Raina And Dhawan: ఆ మాజీ క్రికెటర్ల ఇళ్లలో ఈసీ దాడులు.. రూ.11కోట్ల ఆస్తుల జప్తు
ABN , Publish Date - Nov 06 , 2025 | 08:44 PM
భారత మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్ ఆస్తులపై ఈడీ దాడులు చేపట్టింది. ఓ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ను ఆమోదించారనే వార్తల నేపథ్యంలో సోదాలు నిర్వహించిన ఈసీ.. ఇరువురికీ సంబంధించిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది.
టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా(Suresh Raina), శిఖర్ ధావన్(Shikhar Dhawan) ఆస్తులపై ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(The Enforcement Directorate) దాడులు చేపట్టింది. వీరిద్దరూ అక్రమంగా 1xబెట్ అనే ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్(Online Betting Platorm 1xBet)ను ఆమోదించారనే ఆరోపణల నేపథ్యంలో.. సంబంధిత మనీలాండరింగ్(Money Laundering) దర్యాప్తులో భాగంగా జరిపిన సోదాల్లో రూ.11.14కోట్ల విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తుచేసింది.
ఈడీ(ED) జప్తు చేసిన ఆస్తుల్లో భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan)కు సంబంధించి రూ.4.5 కోట్ల విలువైన స్థిరాస్థులు ఉండగా, మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా(Suresh Raina)కు చెందిన రూ.6.64 కోట్ల విలువైన మ్యూచ్‌వల్ ఫండ్స్ పెట్టుబడులు ఉన్నట్టు సమాచారం. వీరిరువురూ 1xబెట్, దాని అనుబంధ బ్రాండ్‌లతో ప్రత్యక్షంగా/పరోక్షంగా సంబంధమున్న విదేశీ సంస్థలతో ఉద్దేశపూర్వకంగా ఎండార్స్‌మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు సంబంధిత అధికారులు ఆరోపించారు. ఈ ప్రమోషనల్ ఒప్పందాలే భారతీయ వినియోగదారులలో అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ విస్తరణకు సాయపడి ఉండొచ్చని, ఫలితంగానే ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటనపై ఇప్పటివరకూ రైనా, ధావన్‌లెవరూ స్పందించలేదు.
పలువురు ప్రముఖలపైనా..
రైనా, ధావన్‌లతో పాటు మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్(Yuvraj Singh), రాబిన్ ఉతప్ప, నటులు సోనూసూద్, ఊర్వశి రౌతేలా(Urvashi Rautela), మిమి చక్రవర్తి(తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ), బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా వంటి పలువురు ప్రముఖులనూ ఈడీ ప్రశ్నించింది. బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ దాని అనుబంధ సంస్థలతో వీరికి సంబంధమున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో వీరిని విచారించినట్టు తెలుస్తోంది.
1x బెట్ ప్లాట్‌ఫామ్ ప్రస్థానం 20ఏళ్ల క్రితం ఐలాండ్‌లోని కురాకావ్(Curacao)లో ప్రారంభమైంది. అంతర్జాతీయ ఆన్‌లైన్ బుక్‌మేకర్‌గా తనను తాను ప్రస్తావించుకుంటూ ఇటీవల భారత్‌లోకి ప్రవేశించింది. ఇక్కడి చట్టాల ఉల్లంఘనలకు పాల్పడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ దర్యాప్తులు చేపట్టింది. భారతదేశంలో బెట్టింగ్ వంటి వాటిపై నిషేధం ఉన్నప్పటికీ ఈ ప్లాట్‌ఫామ్ మాత్రం ఆన్‌లైన్ ప్రమోషన్లు, ప్రముఖుల ఆమోదంతో యువతను ఆకర్షిస్తోందని సమాచారం.
ఇవి కూడా చదవండి:
Trump-Mamdani: మందానీ దెబ్బకు రగిలిపోతోన్న ట్రంప్.. న్యూయార్కర్లు పారిపోక తప్పదంటూ కామెంట్
Deepti Sharma Meets PM Modi: హనుమాన్ టాటూ మీకెలా ఉపయోగపడుతుంది?.. దీప్తి శర్మకు ప్రధాని మోదీ ప్రశ్న