Share News

Ranchi Pitch: కళ్లన్నీ రాంచి పిచ్‌పైనే!

ABN , Publish Date - Nov 30 , 2025 | 10:43 AM

సౌతాఫ్రికా చేతిలో టీమిండియా టెస్టు సిరీస్ కోల్పోయి వైట్ వాష్ అయిన విషయం తెలిసిందే. పిచ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్-సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కు సిద్ధమయ్యాయి. మరి రాంచి పిచ్ ఎలా ఉండనుందనే సందేహం మొదలైంది.

Ranchi Pitch: కళ్లన్నీ రాంచి పిచ్‌పైనే!
Ranchi Pitch

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటి వరకు మ్యాచ్ ఓడితే ఆటగాళ్ల వైఫల్యం.. కోచ్ నిర్ణయాలు.. అనే ప్రస్తావనే వచ్చేది. కానీ సౌతాఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా ఓటమి తర్వాత.. పిచ్ కూడా భాగమైంది. పిచ్ వల్లే ఓటమి తప్పలేదంటూ విమర్శలూ వచ్చాయి. గువాహటి వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ పిచ్ కీలక పాత్ర పోషించింది. రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 0-2 తేడాతో కోల్పోయింది. స్వదేశంలో భారత్ ఓటమిని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితం.. ప్రధాన కోచ్ నిర్ణయాల వల్లే ఈ చెత్త రికార్డులంటూ విమర్శలు. ఈ నేపథ్యంలో అదే సఫారీలతో టీమిండియా వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. రాంచి వేదికగా తొలి మ్యాచ్ ఆదివారం ప్రారంభం కానుంది. మరి రాంచి పిచ్(Ranchi Pitch) ఎలా ఉండనుందనే సందేహం అందరిలో మొదలైంది.


రాంచిలోని జేఎస్‌సీ(JSCA)ఏ అంతర్జాతీ క్రికెట్ స్టేడియం పిచ్‌ను ఈసారి స్పోర్టింగ్ వికెట్‌గా అంచనా వేస్తున్నారు. అటు బ్యాటింగ్‌కు, ఇటు బౌలింగ్‌కు అనుకూలంగా ఉండేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రాంచిలో ఇప్పటి వరకు ఐదు వన్డేలు మాత్రమే జరిగాయి. వాటిలో భారీ స్కోర్లు అంటూ ఏమీ నమోదు కాలేదు. ఒక్కసారి మాత్రమే స్కోరు 300 దాటింది. ఇక్కడి పిచ్‌ కొంచెం నెమ్మదిగా ఉంటుంది. ఆదివారం 270-280 మధ్య స్కోరు నమోదయ్యే అవకాశముంది. 300 చేస్తే గెలిచేందుకు మెరుగైన అవకాశాలుంటాయి. ఇక్కడ స్పిన్నర్లు బాగా ప్రభావం చూపిస్తారు. రాత్రి మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపొచ్చు. ఎందుకంటే రాంచిలో ఇప్పటివరకు జరిగిన ఐదు వన్డేలలో మూడు సార్లు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది.


మంచు ప్రభావం ఖాయం..

దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ అష్వెల్ ప్రిన్ పిచ్‌పై స్పందించారు. ‘మా అంచనా ప్రకారం మ్యాచ్ మొత్తంలో డ్యూ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు ఛేజ్‌కి వెళ్తే ఆశ్చర్యం లేదు. అయితే మొదట బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోరు చేయాలి. అలా అయితే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలం’ అని ఆయన వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

రో-కో జోడీ రాహుల్‌కి బలం: బవుమా

విరాట్‌కు కలిసొచ్చిన కేఎల్ కెప్టెన్సీ.. సెంచరీ రిపీట్ అవ్వనుందా?

Updated Date - Nov 30 , 2025 | 10:43 AM