Share News

Corruption Sub Registrar: సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ ఆకస్మిక సోదాలు

ABN , Publish Date - Jul 18 , 2025 | 04:51 AM

రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. గురువారం బీబీనగర్‌, సదాశివపేట, జడ్చర్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు జరిపి భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు.

Corruption Sub Registrar: సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ ఆకస్మిక సోదాలు

  • బీబీనగర్‌, సదాశివపేట, జడ్చర్లలో తనిఖీలు

  • భారీగా అక్రమాల గుర్తింపు.. రూ.97,880 సీజ్‌

  • 32 మంది ప్రైవేటు ఏజెంట్లు, డాక్యుమెంట్‌ రైటర్ల పట్టివేత

  • ఎస్‌ఆర్‌ఓల కస్టడీలోని 152 డాక్యుమెంట్ల స్వాధీనం

హైదరాబాద్‌/బీబీనగర్‌/సంగారెడ్డి క్రైం/సదాశివపేట/జడ్చర్ల, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. గురువారం బీబీనగర్‌, సదాశివపేట, జడ్చర్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు జరిపి భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు. వ్యక్తిగత నగదు రిజిస్టర్‌ను సక్రమంగా నిర్వహించట్లేదని నిర్ధారించి.. ఈ మూడు కార్యాలయాల్లోని సిబ్బంది, అధికారుల వద్ద లెక్కల్లో చూపించని రూ.97,880 స్వాధీనం చేసుకున్నారు. అలాగే ప్రైవేటు ఏజెంట్లు, డాక్యుమెంటు రైటర్లు యథేచ్ఛగా తిరుగుతున్నట్లు గుర్తించి.. మొత్తం 32 మందిని అధికారులు పట్టుకున్నారు. ఆయా కార్యాలయాల్లో సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని తేల్చారు. రిజిస్ట్రేషన్‌ జరిగిన వెంటనే సంబంధిత వ్యక్తులకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లను ఎస్‌ఆర్‌ఓలు తమ కస్టడీలోనే పెట్టుకుంటున్నట్లు గుర్తించారు.


ముగ్గురు ఎస్‌ఆర్‌ఓల వద్ద మొత్తం 152 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీజీ విజయకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. బీబీనగర్‌ ఎస్‌ఆర్‌వో కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌ చంద్ర, జడ్చర్ల ఎస్‌ఆర్‌వో ఆఫీసులో ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ, సదాశివపేట ఎస్‌ఆర్‌వో కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు జరిపినట్లు వెల్లడించారు. ‘బీబీనగర్‌ ఎస్‌ఆర్‌ఓ ఆఫీసులో లెక్కల్లో చూపని నగదు రూ.61,430, ఎస్‌ఆర్‌ఓ కస్టడీలోని 93 రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నాం. 12 మంది ప్రైవేటు ఏజెంట్లు, డాక్యుమెంట్‌ రైటర్లను పట్టుకున్నాం. జడ్చర్ల ఎస్‌ఆర్‌ఓ కార్యాలయంలో రూ.30,900 నగదుతో పాటు ఎస్‌ఆర్‌ఓ కస్టడీలోని 20 డాక్యుమెంట్లు గుర్తించాం. సదాశివపేట ఎస్‌ఆర్‌ఓ కార్యాలయంలో రూ.5,550తో పాటు ఎస్‌ఆర్‌ఓ కస్టడీలోని 39 డాక్యుమెంట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నాం’ అని వివరించారు.


హైకోర్టు ఏసీజేగా జస్టిస్‌ శ్యాం కోషీ నియామకం

హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ శ్యాం కోషీని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ (ఏకే సింగ్‌) శనివారం తెలంగాణ హైకోర్టు సీజేగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో అప్పటి వరకు జస్టిస్‌ శ్యాం కోషీ.. ఏసీజే బాధ్యతలు నిర్వహిస్తారు.


ఇవి కూడా చదవండి

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

స్వచ్ఛ సర్వేక్షణ్‎ 2024-25లో ఏపీకి 5 పురస్కారాలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 04:51 AM