Share News

Jemimah Rodrigues: ‘జెమ్’మీమా రోడ్రిగ్స్..!

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:42 PM

ఐసీసీ వన్డే మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీస్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. తనపై వచ్చిన ట్రోలింగ్స్‌కు బ్యాట్‌తోనే సమాధానం చెప్పి జట్టును గెలిపించంలో జెమీమా రోడ్రిగ్స్ కీలక పాత్ర పోషించింది.

Jemimah Rodrigues: ‘జెమ్’మీమా రోడ్రిగ్స్..!

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ వన్డే మహిళల వన్డే ప్రపంచ కప్ 2025.. జరిగింది సెమీస్ మ్యాచ్. కానీ టీమిండియా గెలుపు అజరామరం. ఎన్నో విమర్శలు.. మరెన్నో ట్రోలింగ్స్.. ‘ఈ బక్కపలుచని దేహానికి జట్టులో చోటెలా ఇచ్చారో..’ అంటూ ఎగతాళి మాటలు. ‘ఎప్పుడు చూసినా రీల్స్ చేస్తూ.. అల్లరి చేస్తూ ఉంటావ్.. పరుగులు చేసేదేమైనా ఉందా?’ అంటూ సూటిపోటి మాటలు.. అన్నింటికీ సమాధానం బ్యాట్‌తోనే చెప్పింది.. ఆమె ఎవరో ఇప్పటికే అర్థం అయ్యే ఉంటుందిగా.. ‘జెమీమా రోడ్రిగ్స్..!’.


ఓపెనర్ షఫాలీ వర్మ (10) ఔటయ్యాక నంబర్ 3లో క్రీజులోకి జెమీమా(Jemimah Rodrigues) వచ్చింది. ఎంత ఓపిక.. ఎంత కసి.. సెంచరీ చేయాలన్న మాట దేవుడెరుగు.. జట్టును గెలిపించాలన్న పట్టుదల తనని ఆఖరి వరకు క్రీజులో ఉండేలా చేసింది. సెంచరీ చేసినా సంబరాలు చేసుకోలేదు. ఆఖరి గెలుపు పరుగు తీశాక.. మైదానం అంతా తిరుగుతూ అభివాదాలు చేస్తూ వెళ్లింది. ఆఖరి పరుగు తీశాక మొదలయిన కన్నీళ్లు అరగంట అయినా ఆగలేదు. మొత్తానికి 127 అజేయమైన పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టును ముందుండి గెలిపించింది. మరోవైపు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌(Harmanpreet Kaur Partnership)తో 167 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొలిపింది. దీప్తి శర్మ(24), రిచా ఘోష్(26) మధ్యలో వచ్చి క్రీజులో ఉన్నంత సేపు భారీ షాట్లతో మెరుపులు మెరిపించారు.


వేటుకు గురై..

జెమీమా ఇప్పటి వరకు ఎలా ఆడిందో.. ఇక ముందు ఎలా ఆడుతుందో తెలీదు కానీ గురువారం ఆసీస్‌తో జరిగిన ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో ఆమె కెరీర్‌లోనే కాదు భారత క్రికెట్ చరిత్రలోనూ చిరస్మరణీయంగా నిలిచి పోతుందనడంలో సందేహం లేదు. ప్రపంచకప్‌ ఆరంభంలో తన ఆట చూస్తే.. ఈ మ్యాచ్‌లో ఆడడమే ఆశ్చర్యం. నాలుగు మ్యాచ్‌ల్లో జెమీమా 65 పరుగులే చేసింది. అందులో రెండు డకౌట్లు. దీంతో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఆమెను తుది జట్టు నుంచి తప్పించారు. కానీ న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్‌కు ఆమెను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. అప్పుడు ఎంతో కసిగా ఆడిన జెమీమా.. 55 బంతుల్లో 76 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. దీంతో సెమీస్‌లోనూ ఆమెను కొనసాగించారు.


అయితే హర్మన్‌ ఔటయ్యాక జెమీమా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. జెమీమా ధాటిగా ఆడగల బ్యాటర్‌ కాదు. భారీ షాట్లు కొట్టేంత శక్తి లేదు. ఆమె టైమింగ్, ప్లేస్‌మెంట్‌ ద్వారా బౌండరీలు సాధిస్తుంది. పైగా బాగా అలసిపోవడంతో ఒక దశలో షాట్లు కొట్టలేక ఇబ్బంది పడింది. 80-100 మధ్య షాట్లు ఆడలేక ఆమె తడబడ్డ తీరు చూసి అభిమానులు తిట్టుకుని ఉంటే ఆశ్చర్యం లేదు. కానీ చివర్లో తెలివిగా షాట్లు ఆడి జట్టును విజయం వైపు నడిపించింది. జెమీమా చివరి వరకు క్రీజులో ఉంది కాబట్టే టీమిండియా గెలిచిందనడంలో సందేహమే లేదు.


‘థాంక్యూ’..

మ్యాచ్ అనంతరం జెమీమా గెలుపుపై మాట్లాడింది. ‘నేను ఇక్కడ చాలా ఓపెన్‌గా చెప్తాను. ఎవరూ తమ బలహీనతల గురించి ఎక్కడా మాట్లాడరు. టోర్నమెంట్ ప్రారంభంలో చాలా ఆందోళన. కొన్ని మ్యాచ్‌ల ముందు అమ్మకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉండేదాన్ని. ఆందోళనతో మొదలై, జట్టు నుంచి డ్రాప్ అయ్యాను. అది చాలా దెబ్బ తీసింది. తిరిగి వచ్చాక మరింత ఒత్తిడి. కానీ కొన్నిసార్లు హ్యాంగ్ ఇన్ చేస్తే చాలు.. పనులు సరిగ్గా జరుగుతాయి. ‘ఏడుపు రాత్రి ఉంటుంది, సంతోషం ఉదయం వస్తుంది’ అని బైబిల్ చెప్తుంది. ఈ రోజు నాకు సంతోషం వచ్చింది, కానీ ఇంకా ఏడుస్తూనే ఉన్నాను’ అని తీవ్ర భావోద్వేగానికి గురైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

చాంపియన్‌ను కొట్టేసి ఫైనల్‌ బెర్త్‌ పట్టేసి

మెల్‌బోర్న్‌లో మోతెక్కించేనా

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 31 , 2025 | 12:42 PM