Share News

Royal Challengers Bangalore Win: సొంతగడ్డపై మురిసె

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:15 AM

బెంగళూరు తన సొంత మైదానంలో రాజస్థాన్‌ రాయల్స్‌ను 11 పరుగుల తేడాతో ఓడించి మురిపించింది. హాజెల్‌వుడ్‌కు నాలుగు వికెట్లు, విరాట్‌ కోహ్లీ 70 పరుగులతో శుభారంభం చేశారు. రాజస్థాన్‌ జట్టు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు కోల్పోయింది

Royal Challengers Bangalore Win: సొంతగడ్డపై మురిసె

  • చిన్నస్వామిలో ఆర్‌సీబీ బోణీ

  • హాజెల్‌వుడ్‌కు నాలుగు వికెట్లు

  • ఆఖర్లో తడబడిన రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలు దాదాపు గల్లంతు

బెంగళూరు: ఇతర వేదికల్లో అదిరే విజయాలతో ఆకట్టుకుంటున్నా.. తాజా సీజన్‌లో సొంత వేదికపై మాత్రం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు గెలిచిందే లేదు. ఇక్కడ హ్యాట్రిక్‌ ఓటములతో చిన్నబోయిన ఆర్‌సీబీ ఎట్టకేలకు రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో నెగ్గి అభిమానులను మురిపించింది. అటు ఆర్‌ఆర్‌కిది వరుసగా ఐదో ఓటమి. కేవలం నాలుగు పాయింట్లతో ఉన్న ఈ జట్టు ప్లేఆఫ్స్‌ ఆశలు దాదాపు గల్లంతైనట్టే. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. విరాట్‌ (70), దేవ్‌దత్‌ (50) ధాటిగా ఆడారు. సందీ్‌పనకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులు చేసి ఓడింది. జైస్వాల్‌ (49), జురెల్‌ (47) రాణించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ హాజెల్‌వుడ్‌కు నాలుగు, క్రునాల్‌కు రెండు వికెట్లు దక్కాయి.


ధాటిగా ఆరంభించినా..: 206 పరుగుల ఛేదన.. అయితేనేం ఓపెనర్‌ జైస్వాల్‌ ధాటికి రాజస్థాన్‌ తొలి 9 ఓవర్లలోనే 110 పరుగులతో నిలిచింది. అప్పటికి రెండు వికెట్లు కోల్పోయినా 12 పరుగుల రన్‌రేట్‌తో దూసుకెళ్లింది. కానీ స్పిన్నర్‌ క్రునాల్‌ పాండ్యా మ్యాజిక్‌ బంతులతో కట్టడి చేయడంతో 10-15 ఓవర్లలో జట్టు చేసింది 38 పరుగులే.. పైగా మరో రెండు వికెట్లు కూడా కోల్పోయింది. ఈ తడబాడు జట్టు భారీ ఛేదనపై ప్రభావం చూపింది. చివర్లో జురెల్‌ పోరాడినా నిరాశ తప్పలేదు. ఇన్నింగ్స్‌ తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన జైస్వాల్‌ ఉన్నంత సేపు ఎదురుదాడికి దిగాడు. రెండో ఓవర్‌లో 4,4,6తో 18.. నాలుగో ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లతో 12 రన్స్‌ రాబట్టాడు. అటు మరో ఓపెనర్‌ వైభవ్‌ (16)ను భువనేశ్వర్‌ అవుట్‌ చేసినా జైస్వాల్‌ తగ్గలేదు. ఆరో ఓవర్‌లో 4,4,6తో 14 రన్స్‌ అందించాడు. పవర్‌ప్లేలో 72/2 స్కోరుతో పటిష్టంగా కనిపించినా.. జైస్వాల్‌ పరుగు తేడాతో హాఫ్‌సెంచరీని కోల్పోయాడు. ఆ తర్వాత పరాగ్‌ (22), రాణా (28) సైతం భారీ షాట్లతో చెలరేగారు. కానీ పదో ఓవర్‌లో పరాగ్‌ను క్రునాల్‌ అవుట్‌ చేయడంతో ఆర్‌ఆర్‌ తడబాటు ఆరంభమైంది. రాణాను సైతం క్రునాల్‌ వెనక్కిపంపాడు. అటు హిట్టర్‌ హెట్‌మయెర్‌ (11) నిరాశపర్చగా.. సమీకరణం 3 ఓవర్లలో 40 పరుగులకు చేరింది. ఈ దశలో 18వ ఓవర్‌లో జురెల్‌ 6,4,4 శుభమ్‌ (12) 6తో 22 రన్స్‌తో ఆర్‌సీబీలో గుబులు రేపారు. కానీ వరుస బంతుల్లో జురెల్‌, ఆర్చర్‌ (0)లను హాజెల్‌వుడ్‌ అవుట్‌ చేయడంతో ఆశలు లేకుండా పోయాయి. చివరి ఓవర్‌లో 17 రన్స్‌ కావాల్సి ఉండగా శుభమ్‌, హసరంగ (1) వికెట్లను కోల్పోయి 5 పరుగులే చేయడంతో ఆర్‌సీబీ సంబరాల్లో మునిగింది.


