Ind vs Aus: గబ్బాలో మొదలైన వర్షం..
ABN , Publish Date - Nov 08 , 2025 | 03:39 PM
గబ్బా స్టేడియంలో వర్షం మొదలైంది. దీంతో ఆసీస్-భారత్ మధ్య జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రేక్షకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య జరుగుతున్న ఐదో టీ20కి వరుణుడు ఆటంకం కలిగించాడు. ఈ ఆఖరి మ్యాచ్ జరిగే గబ్బా స్టేడియంలో వర్షం మొదలైంది. దీంతో తాత్కాలికంగా ఆటను నిలిపేశారు. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది.
ధనాధన్ బ్యాటింగ్..
టాస్ ఓడి బరిలోకి దిగిన భారత్.. ఆది నుంచే దూకుడు ప్రదర్శించింది. అభిషేక్ శర్మ(Abhishek Sharma ), శుభ్‌మన్ గిల్(Shubman Gill) స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. డ్వార్షుయిస్ వేసిన మూడో ఓవర్లో గిల్ ఏకంగా నాలుగు బౌండరీలు బాదాడు. మరో ఎండ్‌లో అభిషేక్ శర్మ కూడా ఎక్కడా తగ్గకుండా అటాకింగ్ గేమ్ ఆడాడు. అయితే నాథన్ ఎల్లిస్ వేసిన 3.3 ఓవర్‌కు అభిషేక్ భారీ షాట్ ఆడగా.. గాల్లోకి లేచిన బంతిని డ్వార్షుయిస్ అందుకోలేకపోయాడు. దీంతో అభిషేక్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అదే ఓవర్ చివరి బంతిని అభిషేక్ సిక్సర్‌గా మలిచాడు. ఆట నిలిచే సమయానికి అభిషేక్ శర్మ(23), గిల్(29) క్రీజులో ఉన్నారు.
ప్రేక్షకులకు హెచ్చరిక..
మ్యాచ్ జరుగుతున్న గబ్బా స్టేడియం పరిసర ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో 4.5 ఓవర్ల తర్వాత ఆటను నిలిపేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో ఉరుములు, మెరుపులు వస్తున్నాయి. అక్కడ పిడుగులు పడే అవకాశం ఉండటంతో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులను స్టేడియం అధికారులు అప్రమత్తం చేశారు. ప్రేక్షకులు బహిరంగ ప్రదేశాలను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్టేడియంలోని స్క్రీన్‌పై సూచించారు. అయితే గబ్బా స్టేడియంలో డ్రైనేజీ వ్యవస్థ అద్భుతంగా ఉంది. ప్రస్తుతానికి పిచ్‌పై మాత్రమే కవర్లు కప్పారు. వర్షం ఏ మాత్రం తగ్గినా వెంటనే మైదానాన్ని సిద్ధం చేసే అవకాశం ఉంది.
అయితే ఆసీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ వర్షం కారణంగానే రద్దయింది. తర్వాత జరిగిన మూడింట్లో రెండు టీమిండియా గెలిచి 2-1తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దయితే.. సిరీస్ టీమిండియాదే!
ఇవి కూడా చదవండి
పెళ్లి తర్వాత కోహ్లీ పూర్తిగా మారిపోయాడు: కైఫ్
భారీ రికార్డుకు చేరువలో బుమ్రా
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి