Share News

IND VS SA: ఈడెన్ ఇలా అయ్యిందేంటి!

ABN , Publish Date - Nov 16 , 2025 | 01:12 PM

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య మూడో రోజు తొలి టెస్ట్ కొనసాగుతుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఈ పిచ్‌పై బౌలర్లు విజృంభిస్తుండటంతో స్వల్ప లక్ష్యాన్ని కూడా ప్లేయర్లు ఛేదించలేకపోతున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

IND VS SA: ఈడెన్ ఇలా అయ్యిందేంటి!
IND VS SA

ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌ను విజయంతో ఆరంభించే అవకాశం టీమిండియా ముందు నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకు ఆలౌటైన భారత్.. 30 పరుగుల ఆధిక్యానికే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రొటీస్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సరికి 93/7తో పీకల్లోతు కష్టాల్లో పడింది. మూడో రోజు బావుమా(55*) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సౌతాఫ్రికా 153 పరుగులు చేసి టీమిండియాకు 124 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది.


అనుకున్నది ఒకటి..

ఈడెన్‌ గార్డెన్స్‌(Eden Gardens) అంటే బ్యాటర్లకు బాగా అనుకూలించే మైదానాల్లో ఒకటి. ఇక్కడ బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా మూడో రోజు నుంచే బంతి బాగా తిరుగుతుంది. కానీ ఈసారి పిచ్‌ ఎవ్వరి అంచనాలకు అందని విధంగా స్పందించింది. తొలి రెండు రోజుల్లో పేసర్ల ప్రభావం ఉంటుందన్న అంచనా ముందు నుంచి ఉన్నదే కానీ.. తొలి రోజు బుమ్రా ఆ స్థాయిలో చెలరేగుతాడని ఎవ్వరూ ఊహించలేదు. రెండో రోజు స్పిన్నర్ల జోరు మామూలుగా లేదు. విపరీతమైన టర్న్, ఊహించని బౌన్స్‌ వల్ల స్పిన్నర్ల బంతులను ఎదుర్కోవడం బ్యాటర్లకు శక్తికి మించిన పనే అయింది. పిచ్‌ పూర్తిగా ఇలా బౌలర్ల పక్షం వహించడంపై విమర్శలు వస్తున్నాయి. బ్యాటుకు, బంతికి సమతూకం లేకపోతే.. మరీ మూడు రోజుల్లోనే ఆట ముగిసిపోతే ఇక టెస్టు మ్యాచ్‌లో ఏం మజా ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


వచ్చీ రాగానే..

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఖాతా తెరవకుండానే యశస్వి పెవిలియన్ చేరగా.. కేఎల్ రాహుల్(1) తీవ్రంగా నిరాశ పర్చాడు. 10 పరుగుల వద్ద టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు ఔటవ్వడం.. మరోవైపు కెప్టెన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో టీమిండియా 124 లక్ష్యాన్ని ఛేదిస్తుందా? అనే సందేహం మొదలైంది. దీనికి తోడు దూకుడుగా ఆడుతున్న ధ్రువ్ జురెల్(13), ఎంతో కొంత ఆదుకుంటాడు అనుకున్న రిషభ్ పంత్(2)లను హర్మర్ పెవిలియన్ పంపాడు. దీంతో టీమిండియా 38 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ పిచ్ సఫారీలకే కాదు.. టీమిండియా బ్యాటర్లకూ కష్టంగానే ఉంది.


ఇవి కూడా చదవండి:

సౌతాఫ్రికా ఆలౌట్

సంజూ మానసికంగా అలసిపోయాడు: ఆర్ఆర్ ఓనర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 16 , 2025 | 01:12 PM