకు వస్తే ఇక్కడ నానా కష్టాలు పడుతున్నాం. వరుసలో ఉన్న మా బండ్లను కాకుండా మా తర్వాత వచ్చిన వాటిని లోపలికి పంపుతున్నారు. అధికారులు పట్టించుకోవాలి.