Wiaan Mulder On 400: అందుకే 400 వద్దనుకున్నా.. సౌతాఫ్రికా కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
ABN , Publish Date - Jul 08 , 2025 | 11:25 AM
సౌతాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ ఒక్క పనితో అందరి మనసులు దోచుకున్నాడు. 400 కొట్టే అవకాశం ఉన్నా వద్దనుకున్నాడు. అతడు ఎందుకిలా చేశాడో ఇప్పుడు చూద్దాం..

టెస్టుల్లో ఆడాలనేది చాలా మంది క్రికెటర్ల కల. ఒకవేళ అరంగేట్ర అవకాశం వస్తే అదరగొట్టాలని చూస్తారు. బ్యాటర్లైతే సెంచరీలతో చెలరేగాలని చూస్తారు. డబుల్ సెంచరీ కొడితే వారి ఆనందానికి హద్దులుండవు. ట్రిపుల్ సెంచరీ మార్క్‌ను అందుకుంటే కెరీర్ కంప్లీట్ అయినట్లు భావిస్తారు. ఇక క్వాట్రపుల్ సెంచరీ (400) చేస్తే ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు. అయితే సుదీర్ఘ ఫార్మాట్‌లో కేవలం వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా మాత్రమే ఈ ఫీట్ సాధించాడు. ఎంతో మంది స్టార్ బ్యాటర్లు దీన్ని తిరగరాయాలని అనుకున్నా దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. అయితే సౌతాఫ్రికా సారథి వియాన్ ముల్డర్ మాత్రం 400 కొట్టే అవకాశం ఉన్నా వద్దనుకున్నాడు. అతడు ఎందుకిలా చేశాడో ఇప్పుడు చూద్దాం..
అందుకే డిక్లరేషన్..
‘ఇది చాలా స్పెషల్ ఇన్నింగ్స్. నిజం చెప్పాలంటే నేను డబుల్ సెంచరీ కొడతానని కూడా ఎప్పుడూ అనుకోలేదు. నాకు అలాంటి డ్రీమ్స్ కూడా లేవు. అలాంటిది ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాదడం చాలా సంతోషంగా ఉంది. ఈ నాక్ ద్వారా నా జట్టుకు చాలా ప్రయోజనం చేకూరింది. మ్యాచ్‌ను గెలిచే స్థితికి చేరుకున్నాం. సౌతాఫ్రికా ఆడటం మొదలుపెట్టిన కొత్తలో ఈ స్థాయిలో రాణిస్తానని అనుకోలేదు. అయితే సీనియర్ల నుంచి చాలా విషయాలు నేర్చుకొని నన్ను నేను ఎంతో మలచుకున్నా. దిగ్గజం బ్రియాన్ లారా కోసమే నేను 400 వద్దనుకున్నా. ఆయన రికార్డు చాలా ప్రత్యేకం. అది ఎప్పటికీ అలాగే ఉండిపోవాలి. అందుకే నేను ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేశా’ అని ముల్డర్ రివీల్ చేశాడు.
కోచ్‌తో మాట్లాడి..
కోచ్ షుక్రీ కోన్రాడ్‌తో మాట్లాడానని.. ఆ తర్వాతే 400 వద్దనుకున్నానని ముల్డర్ బయటపెట్టాడు. లారా పేరు మీదే ఆ రికార్డు ఉండాలని, అదే సరైనదని తాను భావించానని తెలిపాడు. కాగా, జింబాబ్వేతో మ్యాచ్‌లో 367 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు ముల్డర్. 400 కొట్టే చాన్స్ ఉన్నా లారా రికార్డును టచ్ చేయొద్దనే ఉద్దేశంతో వెనక్కి తగ్గాడు. దీంతో అతడిపై క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దిగ్గజాలకు గౌరవం ఇచ్చే ఇలాంటి క్రికెటర్లు చాలా అరుదని.. నువ్వు మా మనసులు గెలిచావ్ అంటూ సౌతాఫ్రికా సారథిని మెచ్చుకుంటున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 625 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది ప్రొటీస్. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 170 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఫాలో ఆన్‌కు దిగిన ఆ జట్టు రెండో రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 51 పరుగులతో ఉంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి