Rinku-Kuldeep: రింకూ చెంప చెల్లుమనిపించిన కుల్దీప్.. బ్యాన్ తప్పదా..
ABN , Publish Date - Apr 30 , 2025 | 02:51 PM
Indian Premier League: మండు వేసవిలో ఇంట్రెస్టింగ్ ఫైట్స్‌తో మరింత హీట్ పుట్టిస్తున్న ఐపీఎల్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో హర్భజన్-శ్రీశాంత్ గొడవ గుర్తుకొచ్చేలా రింకూను చెంపదెబ్బ కొట్టాడు కుల్దీప్. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్‌కు అడ్డా. అయితే ఒక్కోసారి వినోదం కంటే ఇతర విషయాలు హైలైట్ అవుతుంటాయి. దేశం తరఫున కలసి ఆడే ఆటగాళ్లు కూడా ఫ్రాంచైజీల తరఫున ఆడేటప్పుడు బద్ద శత్రువులుగా మారిన సంఘటనలూ అనేకం ఉన్నాయి. దోస్తుల మధ్య కూడా రైవల్రీలు జరుగుతూ ఉంటాయి. బూతులు తిట్టుకోవడమే గాక ఒక్కోసారి ప్లేయర్లు ఒకరిపై ఒకరు దూసుకెళ్లడం, కొట్టుకోవడం వరకూ వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. అప్పట్లో పేసర్ శ్రీశాంత్‌ను టర్బనేటర్ హర్భజన్ సింగ్ చెంపదెబ్బ కొట్టిన ఘటనను ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అలాంటిదే మరోమారు రిపీట్ అయింది. పించ్ హిట్టర్ రింకూ సింగ్ చెంప చెళ్లుమనిపించాడు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. అసలేం జరిగింది.. రింకూపై కుల్దీప్ ఎందుకు చేయిజేసుకున్నాడు.. అనేది ఇప్పుడు చూద్దాం..
రింకూ షాక్
కోల్‌కతా నైట్ రైడర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. మ్యాచ్ తర్వాత డీసీ స్పిన్నర్ కుల్దీప్.. కేకేఆర్ బ్యాటర్ రింకూపై చేయిజేసుకున్నాడు. ఏకంగా రెండుమార్లు అతడి చెంపపై కొట్టాడు. ఆ టైమ్‌లో కుల్దీప్-రింకూతో పాటు పలువురు ఇతర ఆటగాళ్లు కూడా అక్కడే ఉన్నారు. అప్పటివరకు నవ్వుతూ కనిపించిన రింకూ ఊహించని ఘటనకు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు. అయితే లైట్ తీసుకొని మళ్లీ నవ్వుతుండగా.. కుల్దీప్ మళ్లీ చేయిజేసుకోవడంతో రింకూ అసహనానికి గురైనట్లు ఆ విజువల్స్‌లో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో కుల్దీప్ మీద నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు.
బ్యాన్ తప్పదా..
కుల్దీప్‌ను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. అది ఫ్రెండ్లీగా కొట్టినట్లు అనిపించట్లేదని, అహంకారంతోనే ఇలాంటి పని చేశాడని ఆరోపిస్తున్నారు. ఇది చెత్త ప్రవర్తన అని.. సీనియర్ స్పిన్నర్‌ను కొన్ని మ్యాచుల పాటు నిషేధించాలని అంటున్నారు. అప్పట్లో శ్రీశాంత్ మీద చేయిజేసుకున్నందును భజ్జీని మిగతా టోర్నీతో పాటు 5 వన్డేల పాటు బీసీసీఐ బ్యాన్ చేసిందని గుర్తుచేస్తున్నారు. కుల్దీప్‌ను కూడా ఇదే మాదిరిగా నిషేధించాలని, అప్పుడు గానీ తప్పు చేశాననే రియలైజేషన్ రాదని అంటున్నారు. అయితే రింకూ-కుల్దీప్ మధ్య ఏం జరిగింది.. చెంపదెబ్బ కొట్టడం వెనుక రీజన్ ఏంటి.. సరదాగానే చేయిజేసుకున్నాడా.. వేరే ఏదైనా కారణం ఉందా.. ఎవరిది తప్పు అనేది ఇద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే గానీ చెప్పలేం.
ఇవీ చదవండి:
ధవన్ దెబ్బకి పాక్ లెజెండ్ షేక్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి