Ind Vs SA: విరాట్‌కు కలిసొచ్చిన కేఎల్ కెప్టెన్సీ.. సెంచరీ రిపీట్ అవ్వనుందా?
ABN , Publish Date - Nov 30 , 2025 | 08:02 AM
సౌతాఫ్రికా-భారత్ మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టాడు. 2022లో రాహుల్ కెప్టెన్సీలో ఫామ్ అందుకుని వరుసగా సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ .. ఈ సిరీస్‌లో మళ్లీ అదే రికార్డు తిరగరాయనున్నాడా? అన్న ఉత్కంఠ అభిమానుల్లో పెరుగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: నేటి నుంచి సౌతాఫ్రికా-భారత్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌కు రాంచి ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ నియమితుడైన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ గిల్ గాయపడటంతో ఆ పగ్గాలు రాహుల్‌కు అప్పగించారు. అయితే కేఎల్(KL Rahul) కెప్టెన్సీ టీమిండియా ఆటగాళ్లకు కలిసొస్తుందట. మరీ ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి! అదెలాగంటారా?
ఫామ్ లేమి నుంచి..
పరుగుల వీరుడు.. రికార్డుల దేవుడు.. ఎన్నో బిరుదులు విరాట్ కోహ్లీ(Virat Kohli) సొంతం. అయితే ఈ రన్ మెషిన్ మూడేళ్ల పాటు ఫామ్ లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఫలితం.. కెప్టెన్సీని కూడా కోల్పోయాడు. 2019 నుంచి 2022 సెప్టెంబర్ వరకు దాదాపు రెండున్నరేళ్లకు పైగా కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ మాటన్నదే లేదు. ఈ క్రమంలో 2022 ఆసియా కప్‌లో కేఎల్ కెప్టెన్సీలో ఎట్టకేలకు ఫామ్ అందుకుని సెంచరీ చేశాడు. తన కెరీర్‌లో 71వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కట్ చేస్తే.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో కూడా సెంచరీ బాది 72వ శతకాన్ని నమోదు చేశాడు. అప్పటి నుంచి కేఎల్ రాహుల్ కెప్టెన్సీ అంటే విరాట్ అభిమానులకు అమితమైన ఇష్టం. రాహుల్ కలిసొచ్చాడంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడి పోయారు. అయితే ఆసీస్‌లో వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన విరాట్.. మూడో వన్డేలో ఫామ్ అందుకుని 67 పరుగులు చేశాడు. మరి సౌతాఫ్రికాతో వన్డేలో కేఎల్ కెప్టెన్సీలో విరాట్ సెంచరీ రికార్డు రిపీట్ అవ్వనుందా? ఈ సారి కూడా కోహ్లీ శతక్కొడితే.. కింగ్ ఫ్యాన్స్ కేఎల్‌ను పొగడ్తలతో ముంచెత్తుతారనడంలో అతిశయోక్తి లేదు.
అద్భుతమైన రికార్డు..
టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌కు వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉంది. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలిసారి విఫలమైనా.. ఆ తర్వాత కేఎల్ అజేయంగా నిలిచాడు. వన్డేల్లో రాహుల్ 12 మ్యాచులకు కెప్టెన్సీ చేశాడు. ఇందులో టీమిండియా ఎనిమిది గెలిచి.. నాలుగింట్లో ఓడింది. కెప్టెన్‌గా రాహుల్ విజయ శాతం 66గా ఉంది. అయితే అతడి కెప్టెన్సీలో తొలిసారి ఓడింది కూడా సఫారీల చేతిలోనే కావడం గమనార్హం. నేటి నుంచి రాంచి వేదికగా జరిగే వన్డే సిరీస్‌లో టీమిండియా గెలిస్తే.. పలు కీలక రికార్డులు బద్దలు అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పిన విరాట్.. ఈ సిరీస్‌లో సెంచరీ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వారికి కేఎల్ కెప్టెన్సీ రికార్డు కాస్త ఊరటనిస్తుంది.
ఇవి కూడా చదవండి:
పాకిస్తాన్‌దే ముక్కోణపు సిరీస్