Share News

ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్‌!

ABN , Publish Date - Jan 20 , 2025 | 04:55 AM

రాష్ట్రంలో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పది రోజులుగా రాష్ట్రంలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రులన్నీ డయాలసిస్‌ లాంటి అత్యవసర సేవలు మినహా.. మిగిలిన అన్ని రకాల సేవలనూ నిలిపివేశాయి.

ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్‌!

  • పది రోజులుగా నిలిపివేసిన నెట్‌వర్క్‌ ఆస్పత్రులు

  • కౌంటర్లను మూసివేసిన ప్రైవేటు హాస్పిటళ్లు

  • ప్రభుత్వం పెండింగ్‌ బిల్లులు చెల్లించనందునే..

  • త్వరలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత?

  • వైద్య చికిత్సలు లేక పేద రోగుల ఇబ్బందులు

  • ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు

  • ప్రభుత్వం తీరు దురదృష్టకరం: హరీశ్‌రావు

  • బీఆర్‌ఎస్‌ హయాంలో చెల్లించనందునే పెండింగ్‌

  • ఏడాదిలో రూ.1130 కోట్లు చెల్లించాం.. సమస్యను పరిష్కరిస్తాం: దామోదర

హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పది రోజులుగా రాష్ట్రంలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రులన్నీ డయాలసిస్‌ లాంటి అత్యవసర సేవలు మినహా.. మిగిలిన అన్ని రకాల సేవలనూ నిలిపివేశాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లోని ఆరోగ్యశ్రీ కౌంటర్లను యాజమాన్యాలు మూసివేశాయి. దీంతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే చికిత్స లభిస్తుందన్న ధీమా ఇప్పుడు రోగుల్లో కనిపించడం లేదు. గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యసేవలు పొందిన రోగులు.. ఇప్పుడు ఈ పథకం పరిధి రూ.10 లక్షలకు పెరిగినా ఉపయోగం లేకుండాపోతోందని వాపోతున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత వారం రోజులుగా అత్యవసరమైతే తప్ప.. ఇతర వైద్య సేవల కోసం రోగులు ఆస్పత్రులకు వెళ్లలేదు. దాంతో అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ భారీగా పడిపోయాయి.


మళ్లీ ఇప్పుడు రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. అయితే ఆస్పత్రులకు వచ్చిన రోగులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించడం లేదని తెలిసి నిరాశ చెందుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారు మాత్రం.. తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించి వైద్య చికిత్స పొందుతున్నట్లు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ కింద రాష్ట్ర వ్యాప్తంగా 1042 సర్కారు దవాఖానాలు ఉండగా, 368 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. హైదరాబాద్‌ పరిధిలో 18-20 వరకు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు అందిస్తున్నాయి. అయితే ఆయా ఆస్పత్రులు అందించిన చికిత్సలకు సంబంధించి సుమారు రూ.1000 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏడాది కాలంగా ప్రభుత్వం వీటిని చెల్లించడంలేదు.


నెలాఖరులోగా బకాయిలు చెల్లించాలంటూ..

పెండింగ్‌ బిల్లుల విషయాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ ఈ నెల మొదటివారంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవోకు లేఖ రాసింది. ఈ నెల 10వ తేదీలోగా పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేయకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని పేర్కొంది. దాంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో ఆరోగ్యశ్రీ ట్రస్టు చర్చలు జరిపి సుమారు రూ.120 కోట్ల వరకు పెండింగ్‌ బకాయిలను చెల్లించింది. అయితే ఏడాది కాలంగా ఉన్న పెండింగ్‌ బకాయిల్లో కేవలం 45 రోజులకు సంబంధించినవే చెల్లించారని, మిగిలిన వాటిని కూడా ఈ నెలాఖరులోగా చెల్లించాలని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు డిమాండ్‌ చేశాయి. కానీ, దీనిపై వైద్యశాఖ నుంచి స్పష్టత రాకపోవడంతో.. అదే రోజు నుంచి సేవలను నిలిపివేశాయి. వీరి బాటలోనే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు కూడా చేరనున్నట్లు, త్వరలోనే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. నెట్‌వర్క్‌ ఆస్పత్రులు అద్దెలు చెల్లించే పరిస్థితి కూడా లేదని, వైద్య సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదని, ఔషధాలు, సర్జికల్స్‌ సరఫరాదారులు సైతం వాటి సరఫరా నిలిపివేశారని తెలిపింది. ఈ పరిస్థితుల దృష్ట్యా పెండింగ్‌ బకాయులను వెంటనే చెల్లించాలని, ప్రతినెలా ఆరోగ్యశ్రీ బిల్లులను విడుదల చేయాలని కోరింది.


పేద ప్రజలకు శాపంగా ప్రభుత్వం తీరు: హరీశ్‌రావు

కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం పేద ప్రజలకు శాపంగా మారిందని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆస్పత్రులకు పెండింగ్‌ బకాయిలు విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయిన దుస్థితి నెలకొందని ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. ‘ఎక్స్‌’లోనూ ఈ అంశంపై ట్వీట్‌ చేశారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆస్పత్రులకు వెంటనే బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చూడాలని డిమాండ్‌ చేశారు.


నీరుగార్చిన వారే మాట్లాడుతున్నారు: దామోదర రాజనర్సింహ

పదేళ్లలో ఆరోగ్యశ్రీని నీరుగార్చిన వారే ఇప్పుడు ఆ పథకం గురించి మాట్లాడటం చూస్తుంటే దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లు ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలపై ఆయన స్పందిస్తూ.. బీఆర్‌ఎస్‌ హయాంలో ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేదని, ప్యాకేజీల ధరలను రివైజ్‌ చేయలేదని తెలిపారు. సుమారు రూ.730 కోట్లు బాకీ పెట్టి పోయారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. ఏడాది కాలం లో పాత బకాయిలు సహా రూ.1130 కోట్లు చెల్లించామని, ప్రతి నెలా బిల్లులు చెల్లిస్తున్నామని వివరించారు. ప్యాకేజీల ధరలను రివైజ్‌ చేసి 22 శాతం మేర పెంచామన్నారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులు లేవనెత్తిన ఇతర సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Updated Date - Jan 20 , 2025 | 04:55 AM