టాపార్డర్‌ అదుర్స్‌ : టాస్‌ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కింది. బంతి అనూహ్యంగా బౌన్స్‌ అవుతున్నా టాపార్డర్‌ నిలబడింది. విరాట్‌ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగించగా.. అతడికి పడిక్కళ్‌, ఓపెనర్‌ సాల్ట్‌ (26) చక్కగా సహకరించారు. చివర్లో డేవిడ్‌ (23) మెరుపులు తోడయ్యాయి. దీనికితోడు రాజస్థాన్‌ పేలవ ఫీల్డింగ్‌ కూడా కలిసివచ్చింది. సాల్ట్‌ ఒక్క పరుగు వద్ద ఉన్నప్పుడే కెప్టెన్‌ పరాగ్‌ అతడి క్యాచ్‌ను వదిలేశాడు. ఓపెనర్ల అడపాదడపా బౌండరీలతో పవర్‌ప్లేలో స్కోరు 59కి చేరింది. కానీ ఆ వెంటనే స్పిన్నర్‌ హసరంగ సాల్ట్‌ను అవుట్‌ చేసి తొలి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యానికి చెక్‌ పెట్టాడు. మరోవైపు స్పిన్నర్ల ధాటికి 7-11 ఓవర్ల మధ్య స్కోరు కాస్త నెమ్మదించింది. 12వ ఓవర్‌లో విరాట్‌ రెండు ఫోర్లతో సీజన్‌లో ఐదో ఫిఫ్టీని పూర్తి చేశాడు. అటు పడిక్కళ్‌ 28 రన్స్‌ దగ్గర ఉన్నప్పుడు ఇచ్చిన సులువైన క్యాచ్‌ను తుషార్‌ వదిలేశాడు. 15వ ఓవర్‌లో పడిక్కళ్‌ రెండు సిక్సర్లు, విరాట్‌ ఓ సిక్సర్‌తో 22 రన్స్‌ సమకూరాయి. అయితే 16వ ఓవర్‌లో బంతి ఆర్చర్‌ చేతికివ్వడంతో తను ఈ ఫార్మాట్‌లో తొలిసారి విరాట్‌ను అవుట్‌ చేశాడు. ఈ దశలో సందీప్‌ 17వ ఓవర్‌లో పడిక్కళ్‌, రజత్‌ (1)ల వికెట్లను తీయడంతో 200 స్కోరుపై సందేహం నెలకొంది. అయితే డేవిడ్‌, జితేశ్‌ (19 నాటౌట్‌)ల జోరుకు ఆఖరి మూడు ఓవర్లలో 38 పరుగులు రావడంతో ఆర్‌సీబీ 205 రన్స్‌తో ప్రత్యర్థిని సవాల్‌ చేయగల స్కోరు సాధించింది.

  • టీ20ల్లో తొలుత బ్యాటింగ్‌ చేస్తూ ఎక్కువ 50+ స్కోర్లు (62) సాధించిన ప్లేయర్‌గా విరాట్‌. బాబర్‌ ఆజమ్‌ (61)ను దాటాడు.

  • ఐపీఎల్‌లో రాజస్థాన్‌పై తమ అత్యధిక స్కోరు (205)ను నమోదు చేసిన బెంగళూరు.

  • ఐపీఎల్‌ చరిత్రలో ఇన్నింగ్స్‌ తొలి బంతినే 3 సార్లు సిక్సర్‌గా మలచిన తొలి ఆటగాడు యశస్వీ


బెంగళూరు: సాల్ట్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) హసరంగ 26; విరాట్‌ (సి) రాణా (బి) ఆర్చర్‌ 70; పడిక్కళ్‌ (సి) రాణా (బి) సందీప్‌ 50; డేవిడ్‌ (రనౌట్‌) 23; రజత్‌ (సి) జురెల్‌ (బి) సందీప్‌ 1; జితేశ్‌ (నాటౌట్‌) 20; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 20 ఓవర్లలో 205/5. వికెట్ల పతనం: 1-61, 2-156, 3-161, 4-163, 5-205; బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-33-1; ఫరూఖి 3-0-30-0; తుషార్‌ 2-0-36-0; సందీప్‌ 4-0-45-2; హసరంగ 4-0-30-1; పరాగ్‌ 3-0-30-0.

రాజస్థాన్‌: యశస్వీ (సి) షెపర్డ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 49, వైభవ్‌ (బి) భువనేశ్వర్‌ 16, నితీశ్‌ రాణా (సి) భువనేశ్వర్‌ (బి) క్రునాల్‌ 28, రియాన్‌ (సి) జితేశ్‌ (బి) క్రునాల్‌ 22, జురెల్‌ (సి) జితేశ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 47, హెట్‌మయెర్‌ (సి) జితేశ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 11, శుభమ్‌ (సి) సాల్ట్‌ (బి) యశ్‌ 12, ఆర్చర్‌ (సి) పటీదార్‌ (బి) హాజెల్‌వుడ్‌ 0, హసరంగ (రనౌట్‌) 1, తుషార్‌ (నాటౌట్‌)1, ఫరూఖి (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం: 20 ఓవర్లలో 194/9; వికెట్ల పతనం: 1-52, 2-72, 3-110, 4-134, 5-162, 6-189, 7-189, 8-189, 9-191; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-50-1, యశ్‌ దయాల్‌ 3-0-33-1, హాజెల్‌వుడ్‌ 4-0-33-4, షెపర్డ్‌ 1-0-15-0, సుయాశ్‌ 4-0-31-0, క్రునాల్‌ పాండ్యా 4-0-31-2.

Updated Date - Apr 25 , 2025 | 07:33 AM