Share News

Canada-Palestine: పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తాము: కెనడా ప్రధాని

ABN , Publish Date - Jul 31 , 2025 | 11:42 AM

పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు తాము సిద్ధమేనని కెనడా ప్రధాని కార్నీ తాజాగా ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పేందుకు ఇది అవసరమని అభిప్రాయపడ్డారు. ద్విదేశ విధానానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

Canada-Palestine: పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తాము: కెనడా ప్రధాని
Canada Palestine recognition

ఇంటర్నెట్ డెస్క్: పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు సిద్ధంగా ఉన్నామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తాజాగా తెలిపారు. పాలస్తీనా-ఇజ్రాయెల్ వివాద పరిష్కారం కోసం ద్విదేశ విధానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

ఐక్యరాజ్య సమితి 80వ సర్వసభ్య సమావేశాల్లో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించే యోచనలో ఉన్నామని కెనడా ప్రధాని తెలిపారు. ఇందుకు సంబంధించి సంస్కరణలకు పాలస్తీనా అథారిటీ సిద్ధం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పాలస్తీనాలో చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలను 2026లో నిర్వహిస్తామని పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తనకు హామీ ఇచ్చారని ప్రధాని కార్నీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో హమాస్ జోక్యం ఉండబోదని కూడా ఆయన భరోసా ఇచ్చినట్టు తెలిపారు. పాలస్తీనా మిలిటరీకరణ కూడా జరగదని అబ్బాస్ హామీ ఇచ్చారని చెప్పారు.


గాజాలో ఆకలి కేకలు సంక్షోభ స్థాయికి చేరుకోవడం ప్రపంచదేశాలు మరోసారి ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై దృష్టి సారించాయి. గాజాకు మానవతా సాయం అందకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంటోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే, మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్‌కు తాము ఎప్పుడూ మద్దతుగానే ఉంటామని కెనడా ప్రధాని స్పష్టం చేశారు. కానీ శాశ్వత శాంతి స్థాపనకు పాలస్తీనా కూడా సుస్థిరత సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.

అంతకుమునుపు ఫ్రాన్స్ కూడా ఇదే ప్రకటన చేసింది. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా సెప్టెంబర్‌లో గుర్తిస్తామని వెల్లడించింది. కాల్పుల విరమణ సహా తాము చెప్పిన కండిషన్స్‌కు ఇజ్రాయెల్ అంగీకరించకపోతే పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని బ్రిటన్ కూడా ఇటీవలే ప్రకటించింది.


ఇక కెనడా ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ఈ నిర్ణయం కెనడా-అమెరికా వాణిజ్య చర్చలపై ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు. కెనడాపై అమెరికా సుంకాల కత్తి వేలాడుతూనే ఉన్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరాల్సి ఉంది.

కెనడా ప్రకటనపై ఇజ్రాయెల్ కూడా మండిపడింది. కెనడా ప్రధాని ప్రకటనను ఖండిస్తున్నామని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తమపై అంతర్జాతీయ ఒత్తిడులకు, దుష్ఫ్రచారానికీ లొంగేది లేదని స్పష్టం చేసింది. తమ భూభాగంపై జీహాదీ దేశం ఏర్పాటుకు అంగీకరించబోమని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

భారత్‌పై 25 శాతం సుంకం విధింపు.. ట్రంప్ మరో కీలక ప్రకటన

వలసలపై ట్రంప్ హెచ్చరికలు.. ఈ ఆక్రమణను అడ్డుకోవాలని ఐరోపా దేశాలకు పిలుపు

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 31 , 2025 | 11:52 AM