India vs England: భారత చివరి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. మనకు లాభమా, నష్టమా..
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:13 PM
ఇంగ్లండ్ జట్టుతో జరగనున్న భారత చివరి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ప్రభావం ఉంది. ఈ విషయాన్ని అక్యూ వెదర్ తెలిపింది. అయితే వర్షం అంతరాయం భారత జట్టుకు లాభమా లేక నష్టమా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఆండర్సన్-టెండుల్కర్ ట్రోఫీ 2025లో ఐదవ, చివరి టెస్ట్ మ్యాచ్ కోసం వేదిక సిద్ధమైంది. జూలై 31న మధ్యాహ్నం 3.30 గంటల నుంచి లండన్‌లోని ది ఓవల్‌లో (Oval Test) ఇంగ్లండ్, భారత (India vs England) జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో పోటీపడ్డాయి. ఇంగ్లండ్ మొదటి, మూడో టెస్ట్‌లలో విజయం సాధించగా, భారత్ రెండవ టెస్ట్‌లో గెలిచింది, నాల్గవ టెస్ట్ డ్రాగా ముగిసింది.
ఈ నేపథ్యంలో సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిపత్యంలో ఉండగా, చివరి టెస్ట్‌లో భారత్‌పై ఒత్తిడి ఉంది. ఈ మ్యాచ్‌లో ఇండియా ఓటమి ఇంగ్లాండ్‌కు సిరీస్ విజయాన్ని అందిస్తుంది. అందుకే భారత జట్టు పూర్తి శక్తితో ఆడి, 2-2 స్కోర్‌తో సిరీస్‌ను సమం చేయాలని లక్ష్యంతో ఉంది.
మొదటి రోజు వర్షం ప్రభావం
కానీ మ్యాచ్ మొదటి రోజు వాతావరణం అభిమానులకు నిరాశ కలిగించేలా ఉంది. లండన్‌లో వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఎక్కువగా ఉందని అక్యూ వెదర్ సూచిస్తోంది. ఉదయం సమయంలో వర్షం ఎక్కువగా కురిసే అవకాశం ఉండగా, మధ్యాహ్నం సమయంలో కొద్దిపాటి మేఘావృతం ఉంటుందని తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో వర్షం కురిసే అవకాశం 50 శాతం ఉండగా, 85 శాతం మేఘావృతమై ఉంటుందని అంచనా. ఈ పరిస్థితుల్లో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
భారత్‌కు లాభమా, నష్టమా?
వర్షం ఆటంకం కలిగిస్తే, దాని ప్రభావం భారత జట్టుపై ఎలా ఉంటుంది. వర్షం వల్ల మ్యాచ్ డ్రాగా ముగిస్తే, ఇంగ్లాండ్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఇది భారత్‌కు నష్టం కలిగించే అంశమని చెప్పవచ్చు. మరోవైపు, వర్షం వల్ల ఆట సమయం తగ్గితే, భారత బ్యాట్స్‌మెన్‌లపై ఒత్తిడి పెరుగుతుంది. వారు తక్కువ సమయంలో మంచి స్కోర్ సాధించేందుకు ప్రయత్నించవచ్చు. కానీ భారత బౌలర్లు మేఘావృత వాతావరణంలో స్వింగ్ బంతులతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టవచ్చు. ఇది భారత్‌కు కొంత లాభం చేకూర్చవచ్చు.
ఇరు జట్లు కూడా..
భారత జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే మాత్రం వారి బ్యాటింగ్, బౌలింగ్ రెండూ కీలకం కానున్నాయి. ఇంగ్లాండ్ బలమైన బౌలింగ్ లైనప్‌ను ఎదుర్కోవాలి. వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగితే, సమయం పరిమితంగా ఉండటం వల్ల వ్యూహాత్మకంగా ఆడటం మరింత కష్టమవుతుంది. అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టెస్ట్ ఫలితం సిరీస్ విజేతను నిర్ణయిస్తుంది. కాబట్టి రెండు జట్లూ కూడా విజయం సాధించాలనే ధీమాతో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి