Share News

రాజేంద్రనగర్‌ కోర్టులో పందెం కోళ్ల వేలం.. ధర ‘పుంజు’కొనె

ABN , Publish Date - Feb 18 , 2025 | 04:04 AM

ఎవరైనా కోడిపుంజు కోసం వేలకు వేలు పెడతారా? ఒక్క పుంజు కోసం మరీ రూ.20వేలు వెచ్చించి కొంటారా? కొనేందుకు పోటీపడ్డారు.. కొన్నారు. ఇలా మొత్తంగా 81 కోళ్లకు వేలం పాట నిర్వహిస్తే ఏకంగా రూ.16.65 లక్షలొచ్చాయి.

రాజేంద్రనగర్‌ కోర్టులో పందెం కోళ్ల వేలం.. ధర ‘పుంజు’కొనె

  • 9 కోళ్లకు కలిపి కనీస ధర రూ.14 వేలుగా నిర్ణయం

  • ఒక్కో పందెం పుంజుకూ సగటున రూ.20వేలు పలికిన వైనం

  • ఇలా 81 కోళ్లకు మొత్తంగా రూ.16.65 లక్షలు

  • ఇవన్నీ తోలుకట్ట ఫాంహౌస్‌ నుంచి స్వాధీనం చేసుకున్న కోళ్లు

రాజేంద్రనగర్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ఎవరైనా కోడిపుంజు కోసం వేలకు వేలు పెడతారా? ఒక్క పుంజు కోసం మరీ రూ.20వేలు వెచ్చించి కొంటారా? కొనేందుకు పోటీపడ్డారు.. కొన్నారు. ఇలా మొత్తంగా 81 కోళ్లకు వేలం పాట నిర్వహిస్తే ఏకంగా రూ.16.65 లక్షలొచ్చాయి. ఇవన్నీ కూడా పందెం నిర్వాహకుల నుంచి స్వాధీనం చేసుకున్న కోళ్లే! వేలం పాటలో ఈ కోళ్ల కోసం ఇంతలా ధర పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అనే సందేహం రావొచ్చు. దీనికి కాస్త ఆలోచిస్తే ఆ మర్మం తెలిసిపోతుంది! మక్కల దాణా మొదలు.. బాదాం పప్పులు, పిస్తా పప్పులు, ఉడికించిన గుడ్లు, మటన్‌ కీమా వగైరా వగైరాలన్నీ పెడుతూ కొత్తగా పందెం కోళ్లను సిద్ధం చేసే బదులు.. ఇదివరకే మాంచి తర్ఫీదు పొంది.. బరి కోసం రెడీగా ఉన్న ఈ కోళ్లు కొనడమే మేలు కదా!


అందుకేనేమో.. వేలం ‘కూత’ అదిరిపోయి.. లక్షల్లో డబ్బులు రాల్చింది! ఇక ఈ పుంజులన్నీ కూడా ఇటీవల రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం తోలుకట్టలోని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి ఫామ్‌హౌస్‌ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నవే!. ఈ 81 పుంజులకు సోమవారం రాజేంద్రనగర్‌ 13వ అడిషనల్‌ జ్యూడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ న్యాయమూర్తి వేలంపాట వేశారు. తొమ్మిది కోళ్లను ఒక గ్రూపు చొప్పున మొత్తంగా తొమ్మిది గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపులోని కోళ్ల కనీస ధర రూ.14వేలుగా నిర్ణయించారు. వేలంపాట మొదలైన వెంటనే కోళ్లన్నీ అమ్ముడైపోయాయి. ఆ డబ్బును కోర్టులో డిపాజిట్‌ చేశారు. వాస్తవానికి ఆ ఫాంహౌస్‌ నుంచి 84 కోళ్లను స్వాధీనం చేసుకున్నామని, మూడు కోళ్లు చచ్చిపోయాయని పోలీసులు చెప్పారు.

Updated Date - Feb 18 , 2025 | 04:04 AM