Share News

ICC WTC Final: ఐసీసీ సంచలన అప్‎డేట్.. 2031 వరకు WTC ఫైనల్స్‌ అక్కడే

ABN , Publish Date - Jul 20 , 2025 | 09:38 PM

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) జూలై 20, 2025న నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కి సంబంధించిన అప్‌డేట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

ICC WTC Final: ఐసీసీ సంచలన అప్‎డేట్.. 2031 వరకు WTC ఫైనల్స్‌ అక్కడే

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా జూలై 20, 2025న జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను (ICC WTC Final) ప్రకటించింది. వీటిలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ గురించి కీలక అప్‌డేట్ వచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లు 2031 వరకు ఇంగ్లండ్‌లోనే జరుగుతాయని తెలిపింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) ఈ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తోందని, అందుకే 2027, 2029, 2031 ఎడిషన్‌ల హోస్టింగ్ హక్కులను కూడా ఇంగ్లండ్‌కు ఇచ్చినట్లు వెల్లడించింది.


ఇది వరకు కూడా..

గతంలో సౌతాంప్టన్ (2021), ది ఓవల్ (2023), లార్డ్స్ (2025)లో ఈ ఫైనల్‌లు జరిగాయి. ఇంగ్లండ్‌లో జూన్ నెలలో వాతావరణం అనుకూలంగా ఉండటం, ECB అద్భుతమైన నిర్వహణ వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో క్రికెట్ అభిమానులకు ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లను ఇంగ్లండ్ మైదానాల్లో చూసే అవకాశం మరో ఆరేళ్లు కొనసాగనుంది. ఒకే చోట జరిగే నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఐసీసీ తీసుకున్న నిర్ణయాలలో మహిళా క్రికెటర్లు, యూఎస్ఏ క్రికెట్ సంస్కరణలు, కొత్త అసోసియేట్ సభ్యుల ఎన్నిక వంటి అంశాలు కూడా ఉన్నాయి.


మహిళా క్రికెటర్లకు మద్దతు

ఐసీసీ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఆఫ్ఘానిస్థాన్ నుంచి వలస వచ్చిన మహిళా క్రికెటర్లకు సహాయం చేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI), ECB, క్రికెట్ ఆస్ట్రేలియాతో కలిసి పనిచేస్తుంది. ఈ మహిళా క్రికెటర్లకు హై-పెర్ఫార్మెన్స్ శిక్షణ, దేశీయ మ్యాచ్‌లలో అవకాశాలు, 2025లో భారత్‌లో జరిగే ODI వరల్డ్ కప్, 2026లో ఇంగ్లండ్‌లో జరిగే T20 వరల్డ్ కప్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఈ చర్య క్రికెట్ పట్ల మక్కువ ఉన్న ఆఫ్ఘాన్ మహిళలకు కొత్త అవకాశాలు లభిస్తాయి.


యూఎస్ఏ క్రికెట్‌కు గడువు

ఇదే సమయంలో ఐసీసీ.. యూఎస్ఏ క్రికెట్ బోర్డ్‌కు కఠిన ఆదేశాలు జారీ చేసింది. యూఎస్ఏ క్రికెట్ సంస్థ సరైన గవర్నెన్స్‌ను అనుసరించాలని, మూడు నెలల్లో స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు నిర్వహించి, సంస్థాగత సంస్కరణలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ ఈ షరతులను పాటించకపోతే, ఐసీసీ చర్యలు తీసుకోవచ్చని హెచ్చరించింది. అమెరికాలో క్రికెట్ వృద్ధి చెందాలంటే, ఈ సంస్కరణలు చాలా ముఖ్యమని స్పష్టం చేసింది.


కొత్త అసోసియేట్ సభ్యులు

ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ (CEC)కి ముగ్గురు కొత్త అసోసియేట్ సభ్యులను ఎన్నుకున్నారు. వారిలో గురుమూర్తి పళని (ఫ్రాన్స్), అనురాగ్ భట్నాగర్ (క్రికెట్ హాంకాంగ్), గుర్దీప్ క్లైర్ (క్రికెట్ కెనడా) ఉన్నారు. వీరు క్రికెట్ అభివృద్ధికి కొత్త దిశను ఇస్తారని ఐసీసీ ఆశిస్తోంది.

కొత్తగా చేరిన రెండు సభ్య దేశాలు

ఇదే సమయంలో ఐసీసీలోకి రెండు కొత్త దేశాలు వచ్చి చేరాయి. టిమోర్ లెస్టే క్రికెట్ ఫెడరేషన్, జాంబియా క్రికెట్ యూనియన్‌లకు అసోసియేట్ సభ్యత్వం ఇచ్చారు. దీంతో ఐసీసీ సభ్య దేశాల సంఖ్య 110కి చేరింది. ఈ కొత్త సభ్య దేశాలు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను మరింత ప్రాచుర్యంలోకి తేవడంలో సహాయపడతాయి.


ఇవి కూడా చదవండి

వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 20 , 2025 | 09:39 PM