Urban Negi: ఎవర్టన్ అకాడమీలో తొమ్మిదేళ్ల బాలుడికి చోటు
ABN , Publish Date - Nov 28 , 2025 | 07:18 PM
భారత సంతతికి చెందిన ఓ తొమ్మిదేళ్ల బాలుడు ఎవర్టన్ అకాడమీలో చోటు దక్కించుకున్నాడు. ప్రతిష్టాత్మక ఆంగ్ల ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్నాడు. ఈ వయసు నుంచే ప్రొఫెషనల్ ప్లేయర్‌గా రాణిస్తున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ వేదికపై భారత సంతతికి చెందిన ఓ తొమ్మిదేళ్ల బాలుడు తన ప్రతిభను చూపించడానికి సిద్ధమయ్యాడు. లండన్‌లో పెరిగిన అర్బన్ నేకి(Urban Negi ) అనే బాలుడు.. ప్రతిష్టాత్మక ఆంగ్ల ప్రీమియర్ లీగ్‌కి ఆడనున్నాడు. దీని కోసం ఎవర్టన్ ఎఫ్‌సీ అనే అకాడమీలో చోటు దక్కించుకున్నాడు. ఏడేళ్ల వయసులోనే డైనమో యూత్ తరఫున ఫుట్‌బాల్ ఆడి అద్భుత ప్రతిభ చూపాడు. అప్పుడే ఫుట్‌బాల్ దిగ్గజాల దృష్టి నేగిపై పడింది. డ్రిబ్లింగ్, బాల్ కంట్రోల్, మైదానంలో స్థిరత్వం.. ఏది చూసినా ప్రొఫెషనల్ ప్లేయర్ తరహానే. దీంతో ఎవర్టన్ ఫించ్ ఫార్మ్ అకాడమీ ట్రయల్స్‌కు అతనికి ఆహ్వానం అందింది. అక్కడా అదే దూకుడు.. కోచ్‌లను కూడా మెప్పించి చివరకు అధికారికంగా జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
అతడికి పెద్ద అభిమాని..
ఫ్రెంచ్ ఫుట్‌బాల్ స్టార్ ఇలిమాన్ డియె అంటే నేగికి ఎంతో అభిమానం. ఈ వయసు నుంచే అతడి ఆటశైలి, సృజనాత్మకతను అనుకరిస్తున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో అతని చలాకీతనం స్పష్టంగా కనిపిస్తోంది. భారతీయ మూలాలున్న ప్లేయర్లు ప్రీమియర్ లీగ్‌లో కనిపించడం అరుదు. ఒకప్పుడు మైఖేల్ చోప్రా, నీల్ టేలర్ తదితరులు మెరిశారు. ఇప్పుడు అర్బన్ నేగి వంటి వారు ఇంగ్లండ్ మైదానాల్లో కనపడటం భారత ఫుట్‌బాల్ అభిమానులకు హుషారు తెప్పిస్తోంది.
అందులో భాగమే..
ఎవర్టన్‌కి నిక్ కాక్ అనే వ్యక్తి టెక్నికల్ డైరెక్టర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. ఆయన వచ్చాక యువ ప్రతిభలను గుర్తించే ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఇటీవల అండర్ 5, అండర్ 8లో ప్రతిభావంతులను గుర్తించేందుకు ప్రత్యేకంగా స్కౌటింగ్ బృందాలు ఏర్పాటు చేసినట్టు క్లబ్ తెలిపింది. అందులో భాగంగానే అర్బన్ నేగి ఎంపిక జరిగింది. ఇప్పుడు ఆ బాలుడికి తొమ్మిదేళ్లు మాత్రమే. ముందున్న ప్రయాణం ఎంతో సుధీర్ఘమైనది. కానీ ఈ తొలి అడుగే అతని భవిష్యత్తుకు పటిష్ట బాట వేయనుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇవి కూడా చదవండి:
అమ్మకానికి ఐపీఎల్ జట్లు.. హర్ష గొయెంకా పోస్ట్ వైరల్!
మహిళల టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే!