Share News

World Records: ఎనిమిదేళ్ల చిన్నారి.. బహుముఖ ప్రజ్ఞాసిరి

ABN , Publish Date - Jun 30 , 2025 | 04:42 AM

ఎనిమిదేళ్లు ఈ వయసు పిల్లలు ఆట బొమ్మలు ముందేసుకోవడమో ఆరుబయట తమ ఈడు పిల్లలతో ఆడుకోవడమో చేస్తారు..

World Records: ఎనిమిదేళ్ల చిన్నారి.. బహుముఖ ప్రజ్ఞాసిరి

  • వేదికలపై ప్రసంగాలు, నృత్యం, గానం, ఐస్‌ స్కేటింగ్‌లో రాణింపు

  • నిర్భీతిగా మాట్లాడటంలో ఇన్‌ఫ్లూయెన్సర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఎనిమిదేళ్లు! ఈ వయసు పిల్లలు ఆట బొమ్మలు ముందేసుకోవడమో.. ఆరుబయట తమ ఈడు పిల్లలతో ఆడుకోవడమో చేస్తారు! హైదరాబాద్‌కు చెందిన రుమైసా ఫాతిమా వయసూ ఎనిమిదేళ్లే. కానీ ఆ పాప బహిరంగ వేదికపై అద్భుత ప్రసంగాలు చేస్తోంది. కళ్లు తప్పుకోలేని విధంగా డ్యాన్స్‌ చేయగలదు. వినసొంపుగా పాడనూ గలదు! ఐస్‌ స్కేటింగ్‌లోనూ ఆ చిన్నారి చాంపియనే! నటనా రంగంలోనూ రాణించాలనుందంటోందిప్పుడు. మూడో తరగతి చదువుతున్న ఈ బాలికకు జీవిత లక్ష్యమ్మీద కచ్చితమైన ప్రణాళికలున్నాయి. ‘ పెద్దయ్యాక ఉద్యోగం చేయను. ఒకరి కింద పనిచేయడం నాకు ఇష్టం లేదు. నేనే ఓ కంపెనీ పెట్టి సీఈవోగా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తాను. ఏ కంపెనీ పెట్టాలనేది 13-15 ఏళ్ల వయసులో నిర్ణయం తీసుకుంటాను’ అని చెబుతోంది. తొణికిసలాడే ఆత్మవిశ్వాసం, బహుళ అంశాల్లో విశేష ప్రతిభ పరంగా దేశంలో తన ఈడు పిల్లల్లో అత్యంత ప్రతిభాశీలిగా రుమైసా గుర్తింపు పొందింది.


‘తన లక్ష్యం ఏమిటంటే’.. అనే అంశమ్మీద చిన్నారి చేసిన ప్రసంగం ఆమెను ‘ఇన్‌ఫ్లూయెన్సర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు కల్పించింది. రుమైసాను పలకరించినప్పుడు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఈనెల 23న ఇన్‌ఫ్లూయెన్సర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ తనను ‘యంగ్‌ ఇన్ల్ఫూయెన్సర్‌ ఫియర్‌లెస్‌ ఆరేటర్‌’గా గుర్తించిందని వెల్లడించింది. తాను ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌లో ఒలింపియాడ్‌ చాంపియన్‌గా నిలిచాననని, పబ్లిక్‌ స్పీకింగ్‌ విభాగంలో ఇంటర్నేషనల్‌ స్టార్‌ కిడ్స్‌ అవార్డు అందుకున్నట్లు చెప్పింది. తాను ప్రస్తుతం ఆర్బిడ్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, లంగర్‌హౌజ్‌ బ్రాంచ్‌లో చదువుతున్నానని.. అక్కడే పబ్లిక్‌ స్పీకింగ్‌ పట్ల తనకు ఆసక్తికలిగిందని వెల్లడించింది. తొలుత ఇంట్లో నిలువుటద్దం ముందు నిల్చుని ప్రసంగాలు చేస్తుండేదాన్ననని, హావభావాలు, ఉచ్ఛారణ పరంగా లోపాలను తనకు తానే సరిచేసుకునేదాన్నని రుమైనా చెప్పింది. నాన్న.. మహమ్మద్‌ సైఫుద్దీన్‌ జీఐఎస్‌ ఇంజినీర్‌. అని, అమ్మ.. రుమాన్‌ ఫాతిమా సైకాలజిస్ట్‌ కౌన్సిలర్‌ అని వివరించింది.

Updated Date - Jun 30 , 2025 | 04:42 AM