HCA: హెచ్‌సీఏపై ఫిర్యాదుల వెల్లువ.. నకిలీ ధ్రువపత్రాలతో లీగ్‌లలోకి పలువురి ఎంట్రీ..
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:28 AM
నిత్యం ఏదొక వివాదానికి కేంద్రంగా ఉండే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఈసారి క్రికెటర్ల ఎంపికలో జరుగుతున్న అవకతవకలతో బజారున పడింది.
- రాచకొండ పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు
- కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన రాష్ట్ర గనుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్
హైదరాబాద్: నిత్యం ఏదొక వివాదానికి కేంద్రంగా ఉండే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఈసారి క్రికెటర్ల ఎంపికలో జరుగుతున్న అవకతవకలతో బజారున పడింది. మంగళవారం కె.అనంతారెడ్డి, రామారావు ఉప్పల్ పోలీసు స్టేషన్(Uppal Police Station)లో ఫిర్యాదు చేయగా, పది రోజుల కిందట రాచకొండ కమిషనరేట్‌లో రాష్ట్ర గనుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఎ.అనిల్‌కుమార్ చేసిన ఫిర్యాదు కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇటీవల హెచ్‌సీఏ ప్రకటించిన అండర్-19 వినూ మన్కడ్ ట్రోఫీకి ఆడే జట్టులో.. నిర్దిష్ట వయసు మించిన వారు, స్థానికేతరులు, తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు, నకిలీ స్థానికత గల పత్రాలు సమర్పించి, అడ్డదారిలో హెచ్‌సీఏ లీగ్స్ ఆడుతున్నారని వీరు ఆరోపించారు. హెచ్‌సీఏ సెలెక్టర్లలో కొందరు తమ సొంత అకాడమీల్లోని క్రికెటర్లను ఎంపిక చేస్తూ ఇతరులకు అన్యాయం చేస్తున్నారని విమర్శలు చెలరేగుతున్నాయి. ఇంత తతంగం జరుగుతున్నా హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ బసవరాజు చోద్యం చూస్తుండడంపై హెచ్‌సీఏ సభ్యులు కూడా మండిపడుతున్నారు.
తప్పుడు ధ్రువపత్రాలతో..
ద్వంద, నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలతో కొందరు క్రికెటర్లు అడ్డదారిలో హెచ్‌సీఏ లీగ్‌ల్లో ఆడుతూ రాష్ట్ర జట్లలో స్థానం సంపాదిస్తున్నారని ఇద్దరు క్రికెటర్ల తల్లిదండ్రులు రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. గత ఏడాది కూడా కొందరు క్రికెటర్లపై ఇలాంటి ఫిర్యాదులే రావడంతో ఆరుగురిపై హెచ్‌సీఏ నిషేధం విధించింది. ఈసారి సుమారు 38 మంది క్రికెటర్లు ఇదే కోవలో తప్పుడు పత్రాలతో హెచ్‌సీఏ లీగ్‌ల్లో ఆడుతున్నారని అనంతారెడ్డి, రామారావు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఆ క్రికెటర్ల జాబితాపై విచారణ జరపాలని కోరారు. వీరికి సహకరిస్తున్న హెచ్‌సీఏలోని పెద్దలపై కూడా కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అర్హత లేని సెలెక్టర్లతో..
హెచ్‌సీఏ నిబంధనల్లోని రూల్ 26(బి) ప్రకారం కనీసం 25 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి, ఐదేళ్ల కిందట రిటైర్మెంట్ తీసుకున్న వారినే జూనియర్ సెలెక్షన్ కమిటీ సభ్యులుగా నియమించాలి. ప్రస్తుత కమిటీ చైర్మన్ హబీబ్ అహ్మద్ 16మ్యాచ్‌లు, అన్వర్‌ఖాన్ 19మ్యాచ్‌లు, సందీప్ రాజన్ మూడు మ్యాచ్‌లే ఆడిన అనుభవమే ఉండగా వారిని సభ్యులుగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో సెలెక్టర్ సుదీప్ త్యాగి అడ్నాన్ క్రికెట్ అకాడమీలో కోచ్‌గా శిక్షణ ఇస్తూ తన అకాడమీలో ప్లేయర్లకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నాడని అనిల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
షాకింగ్ .. ఎమ్‌టీవీ మ్యూజిక్ ఛానల్ మూసివేత
Read Latest Telangana News and National News