Share News

Suryakumar Yadav: మా ఓటమికి కారణం అతడే..!

ABN , Publish Date - Oct 31 , 2025 | 06:18 PM

భారత్‌తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లు విరుచుపడిన వేళ టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. తమ పరాజయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు.

Suryakumar Yadav: మా ఓటమికి కారణం అతడే..!

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో జరిగిన రెండో టీ-20 (India vs Australia 2nd T20)లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లు విరుచుపడిన వేళ టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆసీస్ నాలుగు వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. 13.2 ఓవర్లలోనే అలవోక విజయాన్ని నమోదు చేసింది.


అంతా అతడి వల్లే..

అనంతరం తమ పరాజయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) మాట్లాడాడు. ‘జోష్ హేజిల్‌వుడ్(Josh Hazlewood) కారణంగానే ఈ మ్యాచ్ ఓడిపోయాం. అతడు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు తీసి మమ్మల్ని కోలుకోలేని దెబ్బ తీశాడు. అభిషేక్ శర్మ మినహా నాతో సహా మిగతా బ్యాటర్లంతా హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో చేతులెత్తుశారు. అభిషేక్ శర్మ మంచి నాక్ ఆడాడు. అతడికి తన ఆట పట్ల ఓ క్లారిటీ ఉంది. అన్ని మ్యాచ్‌ల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం. టాస్ మమ్మల్ని అన్నిసార్లూ నిరాశపరుస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేస్తే భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలి. ఆపై ఫీల్డింగ్‌లో ఆ స్కోరుని కాపాడుకోవాలి. మేం ఈ రెండు చేయలేకపోయాం. అందుకే ఓడిపోయాం’ అని సూర్య వ్యాఖ్యానించాడు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కంగారూ జట్టు ఆది నుంచే అటాకింగ్ చేసింది. జోష్ హేజిల్‌వుడ్ పవర్ ప్లేలోనే మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అభిషేక్ శర్మ(68), హర్షిత్ రాణా(35) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. శుభ్‌మన్ గిల్(5), శాంసన్(2), సూర్య కుమార్ యాదవ్(1), తిలక్ వర్మ(0) తీవ్రంగా నిరాశపర్చారు. దీంతో 125 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. ఆరు వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. అటు ఫీల్డింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ పేలవ ప్రదర్శన చేయడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు.


ఈ వార్తలు కూడా చదవండి:

IND vs AUS: రెండో టీ-20.. గెలుపు ఆసీస్‌దే..

Sunil Gavaskar: అదే జరిగితే జెమీమాతో కలిసి పాడతా: గావస్కర్

Updated Date - Oct 31 , 2025 | 06:57 PM