Share News

IND VS SA: తొలి వన్డేలో ఓడినా.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా!

ABN , Publish Date - Dec 01 , 2025 | 09:32 AM

రాంచీ వేదికగా నిన్న(నవంబర్ 30) భారత్ తో జరిగిన తొలి వన్డే లో 17 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో ఓడినప్పటికీ ప్రొటీస్ జట్టు ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాక చరిత్రలో తొలి జట్టుగా నిలిచింది.

IND VS SA: తొలి వన్డేలో ఓడినా.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా!
South Africa ODI record

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి టీమిండియా గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం (నవంబర్‌ 30) జరిగిన తొలి వన్డేలో (India vs South Africa) భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ప్రొటీస్ జట్టుకు చుక్కలు చూపించింది. ఇక ఈ మ్యాచ్ లో ఓడినప్పటికీ దక్షిణాఫ్రికా జట్టు ఓ రికార్డు(South Africa ODI record)ను క్రియేట్ చేసింది.


వన్డే లక్ష్య ఛేదనల్లో 15 పరుగులలోపే 3 వికెట్లు కోల్పోయి అంతిమంగా 300 పరుగులు చేసిన తొలి జట్టుగా సౌతాఫ్రికా రికార్డు(South Africa ODI record) నెలకొల్పింది. దీనికి ముందు ఈ రికార్డు పాకిస్థాన్‌ పేరిట ఉంది. 2019లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ లక్ష్య ఛేదనలో 6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి... అంతిమంగా 297 పరుగులు చేసింది. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. విరాట్‌ కోహ్లి (Virat Kohli) శతకం(135)తో చెలరేగిపోవడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. రోహిత్‌ శర్మ (57), కేఎల్‌ రాహుల్‌ (60) కూడా అర్ద సెంచరీలతో సత్తా చాటారు.


అనంతరం భారీ టార్గెట్‌తో బ్యాటింగ్‌కు ఆదిలో తడబడిన సౌతాఫ్రికా.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని కాసేపు టీమిండియాను భయపెట్టింది. 11 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ప్రొటీజ్ జట్టును మిడిలార్డర్‌ బ్యాటర్లు మాథ్యూ బ్రీట్జ్కే (72), జన్సెన్‌ (70), కార్బిన్‌ బాష్‌ (67) ఆదుకున్నారు. వీరు ఊహించని రీతిలో ప్రతిఘటించి టీమిండియా(Team India) శిబిరంలో గుబులు పుట్టించారు. అంతిమంగా టీమిండియా విజయం సాధించినప్పటికీ సఫారీల పోరాటం అందరినీ ఆకట్టుకుంది. 49.2 ఓవర్లలో ప్రొటీస్ జట్టు 332 పరుగులకు ఆలౌటైంది. మొత్తంగా భారత్ పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటికే పలు రికార్డులను నమోదు చేసింది.


ఇవి కూడా చదవండి:

రో-కో జోడీ రాహుల్‌కి బలం: బవుమా

Virat Kohli: రాంచీ వన్డేలో షాకింగ్ ఘటన.. విరాట్ కాళ్లపై పడిపోయిన అభిమాని

Updated Date - Dec 01 , 2025 | 12:48 PM