Ashes 2025: స్టార్క్ ఖాతాలో ‘శతక’ వికెట్లు
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:21 PM
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్‌కి దిగిన ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా స్టార్ పేసర్ స్టార్క్ చుక్కలు చూపించాడు. ఏకంగా ఏడు వికెట్లు తీసి ఓ అరుదైన క్లబ్‌లో స్థానం సంపాదించుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టెస్టు క్రికెట్‌లో యాషెస్ సిరీస్‌కు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఈ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ తొలి మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ విధ్వంసం సృష్టించాడు. ఆదిలోనే ఇంగ్లండ్‌కు కోలుకోలేని షాకిచ్చాడు. దీంతో ఓ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు.
ఏడు వికెట్లు..
తొలి ఓవర్‌లోనే ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేశాడు. స్టార్క్ బౌలింగ్‌లో ఖవాజాకు క్యాచ్ ఇచ్చిన క్రాలీ.. ఆరు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఆ తర్వాత డకెట్(21), రూట్(0), స్టోక్స్(6), స్మిత్(33),అట్కిన్‌సన్(1), వుడ్(0).. వంటి కీలక వికెట్లన్నీ స్టార్క్ ఖాతాలోనే పడ్డాయి. ఆసీస్ కెప్టెన్, స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్, మరో స్టార్ పేసర్ హేజిల్‌వుడ్ లేని ఆసీస్ బౌలింగ్ లెంగ్త్ ఎలా ఉంటుందోనన్న అభిమానుల భయాన్ని స్టార్క్(Mitchell Starc ) తన బంతిలో పోగొట్టాడు. ఒక్క ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
వంద వికెట్ల క్లబ్‌లో..
ఈ ప్రదర్శనతో యాషెస్ సిరీస్‌లో ఓవరాల్‌గా వంద వికెట్లు పూర్తి చేసుకున్న ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు. ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన 13వ ఆటగాడిగా.. ఓవరాల్‌గా 21వ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. కాగా కేవలం 23 యాషెస్ టెస్టుల్లోనే స్టార్క్ ఈ ఫీట్ అందుకోవడం విశేషం.
మ్యాచ్ విషయానికొస్తే..
స్టార్క్ ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. దీంతో ఆ జట్టు 172 పరుగుల వద్ద ఆలౌటైంది. హ్యారీ బ్రూక్(52) అర్థ శతకంతో రాణించగా.. పోప్(46) తృటిలో హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. స్మిత్(33), డకెట్(21) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన ఆస్ట్రేలియా పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఓపెనర్ వెదరాల్డ్ పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 7/1.
ఇవి కూడా చదవండి:
ఆ స్థానంపై ప్రయోగాలెందుకు?: ఆకాశ్ చోప్రా
ట్రోల్ చేసి క్షమాపణలు చెప్పాడు: ఆకాశ్ చోప్రా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి