Ball Change Controversy: మ్యాచ్ మధ్యలో బంతుల బాక్స్.. ఈ వీడియో చూస్తే నవ్వాగదు!
ABN , Publish Date - Jul 13 , 2025 | 01:22 PM
లార్డ్స్ టెస్ట్‌లో బంతుల మార్పు అంశం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో అంపైర్లు వ్యవహరిస్తున్న తీరుపై బిగ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇదే క్రమంలో ఓ బాల్ చేంజ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న లార్డ్స్ టెస్ట్‌లో ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ కంటే కూడా ఇతర విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా బంతి మార్పు అంశంపై భారీగా చర్చలు నడుస్తున్నాయి. డ్యూక్స్ బంతుల ఆకారం పదే పదే మారుతుండటం, బంతి త్వరగా మెత్తబడుతుండటంతో ఇరు జట్ల ఆటగాళ్లు మండిపడుతున్నారు. బంతిని మార్చాలంటూ అంపైర్లు, మ్యాచ్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మ్యాచ్ మధ్యలో బంతుల బాక్స్ తీసుకురావడం, బంతి మార్పు కోసం ఐదు బంతుల్ని చెక్ చేయడం హాస్యాస్పదంగా మారింది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
బాక్స్‌లో ఎందుకున్నాయి?
భారత ఇన్నింగ్స్ సమయంలో బంతి మార్చాల్సి రావడంతో బాల్ బాక్స్‌తో గ్రౌండ్‌లోకి దిగారు అంపైర్లు. బాక్స్‌లోని బంతుల్ని ఒక్కొక్కటిగా తీస్తూ చెక్ చేస్తూ పోయారు. రింగ్‌లో బంతుల్ని పెట్టి సైజ్‌ను పరిశీలించారు. అలా 5 బంతుల్ని చెక్ చేశాక.. చివరికి ఒక బంతిని సెలెక్ట్ చేశారు. ఇంగ్లండ్ టీమ్‌కు ఆ బంతిని అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. ఐదు బంతుల్లో ఒక్కటి కూడా రింగ్‌లోకి వెళ్లడం లేదు.. అలాంటప్పుడు అవి బాక్స్‌లో ఎందుకు ఉన్నట్లు? అంటూ భారత మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి కూడా సెటైర్లు వేశాడు.
కామెడీ చేసేశారు..
బంతి మార్పు అంశాన్ని కామెడీ చేసేశారు అంటూ అంపైర్లు, మ్యాచ్ అధికారులపై సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. బంతుల్ని తయారు చేసే కంపెనీ అయినా నిబంధనల్ని బట్టి రింగ్‌లో పట్టేంత సైజులో ఉండే బంతుల్నే అందించాలి కదా.. ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్ అనుకున్నారా.. గల్లీ క్రికెట్ అనుకున్నారా.. అంటూ సీరియస్ అవుతున్నారు. బంతిని ప్రతి పది, పదిహేను ఓవర్లకు ఓసారి మారుస్తూ పోస్తే సమయం వృథా కాదా? అని ప్రశ్నిస్తున్నారు. పూర్తి ఓవర్లు జరగడం లేదని, ఇది సరికాదని నెటిజన్స్ మండిపడుతున్నారు.
ఇవీ చదవండి:
రహానె ప్లానింగ్ మామూలుగా లేదుగా!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి