Bhatti Vikramarka: పుప్పాలగూడ 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్
ABN , Publish Date - Apr 18 , 2025 | 03:51 AM
రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో మొదటి దశలో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

భట్టి ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉప సంఘం సమీక్షలో నిర్ణయం
ఐఏఎస్‌లు , ఎమ్మెల్యేలకు కేటాయించిన భూమి ఇందులో భాగమే
కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసిందన్న అధికారులు
హైదరాబాద్, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో మొదటి దశలో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణపై భట్టి ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం గురువారం సచివాలయంలో సమావేశమై ఐటీ నాలెడ్జ్ హబ్‌పై సమీక్షించింది. పుప్పాలగూడ పరిసరాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం గతంలో స్థలాలు కేటాయించింది. వీరితో కలిపి రెవెన్యూ అధికారులు, స్పెషల్ పోలీసు కో-ఆపరేటివ్ తదితర సొసైటీలకు200 ఎకరాలకు పైచిలుకు భూమిని ప్రభుత్వం కేటాయించింది.
పుప్పాలగూడ పరిధిలో సొసైటీలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ భూమికి పక్కనే తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీజీఐఐసీ)కు సంబంధించిన దాదాపు 250 ఎకరాల భూమి ఉందని అధికారులు వివరించారు. మొత్తంగా మొదటి దశలో ఐటీ నాలెడ్జ్ హబ్ అభివృద్ధికి సుమారు 450 ఎకరాలు అందుబాటులో ఉందని చెప్పారు. మొదటి దశలో ఏర్పాటు చేయబోతున్న ఐటీ హబ్ ద్వారా 5 లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందని అధికారులు మంత్రుల బృందానికి సూచించారు