Rishabh Pant: పంత్ బ్యాటింగ్‌కు ఫిదా.. స్టోక్స్ మాటలు వింటే గూస్‌బంప్స్!
ABN , Publish Date - Jul 02 , 2025 | 10:24 AM
టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్‌ను ఆకాశానికెత్తేశాడు బెన్ స్టోక్స్. పంత్ బ్యాటింగ్ గురించి అతడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ స్టోక్స్ ఏమన్నాడంటే..

భారత జట్టు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కెరీర్‌లో బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. రీఎంట్రీ తర్వాత కొన్నాళ్లు పేలవ ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడిన పంత్.. ఈ మధ్య కాలంలో చెలరేగి ఆడుతున్నాడు. ఐపీఎల్-2025 ఆఖర్లో ఫామ్‌ను అందుకున్న ఈ పించ్ హిట్టర్.. దీన్నే ఇంగ్లండ్ పర్యటనలోనూ కొనసాగిస్తున్నాడు. స్టోక్స్ సేనతో లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 2 సెంచరీలతో దుమ్మురేపాడు పంత్. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాల మోత మోగించాడు. భారీ షాట్లతో ఆతిథ్య జట్టు బౌలర్లను బెంబేలెత్తించాడు. అతడి బ్యాటింగ్‌పై తాజాగా స్పందించాడు బెన్ స్టోక్స్. ఇంతకీ ఇంగ్లండ్ కెప్టెన్ ఏమన్నాడంటే..
లైసెన్స్ ఇచ్చి..
‘రిషబ్ పంత్ బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడి ఆటను బాగా ఆస్వాదిస్తుంటా. 3 ఫార్మాట్లలోనూ అతడు అదరగొడుతున్నాడు. ఫార్మాట్‌కు తగ్గట్లు టెక్నిక్‌లో స్వల్ప మార్పులు చేసుకొని రఫ్ఫాడిస్తున్నాడు. పంత్ లాంటి ప్లేయర్లు చాలా అరుదు. ఇలాంటి వారికి లైసెన్స్ ఇచ్చి స్వేచ్ఛగా ఆడమని ప్రోత్సహించడం మంచి విషయం. టీమిండియా అదే చేసింది. దాని రిజల్ట్ అందరమూ చూస్తున్నాం. గత వారం పంత్ ఎలా బ్యాటింగ్ చేశాడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు’ అంటూ భారత బ్యాటర్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు స్టోక్స్.
పాతుకుపోతే..
ఒకే మ్యాచ్‌లో 2 సెంచరీలు కొట్టడం మామూలు విషయం కాదని.. పంత్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందేనన్నాడు బెన్ స్టోక్స్. రిషబ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఔట్ చేసేందుకు కొన్ని చాన్సులు వస్తాయని, క్యాచులకు ఆస్కారం ఉంటుందని ఎదురు చూశామని తెలిపాడు. అయితే పంత్ పెద్దగా చాన్స్ ఇవ్వకుండా తన శైలిలో ఆడుతూ పోయాడని స్టోక్స్ పేర్కొన్నాడు. అతడో ప్రమాదకర బ్యాటర్ అని.. క్రీజులో పాతుకుపోతే ఏం అవుతుందో తమకు బాగా తెలుసునని ఇంగ్లండ్ కెప్టెన్ వ్యాఖ్యానించాడు. అయితే పంత్‌కు స్టోక్స్ ఇంత హైప్ ఎందుకు ఇస్తున్నాడని నెటిజన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పొగడ్తల వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? ప్రశంసల మాయలో పడేసి అతడ్ని ఔట్ చేయాలని చూస్తున్నారా? అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి