Share News

Matthew Walter Forde: కుర్ర బ్యాటర్ వరల్డ్ రికార్డ్! 16 బంతుల్లోనే..

ABN , Publish Date - May 23 , 2025 | 08:26 PM

వెస్టిండీస్ కుర్ర బ్యాటర్ సంచలనం సృష్టించాడు. సౌతాఫ్రికా గ్రేట్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును అతడు నమ్మశక్యం కాని రీతిలో సమం చేశాడు. మరి.. ఆ బ్యాట్స్‌మన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

Matthew Walter Forde: కుర్ర బ్యాటర్ వరల్డ్ రికార్డ్! 16 బంతుల్లోనే..
Matthew Walter Forde

హాఫ్ సెంచరీ కొట్టాలంటే కనీసం 20 బంతులైనా కావాలి. 18 బంతుల్లో అర్ధ శతకాలు బాదిన వారూ ఉన్నారు. టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ అయితే 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ అందుకొని ఔరా అనిపించాడు. అయితే ఇది టీ20ల్లో. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డ్ సౌతాఫ్రికా గ్రేట్ ఏబీ డిలియర్స్ పేరు మీద ఉంది. ఇప్పుడో కరీబియన్ కుర్ర బ్యాటర్ ఈ క్రేజీ రికార్డును సమం చేసి శభాష్ అనిపించుకున్నాడు. వెస్టిండీస్‌ పించ్‌హిట్టర్ మాథ్యూ ఫోర్డ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ కొట్టేశాడు.


ఊచకోత కోశాడు!

ఐర్లాండ్‌తో పోరులో 16 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు మాథ్యూ ఫోర్డ్. మొత్తంగా 19 బంతుల్లో 58 పరుగులు చేశాడీ విండీస్ విధ్వంసకారుడు. ఇందులో 2 బౌండరీలతో పాటు ఏకంగా 8 భారీ సిక్సులు ఉన్నాయి. 305 స్ట్రైక్‌ రేట్‌తో బ్యాటింగ్ చేసిన మాథ్యూ ఫోర్డ్.. వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్‌లోకి తరలించాడు. సిక్సులు కొట్టడమే ధ్యేయంగా ప్రత్యర్థి బౌలర్ల మీద విరుచుకుపడ్డాడు. బౌలింగ్‌కు దిగిన వారిని దయ లేకుండా శిక్షించాడు. సిక్సుల మీద సిక్సులు బాదుతూ చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా (16 బంతుల్లో) డివిలియర్స్‌తో కలసి తొలి స్థానంలో నిలిచాడు ఫోర్డ్. కాగా, 2015లో జొహన్నెస్‌బర్గ్‌లో విండీస్‌తో జరిగిన పోరులో 44 బంతుల్లో 149 పరుగుల నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ ఆడాడు ఏబీడీ. ఈ క్రమంలో 16 బంతుల్లోనే 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ రికార్డును ఫోర్డ్ ఇవాళ సమం చేశాడు.


ఇవీ చదవండి:

ఆర్సీబీకి సన్‌రైజర్స్ భయం

16 ఏళ్ల కెరీర్‌కు స్టార్ గుడ్‌బై

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 23 , 2025 | 08:37 PM