ICC: మీడియా హక్కులు యాథాతథమే.. స్పష్టం చేసిన ఐసీసీ, జియోస్టార్
ABN , Publish Date - Dec 13 , 2025 | 07:33 AM
భారత్‌లో ఐసీసీ టోర్నీలకు సంబంధించి మీడియా హక్కుల ఒప్పందం నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జియోస్టార్ తప్పుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఐసీసీ-జియోస్టార్ స్పందించాయి. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఐసీసీ టోర్నీలకు సంబంధించి మీడియా హక్కుల ఒప్పందం నుంచి జియో హాట్‌స్టార్ సంస్థ తప్పుకుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. భారత్‌లో క్రికెట్ మ్యాచ్‌ల ప్రసారం కోసం సంస్థలు ఎగబడటమే చూస్తుంటాం. కానీ మధ్యలోనే ప్రసారదారు ఒప్పందం నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తాజాగా మీడియాలో వస్తున్న వార్తలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC), జియోహాట్‌స్టార్ స్పందించాయి. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాయి. నాలుగేళ్ల కాలానికి కుదిరిన భారత మీడియా హక్కుల ఒప్పందం ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోనే ఉందని రెండు సంస్థలు స్పష్టం చేశాయి. జియోహాట్‌స్టార్ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటోందన్న ప్రచారాన్ని ఖండించాయి.
‘ఐసీసీ-జియోహాట్‌స్టార్ మధ్య ఉన్న మీడియా హక్కుల ఒప్పందం పూర్తి స్థాయిలో అమల్లో ఉంది. జియోహాట్‌స్టార్ భారత్‌లో ఐసీసీ అధికారిక ప్రసార భాగస్వామిగానే కొనసాగుతోంది. ఈ ఒప్పందం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’ అని రెండు సంస్థలు అధికారికంగా ప్రకటనలో వెల్లడించాయి.
కట్టుబడి ఉన్నాం..
సుమారు 3 బిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందాన్ని ఆత్మస్ఫూర్తితో పాటిస్తామని జియోహాట్‌స్టార్ పేర్కొంది. భారత్‌లో క్రికెట్ అభిమానులకు ఎలాంటి అంతరాయం లేకుండా, అత్యుత్తమ ప్రమాణాలతో ప్రసారం చేసేందుకు రెండు సంస్థలు కట్టుబడి ఉన్నాయని వెల్లడించింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 సహా రాబోయే టోర్నమెంట్ల ఏర్పాట్లు ప్రణాళిక ప్రకారమే కొనసాగుతున్నాయని తెలిపాయి. వీక్షకులు, ప్రకటనదారులు, పరిశ్రమ భాగస్వాములపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశాయి. దీర్ఘకాలిక వాణిజ్య భాగస్వాములుగా ఐసీసీ–జియోహాట్‌స్టార్ తరచూ సంప్రదింపులు కొనసాగిస్తూ, క్రికెట్ అభివృద్ధికి కలిసి పనిచేస్తున్నాయని సంబంధిత అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే జియోహాట్‌స్టార్ భారీ ఆర్థిక నష్టాలు ఎదురవుతున్న నేపథ్యంలోనే ఈ రకమైన ప్రచారం జరిగిందని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనిపై ఇరు సంస్థలు స్పష్టత ఇవ్వడంతో గందరగోళానికి తెరపడింది.
ఇవీ చదవండి:
పేలవ ప్రదర్శన.. సూర్యకు అసలు ఏమైంది?
ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన సౌతాఫ్రికా.. భారత్‌పై తొలి జట్టుగా..!