Share News

Shamsabad: కశ్మీర్‌ నుంచి తిరిగొచ్చిన పర్యాటకులు

ABN , Publish Date - Apr 27 , 2025 | 04:36 AM

జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌ నుంచి మెదక్‌, సంగారెడ్డి, కామారెడ్డి, హైదరాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ జిల్లాలకు చెందిన 116 మంది పర్యాటకులు శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు.

Shamsabad: కశ్మీర్‌ నుంచి తిరిగొచ్చిన పర్యాటకులు

  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 116 మంది

శంషాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌ నుంచి మెదక్‌, సంగారెడ్డి, కామారెడ్డి, హైదరాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ జిల్లాలకు చెందిన 116 మంది పర్యాటకులు శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్వాగతం పలికారు. ఉగ్రదాడులను నిరసిస్తూ పర్యాటకులతో కలిసి విమానాశ్రయంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పహల్‌గామ్‌లో ఉగ్రదాడి జరిగిన సమయంలో మెదక్‌ జిల్లాకు చెందిన కొందరు అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు. ఈ విషయం మైనంపల్లికి తెలియజేయడంతో ఆయన తెలంగాణ సీఎస్‌, డీజీపీ, జమ్మూ కశ్మీర్‌ డీజీపీతో మాట్లాడారు. పర్యాటకుల వద్దకు బలగాలను పంపించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి, అక్కడ నుంచి శంషాబాద్‌కు తీసుకొచ్చారు. కపిల్‌ చిట్‌ఫండ్‌ సంస్థకు చెందిన ఏజెంట్లు ఏటా పర్యాటక ప్రదేశాలకు వెళుతుంటారు. ఈసారి 116 మంది జమ్మూ కశ్మీర్‌కు వెళ్లారు. ఇది తమకు పునర్జన్మ అని, మైనంపల్లికి రుణపడి ఉంటామని పలువురు పర్యాటకులు చెప్పారు. ఉగ్రదాడికి జరిగినచోటుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నామని మెదక్‌కు చెందిన రాములు అనే వ్యక్తి ఫోన్‌లో తనకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడానని మైనంపల్లి తెలిపారు. రాష్ట్రానికి చెందిన పర్యాటకులు క్షేమంగా తిరిగివచ్చేలా సహకరించిన జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


ప్రాణాలు అరచేతిలో: రాములు, సిద్దిపేట

పహల్‌గామ్‌లోని బైసరన్‌ లోయ అందాలు చూద్దామని బయలుదేరాం. అప్పటికే అక్కడ ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుపుతున్నారనే సమాచారం రావడంతో దగ్గర్లోని ఓ హోటల్‌కు వెళ్లి తలదాచుకున్నాం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపాం. వెంటనే హన్మంతన్నకు ఫోన్‌ చేశాం. కొద్దిగంటల్లోనే జవాన్లువచ్చి భారీ భద్రత మధ్య మమ్మల్ని ఒకహోటల్‌లో ఉంచారు. పరిస్థితి చక్కబడిన తర్వాత విమానంలో శ్రీనగర్‌కు, అక్కడి నుంచి ఢిల్లీకి తరలించారు. హన్మంతన్న చొరవ వల్ల సురక్షితంగా బయటపడ్డాం.


వస్తామనుకోలేదు: పద్మశ్రీ, సంగారెడ్డి

ఉగ్రవాదుల చేతిలో మేం కూడా ప్రాణాలు కోల్పోతామేమో అని భయం భయంగా గడిపాం. తిరిగి ఇంటికొస్తామని అనుకోలేదు. దేవుడి దయ వల్ల తిరిగి వచ్చాం. పహల్‌గామ్‌ వెళుతున్న మేము.. అక్కడ ఉగ్రదాడి విషయం తెలియడంతో ఆగిపోయి.. ఓ హోటల్‌లో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, మైనంపల్లి హన్మంతరావు ఫోన్‌ చేసి మాకు ధైరం చెప్పారు. కొద్దిసేపటికే ఆర్మీ బలగాలు వచ్చి మాకు రక్షణ కల్పించాయి.


ఇవి కూడా చదవండి

Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్

Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 27 , 2025 | 04:36 AM