Mohammed Shami: షమిని అన్ని ఫార్మాట్లలో ఆడించాలి: సౌరవ్ గంగూలీ
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:28 PM
టీమిండియా పేసర్ మహ్మద్ షమి అన్ని ఫార్మాట్లలోనూ ఆడాలని భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తెలిపాడు. రంజీ ట్రోఫీలో షమి బౌలింగ్ చూశానని, అతడు ఎంతో ఫిట్‌గా ఉన్నాడని అన్నాడు. రంజీ ట్రోఫీలో ఒంటిచేత్తో బెంగాల్ జట్టును గెలిపించాడని గంగూలీ చెప్పుకొచ్చాడు.
టీమిండియా పేసర్ మహ్మద్ షమి అన్ని ఫార్మాట్లలోనూ ఆడాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ(Sourav Ganguly) తెలిపాడు. యూకేకి చెందిన కబుని అనే ఏఐ క్రీడా శిక్షణ వేదికకు గంగూలీ బ్రాడ్ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. ఈ ప్రోగ్రామ్‌లో సౌరభ్ మాట్లాడుతూ..‘రంజీ ట్రోఫీలో షమి బౌలింగ్ చూశాను. అతడు ఎంతో ఫిట్‌గా ఉన్నాడు. అదే విధంగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. రంజీ ట్రోఫీలో ఒంటిచేత్తో బెంగాల్ జట్టు(Bengal Cricket Team)ను గెలిపించాడు.
రెండు మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనను బీసీసీఐ సెలక్టర్లు చూశారనే అనుకుంటున్నాను. వాళ్లు షమితో మాట్లాడుతూనే ఉంటారని భావిస్తున్నా. ప్రస్తుతం షమి(Mohammed Shami) ఉన్న ఫామ్, ఫిట్‌నెస్ చూస్తే టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో ఆడగలడని నేను నమ్మతున్నాను. ఇంత ఫిట్ గా ఉన్న షమిని టెస్టుల్లో ఎందుకు తీసుకోవడం లేదో అర్ధం కావట్లేదు’ అని సౌరభ్ పేర్కొన్నాడు. సౌతాఫ్రికాతో జరిగే టెస్టులకు షమి సెలెక్ట్ కానీ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గంగూలి పరోక్షంగా బీసీసీఐ(BCCI) సెలెక్టర్లకు ఈ కీలక సూచనలు చేశాడని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
అలానే యంగ్ ప్లేయర్ ధ్రువ్ జురెల్ గురించి కూడా దాదా ప్రస్తావించాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ధ్రువ్ జురెల్ తుది జట్టులో ఉండాలని ఆయన అన్నాడు. వికెట్ కీపర్ అయినప్పటికీ బ్యాటింగ్ ప్రదర్శన ఆధారంగా అతడు తుది జట్టులో చోటు సంపాదిస్తాడని గంగూలి ఆశాభావం వ్యక్తం చేశాడు. జురెల్ బాగా ఆడుతున్నాడని, గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ కూడా పునరాగమనానికి సిద్ధమయ్యాడని అన్నాడు. పంత్ దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఆడడం ఖాయమని, అయితే ఫామ్‌లో ఉన్న జురెల్‌కు కూడా అవకాశాన్ని కల్పించాలని సెలెక్టర్లకు గంగూలీ సూచించాడు. సాయి సుదర్శన్‌ను తప్పించి ఆ స్థానంలో జురెల్‌ను ఆడించడమే మార్గంగా కనిపిస్తోందని గంగూలీ అన్నాడు. తాజాగా దక్షిణాఫ్రికా-ఎతో రెండో అనధికార టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో జురెల్ అదరగొట్టిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Andhra vs Tamil Nadu: తమిళనాడుపై ఆంధ్ర జట్టు సంచలన విజయం
Naseem Shah: పాకిస్థాన్ క్రికెటర్ ఇంటిపై కాల్పులు
మరిన్ని వార్తలు కోసం క్లిక్ చేయండి..