Share News

Gujarat Titans Victory: శుభ్‌మన్‌ దంచెన్‌

ABN , Publish Date - Apr 22 , 2025 | 03:40 AM

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ శుభ్‌మన్ గిల్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘనవిజయం సాధించింది. గిల్‌ 90 పరుగులతో మెరిపించగా, బౌలర్లు సమిష్టిగా రాణించి గుజరాత్‌ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది,

 Gujarat Titans Victory: శుభ్‌మన్‌ దంచెన్‌

  • కోల్‌కతాపై గుజరాత్‌ ఘనవిజయం

కోల్‌కతా: గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (55 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 90) అదరగొట్టాడు. మరోవైపు బౌలర్లు సమష్ఠిగా రాణించడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విలవిల్లాడింది. 199 పరుగుల ఛేదనలో తొమ్మిది మంది బ్యాటర్లతో బరిలోకి దిగినా కేకేఆర్‌ 39 రన్స్‌తో ఓడింది. అంతకుముందు బౌలింగ్‌లోనూ కేకేఆర్‌ పూర్తిగా తేలిపోయింది. ఈ విజయంతో టైటాన్స్‌ 12 పాయింట్లతో తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్ట పర్చుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 52) అర్ధసెంచరీ సాధించగా బట్లర్‌ (23 బంతుల్లో 8 ఫోర్లతో 41 నాటౌట్‌) వేగం చూపాడు. ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసి ఓడింది. రహానె (50), రఘువంశీ (27 నాటౌట్‌) రస్సెల్‌ (21) మాత్రమే రాణించారు. రషీద్‌, ప్రసిద్ధ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా గిల్‌ నిలిచాడు.


పోరాటమే లేకుండా..: ఈ పిచ్‌పై సవాల్‌గా మారిన ఛేదనకు బరిలోకి దిగిన కోల్‌కతా పేలవ ప్రదర్శన కనబర్చింది. కెప్టెన్‌ రహానె కాస్త పోరాడినా ఫలితం లేకపోయింది. బంతి బ్యాట్‌పైకి రాకపోవడంతో కేకేఆర్‌ బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు సాహసించలేదు. దీంతో వీరి ఇన్నింగ్స్‌ నత్తనడకన సాగిం ది. అటు చేయాల్సిన రన్‌రేట్‌ కష్టంగా మారడంతో కేకేఆర్‌ చేసేదేమీ లేకపోయింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ గుర్బాజ్‌ (1)ను సిరాజ్‌ అవుట్‌ చేశాడు. మరో ఓపెనర్‌ నరైన్‌ (17) పవర్‌ప్లేలోనే వెనుదిరగ్గా, రెండో వికెట్‌కు రహానెతో కలిసి 41 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ స్థితిలో వెంకటేశ్‌ అయ్యర్‌తో కలిసి రహానె ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఇద్దరూ జాగ్రత్తగా ఆడడంతో 6-10 ఓవర్ల మధ్య ఒక్క ఫోర్‌ కూడా రాలేదు. 11వ ఓవర్‌లో రహానె 4,6తో స్కోరులో కదలిక వచ్చింది. కానీ తర్వాతి వరుస రెండు ఓవర్లలో ఈ ఇద్దరూ అవుటవడంతో ఆశలు ఆవిరయ్యాయి. రస్సెల్‌ జోరు కాసేపే అయ్యింది. 17వ ఓవర్‌లో రమణ్‌దీప్‌ (1), మొయిన్‌ అలీ (0) వికెట్లను తీసి ప్రసిద్ధ్‌ మరింత దెబ్బకొట్టాడు. చివర్లో రఘువంశీ ధాటిగా ఆడినా కేకేఆర్‌ ఓటమి లాంఛనమే అయ్యింది.


టాపార్డర్‌ అదుర్స్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు గిల్‌, సుదర్శన్‌ నిలకడగా ఆడారు. అలాగే వన్‌డౌన్‌ బ్యాటర్‌ బట్లర్‌ ఈడెన్‌లో తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగించాడు. అతడి రెండు క్యాచ్‌లను కేకేఆర్‌ వదిలేయడం కూడా టైటాన్స్‌కు లాభించింది. అయితే స్లో వికెట్‌ కావడంతో ఆరంభంలో గిల్‌ ఆచితూచి ఆడగా, సుదర్శన్‌ కాస్త వేగం కనబర్చాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 45 పరుగులతో ఓ మాదిరి స్కోరందుకుంది. అయితే ఏడో ఓవర్‌లో గిల్‌ 6,4,4తో చెలరేగడంతో 17 రన్స్‌ సమకూరాయి. 11వ ఓవర్‌లో సుదర్శన్‌ 4,6తో 33 బంతుల్లో ఫిఫ్టీ సాధించగా, గిల్‌ కూడా అదే ఓవర్‌లో సింగిల్‌తో 34 బంతుల్లో ఈ ఫీట్‌ పూర్తి చేశాడు. ముఖ్యంగా స్పిన్నర్లను వీరు అద్భుతంగా అడ్డుకోగలిగారు. అయితే కేకేఆర్‌ను విసిగిస్తున్న ఈ జోడీని రస్సెల్‌ విడదీశాడు. 13వ ఓవర్‌లో కీపర్‌ గుర్బాజ్‌కు సుదర్శన్‌ క్యాచ్‌ ఇవ్వడంతో తొలి వికెట్‌కు 114 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. కానీ అదే ఓవర్‌లో బట్లర్‌ వచ్చీ రాగానే హ్యాట్రిక్‌ ఫోర్లతో అలరించాడు. హర్షిత్‌ ఓవర్‌లోనూ తను రెండు ఫోర్లు బాదగా.. 16వ ఓవర్‌లో గిల్‌ రెండు ఫోర్లతో స్కోరు 150 దాటింది. సెంచరీకి సమీపంలో మరింత జోరు పెంచిన గిల్‌ పేసర్‌ వైభవ్‌ ఓవర్‌లో 6,4 బాది వెంటనే రింకూకు క్యాచ్‌ ఇచ్చాడు. మరోవైపు రూథర్‌ఫోర్డ్‌కన్నా ముందే క్రీజులోకి వచ్చిన తెవాటియా డకౌట్‌గా వెనుదిరిగాడు. చివరి ఓవర్‌లో బట్లర్‌ 4,4 షారుక్‌ (11 నాటౌట్‌) 6తో 18 రన్స్‌ రాబట్టిన టైటాన్స్‌ 200కి సమీపంలోకి రాగలిగింది. మొత్తంగా ఆఖరి 5 ఓవర్లలో జీటీ 59 రన్స్‌ కారణంగా భారీ స్కోరందుకుంది.


  • స్కోరుబోర్డు

గుజరాత్‌: సాయి సుదర్శన్‌ (సి) గుర్బాజ్‌ (బి) రస్సెల్‌ 52, గిల్‌ (సి) రింకూ (బి) వైభవ్‌ 90, బట్లర్‌ (నాటౌట్‌) 41, తెవాటియా (సి) రమణ్‌దీప్‌ (బి) హర్షిత్‌ 0, షారుక్‌ (నాటౌట్‌) 11, ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 198/3; వికెట్ల పతనం: 1-114, 2-172, 3-177; బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4-0-44-1, మొయిన్‌ అలీ 3-0-27-0, హర్షిత్‌ రాణా 4-0-45-1, వరుణ్‌ 4-0-33-0, నరైన్‌ 4-0-36-0, రస్సెల్‌ 1-0-13-1.

కోల్‌కతా: గుర్బాజ్‌ (ఎల్బీ) సిరాజ్‌ 1, నరైన్‌ (సి) తెవాటియా (బి) రషీద్‌ 17, రహానె (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) వాషింగ్టన్‌ 50, వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) వాషింగ్టన్‌ (బి) సాయి కిషోర్‌ 14, రింకూ (సి) గిల్‌ (బి) ఇషాంత్‌ 17, రస్సెల్‌ (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 21, రమణ్‌దీప్‌ (సి అండ్‌ బి) ప్రసిద్ధ్‌ 1, అలీ (సి) షారుక్‌ (బి) ప్రసిద్ధ్‌ 0, రఘువంశి (నాటౌట్‌) 27, హర్షిత్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 159/8; వికెట్ల పతనం: 1-2, 2-43, 3-84, 4-91, 5-118, 6-119, 7-119, 8-151; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-32-1, ఇషాంత్‌ 2-0-18-1, ప్రసిద్ధ్‌ 4-0-25-2, రషీద్‌ 4-0-25-2, వాషింగ్టన్‌ 3-0-36-1, సాయి కిషోర్‌ 3-0-19-1.

Updated Date - Apr 22 , 2025 | 03:44 AM